Emotional Intelligence: ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ఉంటే గెలుపు మీదే..!

Emotional Intelligence

అతను కోపం వస్తే మనిషి కాదు… ఆమె ఊరికే ఏడ్చేస్తుంది… అబ్బో ఆ అబ్బాయికి చాలా ఆవేశం… ఎప్పుడూ అరిచేస్తుంటాడు… ఇలాంటి మాటలను మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదా…  ఉప్పుకారాలు ఎక్కువగా వేస్తే  కూరలు ఎలా పాడైపోతాయో అలాగే శ్రుతిమించిన భావోద్వేగాలు మన జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి. మనలోని ఎమోషన్లను ఎక్కడ ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకే చూపించడాన్ని ఎమోషనల్ ఇంటిలిజెన్స్ అంటారు.

What is Emotional Intelligence?

పం, ఒత్తిడి, ఆందోళన, చిరాకు, అసహనం… ఇలాంటి భావాలు తరచుగా మనమీద దాడి చేస్తున్నాయంటే అర్థం… మనమీద మనకు అదుపు లేదని. సంతోషంగా ప్రశాంతంగా సహనంగా ఉండే శక్తిని కోల్పోతున్నామని. మన భావోద్వేగాలపై  మనకు అదుపు లేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి పరికరాలుగా ఉపకరించే అంశాలున్నాయి… అవేంటో తెలుసుకుందామా.

మన ఆలోచనకంటే వేగంగా మనలోంచి వచ్చేస్తాయి మన భావోద్వేగాలు. అందుకే అలా జరుగుతుంటుంది. భయం, బాధ, కోపం, దు:ఖం, సిగ్గు… ఇవేకాదు ఆనందం, ఉత్సాహం, ప్రేమ లాంటివి అతిగా వచ్చినా, ప్రదర్శించినా  సమస్యలకు దారితీయవచ్చు. ఒక వ్యక్తిలో మానసికంగా మార్పులు రావాలంటే తప్పకుండా అతను లేదా ఆమెలోని భావోద్వేగాల్లో మార్పులు రావాలి. అయితే అలాంటి మార్పు రావాలంటే మొదట భావోద్వేగాలను అర్థం చేసుకోవటం ముఖ్యం. మన చేతుల్లో ఏదైనా వస్తువు ఉంటే మనం దాన్ని విసిరేయాలని అనుకుంటేనే పడేస్తాం. కానీ ఎమోషన్ అలా కాదు… మనకి లాభం చేకూర్చని, మనకు నచ్చని భావోద్వేగాలు చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే బయటకు వెళ్లిపోతుంటాయి.

అలాంటివారికి  ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే శక్తి కూడా ఉండదు. వారికి ఎమోషనల్ ఇంటిలిజెన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ఒత్తిడిని, ఆందోళనని నియంత్రించుకోలేనివారిలో ఇది మరింతగా జరుగుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఆశించేవారు తమ ఇంద్రియాలను ఉపయోగించుకుని… మనసుకి నచ్చిన చిత్రాలు చూడటం, సువాసనలు పీల్చడం, సంగీతం వినటం, ఆప్తులు లేదా పెంపుడు జంతువులను స్పృశించడం లాంటివి చేయటం ద్వారా నెగెటివ్ భావోద్వేగాలను తగ్గించుకునే అవకాశం ఉంది.

Emotional Intelligence ఎమోషనల్ ఇంటిలిజెన్స్ అంటే భావోద్వేగపరమైన మేధస్సుని సాధన ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉంది. మన మనసులోని భావాలను బలంగా స్పష్టంగా చెప్పగలగటం, అలాగే ఇతరులను అర్థం చేసుకోవటం, జీవితంలో ఎదురైన సవాళ్లను సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవటం, ఆనందంగా ఉండగల మానసిక సామర్ధ్యాన్ని పెంచుకోవటం, మనలోని భావోద్వేగాలను పాజిటివ్ గా వినియోగించుకోవటం… వీటన్నింటినీ ఆచరణలో పెట్టగలగాలి. అవసరం లేకపోయినా ఆవేశం, కోపం చూపించడం, సందర్భానికి తగినట్టుగా కాకుండా అతిగా ప్రవర్తించడం లాంటివి చేయకూడదు. చొరవ ధైర్యాలను ప్రదర్శిస్తూ చేయాల్సిన పనులను వాయిదా వేయకుండా చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోవటం వలన సెల్ఫ్ మేనేజ్ మెంట్ అంటే స్వీయ నిర్వహణ సాధ్యమవుతుంది.

