World Mental Health Day: మానసిక అశాంతి శాపం కాకూడదు !!

World Mental Health Day 2023

జీవితంలో మనం ఏం సాధించాలన్నా అందుకు మన మనసు, ఆలోచనలు సహకరించాలి. అంటే అది మనకు మనం అందించుకునే సహాయమన్న మాట. అలాంటి మ‌న‌సే…వ్యాధులకు గురయి మొరాయిస్తే…అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మనపై మనం తీసుకునే శ్రద్ధలో మానసిక ఆరోగ్యం మొదటి స్థానంలో ఉండాలి.  అదే లేకపోతే మ‌నం చేయాల్సిన ప‌నుల‌ను ఏమీ చేయ‌లేము. అప్పుడు మ‌న తెలివితేట‌లు స‌మ‌ర్ధ‌త అన్నీఏమైపోతాయో కూడా తెలియ‌దు. మాన‌సిక స‌మస్య‌లు, రుగ్మ‌త‌లు  మన జీవితంపై అంతటి ప్ర‌భావాన్ని చూపుతాయి.

World Mental Health Day

మెద‌డుని మెలిపెట్టి జీవితాన్ని ముందుకు క‌ద‌ల‌నీయ‌ని మాస‌సిక వైక‌ల్యాలు ఎన్నోర‌కాలు ఉన్నాయి. అన్నింటిలోనూ ఏదోఒకస్థాయిలో స‌మ‌స్య‌లు ఇబ్బందులు బాధ‌లు ఉంటాయి. మాన‌సిక వైక‌ల్యం తీవ్ర‌స్థాయిలో ఉన్న‌పుడు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డి జీవించే పరిస్థితి ఎదురుకావ‌చ్చు. మాన‌సిక వ్యాధులకు వైద్యుల స‌ల‌హాతో శ్ర‌ద్ధ‌గా చికిత్స తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

శ‌రీరానికే కాదు మ‌న‌సుకి వ‌చ్చేవ్యాధులూ త‌క్కువేమీ కాదు. డిప్రెష‌న్ నుండి ర‌క‌ర‌కాల ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్లు, ఫోబియాలు, వ్యాధుల వ‌ర‌కు మాన‌సిక రుగ్మ‌త‌లు ఎన్నో….ఎంతో మంది జీవితాల్లో స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నాయి.   పుట్టుక‌తో కాకుండా వ‌య‌సు పెరిగిన త‌రువాత మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు గురయినా ఆప్రభావం చాలాతీవ్రంగా ఉంటుంది. రోజువారీ జీవితం, కుటుంబ, వృత్తి ప‌ర‌మైన జీవితాలు, మాన‌వసంబంధాలు అన్నీదెబ్బ‌తింటాయి. జీవితంలో అన్నింటా వెనుకబడే ప్రమాదం ఉంటుంది.  అందుకే మాన‌సిక స‌మ‌స్య ఉంద‌ని తెలుసుకున్న వెంట‌నే చికిత్స తీసుకోవ‌టం అవ‌స‌రం.

మనసు పగిలితే అతకదు అంటూ ఉంటారు. అంత సున్నిత‌మైన‌ది కాబ‌ట్టే దానికి స‌మ‌స్య‌లు వ‌చ్చేఅవ‌కాశం చాలా ఎక్కువ‌. ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్పుడు డిప్రెష‌న్, ఒత్తిడి, ఫోబియాలు వంటివి స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌పుడు వాటిని ప‌రిష్క‌రించుకోకపోతే, అవి వాటి బాధితుల‌ను డిజేబుల్డ్ పర్సన్స్ గా  మార్చేస్తాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top