పిల్లలు వీడియో గేమ్స్ కు బానిసలవుతున్నారా?…?

Mobile Addiction in Children

నలుగురితో కలిసి ఆరుబయట ఆడుకోవాల్సిన పిల్లలు నాలుగ్గోడల మధ్యనే ఉండిపోతున్నారు. టీవీ మాత్రమే వినోద సాధనంగా ఉంటోంది. ఈ మధ్య కాలంలో రకరకాల గాడ్జెట్స్ తో బాటు వీడియో గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తల్లిదండ్రుల పరోక్ష ప్రోత్సాహంతోనే ఇలా వీడియోగేమ్స్ కి అలవాటు పడుతున్నారు. మొదట్లో హాబీ గా అనిపించినా, పిల్లలు ఈ అలవాటుకు బానిసలవుతున్నారని, దాని ప్రభావం చదువు మీద, సామాజిక జీవితం మీద పడుతోందని అధ్యయనాలు తేల్చాయి. ఈ విషయంలో తల్లిదండ్రుల అప్రమత్తత ఎంతో అవసరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

పిల్లలు వీడియో గేమ్స్ వైపు మొగ్గుచూపటానికి కారణాలేంటి?

ఆడుకోవటానికి మైదానాలు, తోటి పిల్లలు లేకనే వీడియో గేమ్స్ కి అలవాటు పడుతున్నారనేది ఒక వాదన. తల్లిదండ్రులే పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇలాంటి వాటికి అలవాటు చేస్తున్నారనేది మరోవాదన, వీడియో గేమ్స్ వలన మెదడు చురుగ్గా తయారవుతుందని సమర్థించేవాళ్ళు కొందరైతే ఇది ఒక వ్యసనంలా తయారయ్యేదశ వచ్చిందని, మానసిక ఆరోగ్యానికి చేటు చేసే గేమ్స్ అందుబాటులోకి రావటం వల్లనే పిల్లలు గంటలకొద్దీ వాటిలో పడి చదువులని నిర్లక్ష్యం చేస్తున్నారని విశ్లేషిస్తున్నవారు మరికొందరు.

పాఠశాలల్లో ఆడుకోవటానికి మైదానాలు ఉండటం లేదు. ఉన్నా అవి ఐదు శాతం పాఠశాలల్లోనే  ఉంటాయి. అవి కూడా చాలీ చాలకుండా. అందువలన ఆరుబయట ఆహ్లాదంగా తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన పిల్లలు స్కూలు నుంచి రాగానే ఇంట్లోనే ఉండిపోతున్నారు. పదిమందితో కలిసి గెంతుతూ ఉత్సాహం నింపుకోవాల్సిన వయసులో టీవీ ముందు కూర్చోవటం అలవాటైంది. అయితే, ఇంట్లో ఎవరికి వాళ్ళు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవటం మొదలైన క్రమంలో పిల్లలకు వీడియో గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎలాగూ ఇంట్లో కంప్యూటర్, టాబ్లెట్, ఐ ప్యాడ్ లాంటివి అందుబాటులోకి రావటం కలిసి వచ్చింది. దీంతో పిల్లలు చిన్నారులు ఓ చోట కూర్చొని చేతివేళ్లను కదిలిస్తూ, వీడియోగేమ్‌ స్కోర్‌ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

4 ఏళ్ల వయసు పిల్లలు కూడా వీడియోగేమ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఇంట్లోవాళ్లు బయటకెళ్లకుండా లోపలే కూర్చొని ఆడుకోమని ఆజ్ఞాపించడం కూడా పిల్లలను వీడియోగేమ్స్‌వైపు ఉసిగొల్పుతున్నాయి. మరీ ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో అధికశాతం  పిల్లలు వీడియోగేమ్స్‌ రోజూ ఆడుతుంటే, వారిలో కనీసం సగం మంది చిన్నారులు ఆ ఆటలకు బానిసలవుతున్నారని తేలింది. ఆడపిల్లలు, మగపిల్లలు ఎంచుకునే ఆటలు కూడా వారి సాధారణ మనస్తత్వానికి తగినట్టే ఉంటున్నాయి. ఆడపిల్లలు పజిల్స్‌, ప్లాట్‌ఫామ్స్‌వంటి ఆటలు ఆడటానికి ఇష్టపడుతుంటే, సాహసోపేతమైన, యాక్షన్‌, క్రైం, చాలెంజింగ్‌ వంటి నేపథ్యమున్న ఆటలను మగపిల్లలు ఎక్కువ అడుతున్నారు. వీడియోగేమ్స్‌కు అలవాటైన వారిలో మగపిల్లల శాతమే ఎక్కువని అధ్యయనం చెబుతోంది.

పిల్లల మీద వీడియో గేమ్స్ ఎలాంటి ప్రభావాలకు దారితీస్తోంది?

