24 గంటలు : మీ సమయానికి మీరే బాధ్యులు

round silver colored wall clock

పనిలోపడి టైమ్ చూసుకోలేదు..అప్పుడే అంతటైమైపోయిందా!

ఈ మాటని మనందరం ఏదోఒక సందర్భంలో అనుకుంటూనే ఉంటాం. అవును పనులు…కాలాన్ని తమలోకి లాగేసుకుంటాయి. దాంతో కాలం ఎలా గడిచిపోయిందో మనం గమనించలేము. కాలం మన దోసిలిలోని ఇసుకలా జారిపోయిందని, కర్పూరంగా కరిగిపోయిందని, కాలం ఎవరికోసమూ ఆగదని, అది చాలా కఠినమైనదని…ఇలా రకరకాలుగా కాలాన్ని వర్ణిస్తుంటారు కవులు రచయితలు.

నిజమే… మన కళ్లకు గంతలు కట్టి దొంగలా జారుకునే కాలాన్ని పట్టుకోవటం చాలా కష్టం. అయినా సరే మనం దాని వెంట పరుగుల తీస్తూనే ఉంటాం. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే…జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది మరి.

టైమ్ విషయంలో ఆడవాళ్లే ముందుంటారు

దాదాపు అన్ని ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉదయం పూట కాలంతో పాటు పరుగులు తీస్తుంటారు.  రెండు నిముషాల్లో టిఫిన్ పెట్టెస్తా…ఐదునిముషాల్లో బాక్స్ కట్టేస్తా….పదినిముషాల్లో వంటయిపోతుంది.. లాంటి మాటలు చాలా అంటుంటారు. కానీ పాపం వారు అనుకున్నట్టుగా పనులు… ఐదు పది నిముషాల్లో పూర్తి కావు..వాటికి చాలా సమయం పడుతుంది.

దాంతో అయ్యో టైం ఇంతయిపోయిందే…ఇంకాస్త ముందు లేవాల్సింది…అనుకుంటూ తమతోపాటు కాలాన్ని కూడా తిట్టుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితులు తలెత్త కుండా ఉండాలంటే…కాలంతో మరికాస్త జాగ్రత్తగా ఉండాలి…సమయంతో స్నేహం చేయాలి.

సమయం సరిపోవటం లేదు…అనేవాళ్లలో ఆడవాళ్లే ముందుంటారు. అది కూడా ఉద్యోగాలు చేస్తూ ఇంటి బాధ్యతలను నిర్వర్తించేవారు. వీరికి నిరంతరం ఉండే సమస్య ఇంటికి ఆఫీస్ పనికి రెండింటికీ న్యాయం చేస్తున్నామా లేదా అనే ఆందోళన. ముఖ్యంగా పిల్లలపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నామే…అనే బాధ ఎప్పుడూ ఓ మూల వేధిస్తూనే ఉంటుంది. ఇలాంటివారు ఎలాగైనా పిల్లలకోసం సమయం ఇవ్వాలి…అనుకుంటారు కానీ అది చాలాసార్లు సాధ్యం కాకపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే…తమ లక్ష్యాన్ని ఒక్కమాటలో అనుకుని ఊరుకోకుండా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవాలి.

  • పిల్లల టైం టేబుల్ ఎలా ఉంది?
  • ఏ సమయంలో వారు ఏం చేస్తున్నారు?
  • ఏ టైం లో తను వారితో ఉండే అవకాశం ఉంది?

అనే విషయాలను నిశితంగా పరిశీలించుకుంటే…మార్గం కనబడుతుంది. ఉదాహరణకు వారిని రాత్రులు త్వరగా నిద్రపుచ్చితే…ఉదయం త్వరగా నిద్రలేపి తను ఇంటి పని చేసుకుంటూ వారితో వ్యాయామం చేయించడం, చదివించడం లాంటి పనులు చేయవచ్చు. అలాగే తాము చేస్తున్న పనుల్లో దేనికి ఎంత సమయం పడుతుంది…అనే అంచనా సరిగ్గా ఉంటే టైం ని మరింత బాగా మేనేజ్ చేయవచ్చు.

