కాన్పు తరువాత పొట్టపై వచ్చే చారికలను తొలగించాలంటే?

Strech Marks after delivery

ఆడవాళ్లలో కాన్పు తరువాత ఎన్నో శారీరకమైన మార్పులు సహజంగా వస్తాయి. దినచర్యలో, నిద్రపోయే సమయంలో మార్పులు వస్తాయి. వీటితోబాటే వచ్చే ఒక భౌతికమైన మార్పు వంటిమీద చారికలు ఏర్పడటం. వీటినే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. పిల్లలు పుట్టాక డయపర్స్ తో, ఆహారం తినిపించటంతో ఎంతగా అలవాటు పడతారో ఈ చారికలకూ అంతగా సిద్ధం కావాల్సిందే. గర్భిణిగా ఉన్నప్పుడు బిగుతుగా ఉన్న పొట్ట ఆ తరువాత కాలంలో లావెక్కే కొద్దీ  దాని చుట్టూ చారలు ఏర్పడటం గమనిస్తారు. రెండో కాన్పు తరువాత పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇలా కాన్పు తరువాత  ఏర్పడే గీతలను తొలగించుకోవచ్చునా, అసలు అవి రాకుండానే జాగ్రత్తపడే అవకాశముందా?

బాలింత దేహం పెరిగినంత వేగంగా చర్మం పెరగకపోతే వంటిమీద చారలు ఏర్పడతాయి.  చర్మానికి అడుగున సాగే లక్షణమున్న నారలాంటి పోగులు తెగటం మొదలుపెడతాయి. దీని ఫలితమే బాలింత వంటిమీద ఏర్పడే చారలు.  మామూలుగా 9 నెలల గర్భధారణ సమయంలో సగటున 12 నుంచి 14 కిలోల మేరకు బరువు పెరుగుతారు. అంత వేగంగా పెరగటం వలన  ఈ చారలు ఏర్పడి కాన్పు తరువాత అవి  స్పష్టంగా కనబడతాయి.

చారలు ఎందుకు ఏర్పడతాయి?

గర్భధారణలో పరిమాణం పెరిగే భాగాల్లోనే చారలు ఏర్పడతాయి. ప్రధానంగా పొత్తికడుపు మీద, స్తనాలమీద, నడుము మీద, పిరుదులమీద, తొడలమీద  ఇవి ప్రత్యక్షమవుతాయి. అయితే కాలం గడిచే కొద్దీ అవి గమనించలేనంతగా మాయమవుతాయి. గర్భిణులలో చివరి త్రైమాసికంలో కనబడటం సహజం. చికిత్స సాయంతో  ఇవి  కొంతవరకు మరుగున పడతాయి తప్ప పూర్తిగా మాయమై పోవు. నిజం చెప్పాలంటే ఈ చారికల వలన నొప్పిగాని మరేవిధమైన హాని గాని కలగవు. కానీ కొంత మంది మాత్రం వాటి గురించి తలచుకొని పదే పదే బాధపడుతుంటారు. ఈ చారికలు అందరిలోనూ ఒకే విధంగా ఉండవు.

చర్మం స్వభావాన్ని బట్టి, అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఎంతకాలంగా ఉన్నాయనేదాన్నిబట్టి వేరు వేరుగా ఉంటాయి. గీతల్లాగా చర్మం మీద పేర్చినట్టు ఉంటాయి. ఎరుపు, నలుపు, ఊదా, నీలం రంగులో ఉండి క్రమేపీ ఛాయ తగ్గుతూ కనిపిస్తాయి. కొంతమందిలో దేహంలో చాలా భాగంలో ఇవి పరుచుకొని కనబడతాయి. అలా శరీరం మీద ఎక్కువ భాగం వ్యాపించి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి. వాటిని పరీక్షించిన మీదట చికిత్సకు ఎలాంటి అవకాశాలున్నాయో తెలుస్తుంది. చర్మం సాగదీతకు గురికావటం వలన చారలు ఏర్పడినా వాటి తీవ్రత మాత్రం జన్యుపరమైన కారణాలు, చర్మం మీద వత్తిడి, అడ్రినల్ గ్రంధులు ఉత్పత్తి చేసే కార్టిజోన్ అనే హార్మోన్… చర్మపు ఎలాస్టిక్ ఫైబర్ ను బలహీనపరచట అనే అంశాలమీద ఆధారపడి ఉంది.

చికిత్సతో చారలను కనిపించకుండా చేయవచ్చా?

డాక్టర్ ను సంప్రదిస్తే ఈ చారలను నిశితంగా పరీక్షించి, వైద్య చరిత్రను సమీక్షించి వాటికేమైనా చికిత్స ఉందేమో నిర్థారిస్తారు. ఒకవేళ కార్టిజాల్ ఉత్పత్తి పెరగటం వల్లనేనని డాక్టర్ కు అనుమానం వస్తే అదనపు పరీక్షలు జరిపించాలని కూడా సిఫార్సు చేయవచ్చు. ఈ చారికలు ఎంతగా నచ్చకపోయినా సరే, నిజానికి వాటికి చికిత్స మాత్రం అక్కర్లేదు. వాటివలన ఎలాంటి అపాయమూ ఉండదు. కాలక్రమంలో అవి మాయమవుతాయి. ఒకవేళ కచ్చితంగా చికిత్స తీసుకొని తీరాలనుకుంటే మాత్రం ఒక ఆ చికిత్స ప్రభావం పాక్షికంగానే ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. చికిత్స తీసుకున్నా పూర్తిగా నయమయ్యే అవకాశం లేదు. చారల తీవ్రతను తగ్గించటానికి కొన్ని మందులు వాడకంలో ఉన్నప్పటికీ పూర్తిగా తగ్గించగలిగినట్టు ఆధారాలేమీ లేవు.