తమలోని భావోద్వేగాలను గుర్తిస్తూ… వాటివలన తమ ఆలోచనలు ప్రవర్తన ఎలా మారిపోతున్నాయో తెలుసుకోవాలి. దీనివలన మన బలాలు బలహీనతలు తెలిసి… ఆత్మవిశ్వాసంతో ఉండగలం. అయితే కొంతమంది తమలోని నెగెటివ్ ఎమోషన్లను గుర్తించినా గుర్తించనట్టే ఉంటారు. భావోద్వేగాలను అదుపు చేయడానికి ఆ పద్ధతిని పాటిస్తుంటారు. అయితే మనసులో చెలరేగుతున్న భావోద్వేగాలను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు… వాటిని అర్థం చేసుకున్నపుడు మాత్రమే మనం మనలోని ఒత్తిడిని తగ్గించుకుని సవ్యంగా ప్రవర్తించగలం. మనలోని ఎమోషన్లను అర్థం చేసుకోలేకపోతే… అసలు మనం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో మనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

మనం చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు పూర్తి అవగాహనతో స్పష్టమైన ఆలోచనలతో కలిసి ఉండాలి. లేకపోతే… తరువాత పశ్చాత్తాపమే మిగులుతుంది. బాగా ఎమోషనల్ గా ప్రవర్తించేవారు మెదడుతో ఆలోచించకుండా ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకుంటారు. కోపం, ఈర్ష్య, అసూయ, బాధ, అపరాధభావం లాంటి ఆలోచనలు పదేపదేరావటం వలన వాటి నుండి తప్పించుకోవడానికి వ్యసనాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. తాగుడు, జూదం, అతిగా తినటం, కంప్యూటర్ గేములు, స్మార్ట్ ఫోన్ ని అతిగా వాడటం లాంటివాటికి బానిసలుగా మారిపోయే అవకాశం ఉంది.

కొంతమంది తమలోని భావోద్వేగాలు బయటకు కనిపించకుండా ఉండటానికి  ఎప్పుడూ ఏదో ఒక మూడ్ లో ఉంటూ ఉంటారు. ఉదాహరణకు అవసరం ఉన్నా లేకపోయినా జోకులు వేయటం, లేదా వ్యంగ్యంగా మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే Emotional Intelligence ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ని పెంచుకుని తీరాలి. ఒత్తిడిని నివారించే రిలాక్సేషన్ వ్యాయామాలు. ధ్యానం వంటి వాటిని జీవనశైలిలో భాగంగా మార్చుకోవటం ద్వారా… భావోద్వేగపరమైన మేధస్సుని పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఏ పని సాధించాలన్నా మనకు తగిన పరికరాలు కావాలి. ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ని సాధించడానికి కూడా ఇప్పటివరకు మనం చెప్పుకున్న అంశాలు టూల్స్ లా పనిచేస్తాయి. వీటితో… మనకు మనం హానిచేసుకునే మనస్తత్వంనుండి బయటపడగలుగుతాం. ఒత్తిడిని, ఆందోళనని త్వరగా తగ్గించుకోగలం. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ మనకు అర్థమవుతుంటాయి. మన కలల వెంట మనం ప్రయాణం చేయగలం. ఒక్కమాటలో చెప్పాలంటే భావోద్వేగపరమైన మేధస్సుతో మన లోపాలపైన మనం విజయం సాధించగలం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top