ఉదాహరణకు ఒక మహిళ తాను ఇంటి పని మొత్తం గంటన్నరలో ముగించగలను అనుకుంటే…ఆమెకు రెండున్నర గంటలు పట్టిందనుకోండి… అప్పుడు ఆమె చేయాలనుకున్న ఇతర పనులు వెనక్కు పడిపోవచ్చు. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం అంటే…ఏ పనికి ఎంత సమయం పడుతుంది…అనేది తెలుసుకోవటంతో పాటు… ఏ పనులు అర్జంటు,  ఏ పనులు ముఖ్యమైనవి అనేది అర్థం చేసుకుని అలా విడగొట్టుకోవాలి.  అప్పుడు ఏవి ముందు చేయాలి…ఏవి తరువాత చేయాలి…అనేది అర్థమవుతుంది.

పనులను వాయిదా వేయడం మానండి

కొంతమందికి పనులు చేయటానికంటే వాటిని గురించి ఆలోచిస్తూ…ఆందోళన పడటానికి ఎక్కువ సమయం  ఖర్చయిపోతుంది. కఠినమైన పనులు, నచ్చనివి, ఇష్టంలేనివి, మొదలుపెట్టడానికి మనసు రానివి…ఇలా రకరకాల పనులు ఉంటాయి మన జీవితంలో. నచ్చినవాటిని, తేలిగ్గా ఉన్నవాటిని త్వరగా చేసేస్తారు ఎవరైనా కానీ నచ్చని పనులను అవి ఎంత ముఖ్యమైనవైనా వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయటం వలన ఆ రోజు చేసి తీరాల్సన పని వెనక్కు వెళ్లిపోయి…ఆ సమయం ఇంకేదో అవసరం లేని పనికి ఖర్చయిపోతుంది.

కాలాన్ని సద్వియోగం చేసుకోవాలంటే….కష్టంగా అనిపించినా…వెంటనే చేసేయటం అలవాటు చేసుకోవాలి. దానికి సంబంధించి చిన్న అడుగయినా వేస్తే…తరువాత ఆ పనిని చేయటం సాధ్యమవుతుంది.  ఒకవారంలో పదిరోజుల్లో లేదా నెలలో చేయాల్సిన పనులను రాసిపెట్టుకుంటే…వాటికి తగిన సమయాన్న కేటాయించే అవకాశం ఉంటుంది. అనవసరంగా  టైం వేస్ట్ చేసి…సరిగ్గా పనిని చేసి తీరాల్సిన సమయంలో హడావుడి పడటం ఉండదు.  అలాంటి లిస్టుని ఎప్పుడూ మీతో ఉంచుకోవటం మంచిది.

మీ సమయాన్ని మీ లక్ష్యం మీదనే వెచ్చించండి

అలాగే చాలా సందర్భాల్లో తమ లక్ష్యాలు ఏమిటో నిర్ణయించుకున్నాక కూడా వాటికి సంబంధం లేని పనుల్లో కాలయాపన చేస్తుంటారు కొందరు. ఉదాహరణకు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్న తల్లి…అవసరం లేకపోయినా ఆఫీసులో ఎక్కువ సమయం ఉండటాన్ని నివారించాలి. పనులకు సమయ కేటాయించుకున్నాక…ఆ షెడ్యూలుని పాటించాలి. అలా కాకుండా అది మనం తయారుచేసుకున్న టైం టేబులే కదా…దానిని పాటించకపోయినా ఏమీ కాదనుకుంటే…సమయాన్ని చేతులారా దుర్వినియోగం చేసినట్టవుతుంది.