విటమిన్ ఎ తో బాటు రెటినాయిడ్స్ నుంచి తయారుచేసిన రెటినాయిడ్ క్రీమ్ ను చారలు ఏర్పడ్డ మొదటి నెలలోనే వాడితే కొంత ఫలితం కనిపించవచ్చు. అది కొలాజెన్ ను పునర్నిర్మించటం వలన చారలు కూడా దాదాపుగా చర్మం లాగానే కనబడటం మొదలవుతుంది. అయితే కొంతమంది విషయంలో  ఈ క్రీములు చర్మం మీద రియాక్షన్ చూపించే ప్రమాదముంది. గర్భిణిగా ఉన్నా, బాలింత అయినా వీటిని వాడాలనుకుంటే ముందుగా డాక్టర్ అనుమతి తీసుకోవటం మంచిది. వాటి దుష్ఫలితాలు శిశువుమీద పడకుండా చూసుకోవాలి. లేజర్ థెరపీ ద్వారా కొల్లేజన్ ఎదిగేలా చేయటానికి, చర్మంలోకి స్ఫటికాలు పంపే మరో ప్రక్రియ పట్ల కూడా కొంతమంది  మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎంతకాలంగా ఈ చారలు ఉన్నాయి, చర్మం స్వభావం ఏంటి? పదే పదే థెరపీలకు హాజరు కాగలరా? ఫలితం ఏ మేరకు ఆశిస్తున్నారు? ..అనే అంశాలను బట్టి చికిత్సకు డాక్టర్లు మొగ్గుచూపుతారు.

జన్యుపరమైన కారణాలు తోడవుతాయా?

గర్భధారణ కారణంగా చర్మం సాగదీతకు గురికావటం వలన ఇలా చారలు ఏర్పడతాయని తెలుస్తూనే ఉంది. అయితే, వాటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండవచ్చు. అలా ఉండటానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. జన్యుపరమైన కారణాలు, చర్మం మీద ఉండే వత్తిడి స్థాయి, అడ్రినల్ గ్రంధులు ఉత్పత్తి చేసే కార్టిజాన్ హార్మోన్ ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నది అనే అంశాలు చర్మానికున్న సాగే గుణాన్ని ప్రభావితం చేస్తాయి. ఎవరిలోనైనా ఈ చారలు రావచ్చు, కానీ కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా తొలి చూలు గర్భిణులకు, బాగా లావుగా ఉన్నవాళ్ళకు. చాలా వేగంగా బరువు పెరుగుతున్నవాళ్ళకు, తగ్గుతున్నవాళ్ళకు  ఇలా చారలు కనబడే అవకాశముంది. స్తనాల పరిమాణం పెంచుకోవటానికి శస్త్ర చికిత్స చేయించుకున్నవారికి కూడా చారలు ఏర్పడతాయి.

పొట్టపై చారలను నివారించే అవకాశాలు ఉన్నాయా?

కార్టికోస్టెరాయిడ్ మందుల వాడకం కూడా ఈ పరిస్థితికి దారితీయవచ్చు. అయితే చారలు ఏర్పడ్డాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళలో 90% మందికి గర్భం దాల్చిన ఆరేడు నెలల తరువాత కచ్చితంగా ఇవి వస్తాయని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. జన్యువులు కీలకం కాబట్టి ఒకావిడకు చారలు ఏర్పడితే ఆమె కూతురికి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. రంగు తక్కువ ఉన్నవాళ్ళకు వాళ్ళ చర్మపు రంగు కన్నా లేత చారలు ఏర్పడతాయి. కాస్త తెల్లగా ఉన్నవాళ్ళకు ఊదారంగు చారలు కనబడతాయి. ఇంతకీ వీటిని రాకుండా చూసుకోవటానికి ఏమైనా మార్గం ఉందా, అంటే…. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా జాగ్రత్తపడటం ఒక్కటే మార్గం. గర్భిణులు బరువు పెరగటం సహజమే అయినా తగిన మోతాదులో తింటూ అవసరమైన మేరకు వ్యాయామం చేయటం వలన చాలావరకు నివారించవచ్చు.

పూర్తిగా నివారించలేకపోయినా కొంతవరకు తీవ్రత తగ్గించవచ్చు

గర్భిణులందరూ తప్పనిసరిగా ఎదుర్కునే సమస్యల్లో ఒకటి… వంటిమీద చారలు ఏర్పడటం. ప్రసవానికి ముందే మొదలై ప్రసవానంతరం కూడా కొంతకాలం పాటు కొనసాగే ఈ సమస్య ఎలాంటి భౌతికమైన ఇబ్బందులూ కలిగించదు. అయినాసరే, వాటి ఉనికి వలన ఇబ్బందిగా అనిపించటమనే మానసిక వైఖరి నుంచి బైటపడటం చాలా మందికి సాధ్యం కావటం లేదు. చికిత్స వలన పెద్దగా మార్పు రాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతూనే ఉండగా ఏదో విధంగా కొంతలో కొంతయినా ఊరట పొందాలనే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top