Pregnancy: గర్భిణీ అలసిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే !

Pregnant Morning sickness

ఒకవైపు ఆనందం, మరోవైపు రకరకాల ఆలోచనలు ముసురుకుంటాయి, గర్భిణీలలో మొదటి మూడు నెలల్లో చాలా ఆశ్చర్యకరమైన మార్పులు కనబడతాయి. నాలుగు నుంచి ఆరు నెలల మధ్యకాలం బాగా ఆనందించే సమయమని చెప్పాలి. ఆతరువాత మాత్రం కాన్పుకు సంబంధించిన భయాందోళనలు మొదలవుతాయి. మొత్తంగా గర్భధారణ మొదలుకొని కాన్పు దాకా గర్భిణి ఒకరకమైన వత్తిడిలో అలసటతో ఉండవచ్చు. తగిన కౌన్సిలింగ్, విశ్రాంతి, వ్యాయామం లాంటి చర్యల ద్వారా ప్రశాంతంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది.

గర్భిణికి నెలలు నిండేకొద్దీ శారీరకంగా అనేక మార్పులు వస్తుంటాయి

అనేక నియమాలు పాటించటం ఒక వంతయితే, సరైన అవగాహన లేకపోవటం వలన ఏవేవో ఊహించుకొని కంగారు పడటం మరో వంతు. అలసటగా, నిస్సత్తువగా అనిపించటం లాంటి లక్షణాలను మొదట్లోనే గుర్తించి ఆహ్లాదకరంగా ఉంచగలిగితే గర్భధారణను బాగా ఆనందించగలుగుతారు. అందువలన సాధారణంగా గర్భిణులు ఎలా ఆలోచిస్తారు, ఏ విషయంలో టెన్షన్ కు గురవుతారు అనే విషయాలు గ్రహించి వారిని ప్రశాంతంగా ఉంచగలగటం చాలా అవసరం.

గర్భ ధారణ సమయంలో ఉన్న ఆనందం కాన్పు దాకా కొనసాగటం చాలా అవసరం

నిజానికి సాధారణ ప్రసవం కావాలనుకే వాళ్లు కచ్చితంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. గర్భధారణను ఆనందంగా తీసుకోవాలి. ఒత్తిడికి గురయ్యే గర్భిణులు తమ ఆరోగ్యంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి కూడా హాని చేస్తారు. రోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలుంటాయి. దానివలన శరీరంలో శక్తి పెరిగి ఉత్సాహంగా ఉంటారు. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

గర్భం దాల్చిన సమయంలో తీసుకునే ఆహారం మీద శ్రద్ధ చూపించాలి. ఇది బిడ్డ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన పోషకాలు తీసుకోవడం వల్ల పని ఒత్తిడిని తట్టుకునే శక్తిని పొందవచ్చు. అదే సహజ ప్రసవానికీ దోహదం చేస్తుంది. తగినంత ద్రవాహారం తీసుకుంటూ డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవాలి. పని ఒత్తిడిని తగ్గించి, సాధారాణ ప్రసవం అయ్యేందుకు నీళ్లు బాగా సహాయపడతాయి. టబ్‌లో గోరు వెచ్చటి వేడినీళ్లు నింపి ఎంతసేపు  వీలైతే అంతసేపు ఆ నీటిలో గడపాలి. అప్పుడు వంటి నొప్పులు తగ్గిపోయి దేహం తేలిగ్గా అనిపిస్తుంది.

బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వలన నొప్పి లేని  నార్మల్ డెలివరీ అవుతుంది. ఆక్సిజన్ బాగా అందితే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. గర్భిణులు భయం కలిగించే కథలు వినటం, సినిమాలు చూడటం మంచిది కాదు. స్నేహితులు, బంధువులుతో మాట్లాడుతూ ఉంటే ఒత్తిడి తగ్గిపోతుంది. కాబోయే తల్లులకోసం నడిపే  క్లాస్‌లకు వెళ్లడం మంచిది. బిడ్డ పుట్టే సమయంలో గర్భిణులకు చివరి నెలల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై సలహాలు తీసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలసి పోతున్నామనే భావన రాకూడదు. అలాగే నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి.

గర్భిణులు ఒత్తిడికి దూరంగా ఉండాలంటే!

గర్భిణిలో కొన్ని అలసట లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు. ఎక్కువ ఒత్తిడి, నడిచే భంగిమ లేదా కూర్చునే భంగిమ స్థిరంగా లేకపోవటం దానికి ఆనవాళ్ళు.  పిండాభివృద్ధి కోసం స్త్రీ శరీరం కఠినంగా పని చేయటం వలన సహజంగానే అలసట కలుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు, రక్తపోటులో మార్పులు అలసటకు దోహదపడతాయి.