సమయాన్ని ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవాలని అనుకునే వారు కూడా దానిని అంత గట్టిగా పట్టుకోలేరు. ఏదో ఒక విధంగా వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఉదాహరణకు పనుల మధ్యలో విరామం తీసుకుని  ఓ పావుగంట సోషల్ మీడియాకో లేదా మరేదైనా కాలక్షేపానికో వినియోగిస్తుంటారు.   కానీ అలా రోజులో నాలుగుసార్లు పావుగంట చొప్పున సమయాన్ని వృథా చేస్తే మొత్తం గంట సమయం వేస్టయి పోతుందని అర్థం చేసుకోవాలి.

టెక్నాలజీతో చాలా సమయం మిగులుతోంది

ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో టెక్నాలజీ చాలా వరకు ఉపయోగపడుతోంది. అది మన సమయాన్ని   ఆదా చేస్తోంది.   అలాగే సమయాన్ని వృథా చేస్తోంది కూడా. అవసరమైనంత వరకే దానిని వాడుకోవటం కత్తిమీద సాములా మారుతోంది. ఉదాహరణకు ఏదైనా అవసరం ఉండి నెట్ ని సెర్చ్ చేస్తున్నపుడు…అంతవరకే అందులో ఉండి …తిరిగి పనిలోకి రావాలి. కానీ…మరేదైనా ఆసక్తికరమైన విషయం కనబడితే పదినిముషాలే కదా అని అందులో ఉండిపోకూడదు. టెక్నాలజీతో పనిచేసేటప్పుడు ఇలాంటి టైం వేస్ట్ పనులు చేయకుండా తమని తాము నియంత్రించుకోవాలి.

ప్రతిపనికి ఒక పరిమిత సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవటం వలన ఎక్కడ సమయం వృథా అవుతున్నదో అర్థం అవుతుంది. మెయిల్స్ చెక్ చేసేటప్పుడు వెంటవెంటనే వాటిని పరిష్కరించడం మంచిది. అవసరం లేనివాటిని అప్పటికప్పుడు డిలీట్ చేయటం, అప్పటికప్పుడు సమాధానం ఇవ్వాల్సిన వాటికి ఇవ్వటం, ఇతరులకు పంపాల్సిన వాటిని పంపటం…ఇలా చేయటం వలన పని పెండింగ్లో ఉందనే ఒత్తిడి ఉండదు.

ఇది అవసరమా అని ఆలోచించండి

ఇక లంచ్ బ్రేక్ అనేది కూడా ఒక్కోసారి సమయాన్ని మింగేస్తుంది. ఆకలి లేకపోయినా..ఆ సమయంలో పనినుండి బయటకు వచ్చేస్తుంటారు కొందరు. అలా కాకుండా తినాలనిపించినప్పుడు మాత్రమే బ్రేక్ తీసుకుంటే మంచిది. వీటన్నింటితో పాటు…పనిలోంచి కాస్త విరామం తీసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లటం, కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లటం …ఇవన్నీ కూడా మనకున్న సమయంలోనే అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే అయ్యో విశ్రాంతి లేదే అని బాధపడాల్సిన అవసరం ఉండదు.

ప్రతి మనిషికి ఉండేది రోజుకి ఆ ఇరవై నాలుగు గంటలే. అదే సమయంలో కొంతమంది చాలా పనులను చేస్తే కొందరు…అనుకున్నవేమీ చేయలేకపోతారు. కొంతమందికి సాధ్యమవుతున్నదంటే…అందరికీ సాధ్యమవుతుందనే కదా అర్థం.

సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో విజయాలు సాధించినవారి జీవిత చరిత్రలు ఈ విషయంలో స్ఫూర్తినిస్తాయి. మన చుట్టుపక్కల అలాంటివారు ఉన్నా…వారి సలహాలు సహకారం తీసుకోవచ్చు. సమయమే…మన జీవితం అని గట్టిగా అనుకుంటే…అనుకున్నది సాధ్యమవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top