వీడియోగేమ్స్‌ఆడటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. సవాళ్ళను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారు. దేన్నైనా సాధించాలనుకుంటే విజయం సాధించేవరకూ వదలరు. ఆలోచనలో చురుకుదనం పెరుగుతుంది. కానీ అంతకుమించి వచ్చే సమస్యలే ఎక్కువ అంటున్నారు పిల్లల వైద్యనిపుణులు. మొండి వైఖరి అలవడుతుంది. సున్నితత్వం మందగిస్తుంది. మానవ సంబంధాల పట్ల అవగాహన ఉండదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. పెద్దలు చెప్పిన మాటలు అసలు వినరు. పక్కవాళ్లను పడగొట్టి గెలవడమనో, కారు, బైక్‌ను అత్యంత వేగంగా నడిపి స్కోరుచేయాలనో, మారణాయుధాలతో ఇతరులను మట్టుబెట్టడం వంటి నేపథ్యమున్న ఆటలే ఎక్కువుంటాయి కనుక అవన్నీ పిల్లల వ్యక్తిత్వం, ఆలోచన, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఎక్కువ. అంటున్నారు నిపుణులు.

వంకరలు తిరిగిన రోడ్లపై అత్యధిక వేగంతో దూసుకుపోయే కారు రేస్‌గేమ్‌ ఒకటైతే, రోడ్డుమీద అడ్డొచ్చిన వారందరినీ హతమారుస్తూ, కనిపించిన వాహనాలను దొంగిలించి పారిపోయే వ్యక్తిని గెలిపించే ఆట ఇంకొకటి. ఇలాంటివి వెయ్యికిపైగా రకరకాల వీడియీ గేమ్స్ అందుబాటులో ఉండగా ఎప్పటికప్పుడు కొత్తవి వచ్చి చేరుతూనే ఉంటాయి.  ఎలాగైనా గెలవాలనే తపన,  గెలుస్తామా లేదో అనే ఆందోళన, ఇంటికి వచ్చీరాగానే  ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఆత్రుత. మొత్తంగా బాల్యం వీడియో గేమ్స్‌ సాలెగూటిలో చిక్కుకుంటోంది.  ఈఆటలన్నీ కూడా అతి తక్కువ సమయంలో స్పందించేవి కాబట్టి ఆటలో ఎలాగైనా స్కోరు సాధించాలనే తపన, ఆరాటం కారణంగా పిల్లల్లో ఆందోళన సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. ఇక కొన్నిసార్లు ఒత్తిడి, కుంగుబాటుకు దారితీస్తుంది.

పిల్లల్లో వీడియో గేమ్స్ ఒక వ్యసనంగా మారకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీడియోగేమ్స్‌లోకూడా పజిల్స్‌, లాజికల్‌, మ్యాథమ్యాటికల్‌ జిగ్‌జాగ్‌ వంటి కొన్ని మెదడుకు పదునుపెట్టే ఆటలూ ఉన్నమాట నిజమే అయినా పిల్లలు వాటి వరకే పరిమితం కారు. వారు హద్దుమీరే అవకాశాలే ఎక్కువ కాబట్టి అసలు వీడియో గేమ్స్ ను ప్రోత్సహించకపోవటమే మంచిది. ఎందుకంటే, ఆ ఆటలకే పరిమితమై చదువు, ఇతర ఆసక్తులు, అభిరుచులను గాలికొదిలేస్తే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. పిల్లలు అడిగిందే తడవుగా గాడ్జెట్స్‌వంటివి కొనివ్వడం మంచిది కాదు. అప్పుడప్పుడు వీడియోగేమ్స్‌ ఆడుతున్నా వారు ఎలాంటివి ఆడుతున్నారు అనే విషయాన్ని పరిశీలించాలి. వారు ఎంత సేపు ఆడుతున్నారు. రోజులో ఏం చేస్తున్నారనేది గమనించాలి. అప్రమత్తంగా ఉంటూ పిల్లల రోజూవారీ పనులను పెద్దలు ఓ కంట కనిపెడుతుండాలి.

ఎప్పుడో సరదాగా వారంలో ఒకరోజు కాసేపు వీడియో గేమ్ ఆడుకుంటే ఫర్వాలేదు కానీ అదే లోకంగా అయితేమాత్రం పరిస్థితి అదుపు తప్పిందని గమనించాలి. పిల్లల అభిరుచి కనుగుణంగా వారిని స్విమ్మింగ్‌, సంగీతం, చిత్రలేఖనం, బ్యాడ్మింటన్‌వంటివాటిలో ప్రావీణ్యం పొందడం లేక పాల్గొనేలా చూడటం వంటివి చేయాలి. అప్పుడే వారు మానసిక ఒత్తిడినుంచి కూడా బయటపడతారు. పైగా ఇది శారీరక సమస్యలకూ దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొని, పడుకొని ఆటలాడటం. ఆ ఆట ధ్యాసలో పడిపోయి ఎంత తింటున్నామన్న సంగతి మర్చిపోవడం సహజం. దానికితోడు ఆ సమయంలో అడ్రాలిన్‌ గ్రంథి విడుదల చేసే హార్మోన్‌వల్ల వీరిలో విపరీతంగా ఆకలివేయడం, అదీ జంక్‌ఫుడ్‌ నే ఎక్కువ ఇష్టపడటం వల్ల శరీర బరువు అమాంతం పెరిగే అవకాశం ఎక్కువ. వీడియోగేమ్స్‌ఆడే పిల్లలు ఊబకాయం వంటి సమస్యలకు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి చిన్నవయసులోనే రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు కలగడానికి కారణమవుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top