అయితే అలసటను ఎదుర్కోవటానికి ఆహారంలో,  జీవనశైలిలో మార్పులు బాగా దోహదపడతాయి. నిజానికి అలసట అనేది గర్భ సమయంలో బహిర్గతమయ్యే ప్రారంభ లక్షణం అనుకోవచ్చు. పెరిగిన ప్రొజెస్టెరాన్ స్థాయి వలన గర్భిణులు అలసటకు గురవుతుంటారు. చాలా మంది మొదటి త్రైమాసిక దశ ముగింపు వరకూ అలసటకు గురవకూడదని ఆశిస్తుంటారు. కానీ గర్భిణి ఏ సమయం లోనైనా అలసటకు గురి కావచ్చు. శరీరంలో రక్తపోటు, రక్తంలోని చక్కెర స్థాయి తగ్గటం, రక్తం ఉత్పత్తి పెరగటం వలన కూడా గర్భిణులు మగతకు గురై అలసట చెందుతారు.

గర్భిణులలో ఆందోళన వలన కూడా అలసట ఎక్కువవుతుంది. అలాంటి ఆందోళన కనిపించినప్పుడు మానసిక ప్రశాంతత కల్పించటానికి కొన్ని  చిట్కాలు తెలుసుకోవటం తప్పనిసరి. గర్భధారణ జరిగిన క్షణం మొదలుకొని జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో అన్ని భయాందోళనలూ పంచుకోవటం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. వాళ్ళ మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తుంది.

ఆలోచనలను డైరీలో రాసుకోవటం కూడా ఒకరకమైన రిలాక్సేషన్ అని మానసిక నిపుణులు చెబుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్లు క్రమబద్ధం అవుతాయి. ఎండార్ఫిన్ విడుదలైతే మూడ్ మెరుగవుతుంది. నరాలు రిలాక్స్ కావటానికి బ్రీతింగ్ ఎక్సర్ సైజులు, యోగా, ధ్యానం వంటివి పనిచేస్తాయి. ఆరో నెల తరువాత విశ్రాంతి చాలా అవసరం. పొట్ట సైజ్ పెరుగుతుంది కాబట్టి.. శిశువు ఆరోగ్యంగా ఉండేలా శక్తి పెంచుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

గర్భిణీలలో అలసట పెంచే అంశాలు, పాటించాల్సిన చిట్కాలు

చివరి మూడు నెలల్లో గర్భిణుల్లో ఎన్నో భయాలు మొదలవుతాయి. ఇరుగుపొరుగు వాళ్ళు, బంధువులు చెప్పినవి నమ్మి అవసరానికి మించి కంగారు పడిపోతూ ఉంటారు. ఇలా ఆందోళనకు గురవటం గర్భిణికీ, బిడ్డకూ ఇద్దరికీ క్షేమం కాదు. కదలికలు లేకపోతే బిడ్డ దక్కటం కష్టం అని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం అది కాదు. కొంతమందిలో పొట్టలో బిడ్డ కదలికలు తక్కువగా ఉంటాయి. ఇంకొందరిలో ఎక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదు.

బిడ్డ ఆరోగ్యానికీ కదలికలకూ సంబంధం లేదు. నెలలు నిండినప్పుడు వ్యాయామం చేయకూడదు అని కొంతమంది హెచ్చరిస్తుంటారు. అయితే గర్భిణులు వ్యాయామం చేయటం వల్ల గర్భంలోని బిడ్డకూ ఉపయోగం ఉంటుంది. వ్యాయామం చేసే గర్భిణుల బిడ్డల గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు,  తగిన బరువుతో పుడతాడు. గర్భంలో ఉన్న బిడ్డ మీద బాహ్య ప్రభావం ఉండదు అనే అపోహ ఉంది. కానీ గర్భిణి పీల్చే గాలి, తినే ప్రతి పదార్ధం ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. కాబట్టి గర్భిణులు రసాయనాలకు దూరంగా ఉండాలి. కృత్రిమ రంగులు, వాసనలు, రుచులు కలిపిన పదార్థాలు తినకూడదు. మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.

మందులను డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. గర్భిణులందరూ ఎంతో ఆనందంగా ఉంటారని, తాను మాత్రమే డిప్రెషన్ లో ఉన్నానని చాలా మంది గర్భిణులు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా నిజం కాదు. మిగతా స్త్రీలకు లాగే గర్భిణుల్లో కూడా  మూడ్‌ డిజార్డర్లు ఉంటాయి. డిప్రెషన్‌ వల్ల నెలలు నిండకుండానే ప్రసవిస్తారు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం లాంటివి  కూడా జరుగుతాయి. కాబట్టి డిప్రెషన్‌గా అనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top