సమస్య:
నాకు పెళ్లయ్యి 2 సంవత్సరాలు అవుతోంది. PCOS సమస్య ఉంది. ఎన్ని మందులు వాడినా సమస్య తగ్గలేదు. దీనికి డాక్టర్ లాపరోస్కొ ద్వారా సర్జరీ చేశారు. సర్జరీకి ముందు వరకు నాకు పీరియడ్ రెగ్యులర్ గానే వచ్చేది. కానీ సర్జరీ తరువాత రెండు నెలల నుంచి పీరియడ్ రావడం లేదు. ప్రెగ్నెన్సి టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందేమోనని భయంగా ఉంది. సలహా ఇవ్వండి – రమ, బెల్లంపల్లి.
సలహా:
పిసిఓఎస్ అంటే హార్మోన్ల అసమతుల్యతగా చెప్పవచ్చు. మీరు పిసిఓఎస్ సమస్యకు లాపరోస్కొపీ సర్జరీ చేయించుకున్నాను అంటున్నారు. ఈ సర్జరీలో నీటి బుడగలను తొలగించగలరు కానీ రక్తంలోని హార్మోన్లలో వచ్చిన అసమతుల్యతను సరిచేయలేరు.
లాపరోస్కొపీ సర్జరీ ద్వారా పిసిఓఎస్ సమస్య తగ్గిపోతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే. ముఖ్యంగా పిసిఓఎస్ సమస్య విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య తగ్గాలంటే కొన్ని మందులు వాడుతూ వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా పిసిఓఎస్ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇందులో ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీలో మానసిక ఒత్తిడిని కలిగించే కారణాలు, పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలి. మంచి పౌష్టికాహారం తినడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వంటివి చేయాలి.
సాధారణంగా పిసిఓఎస్ సమస్య ఉన్నవారు బరువు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. తగిన వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకుంటే ఈ సమస్య తగ్గించుకోవచ్చు. లాపరోస్కొపీ సర్జరీ చేయించుకోవడం కన్నా కూడా మీ జీవనశైలిలో మార్పులతోనే ఈ సమస్య నుంచి బయటవచ్చు.
ఎప్పుడైతే సరైన బరువు కలిగి ఉండి జీవనశైలిలో వ్యాయామాలు, విశ్రాంతి వంటి మార్పులను చేసుకుంటారో అప్పుడు మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తగ్గి మీకు పీరియడ్ సరైన సమయానికి వస్తుంది. తరువాత కాలంలో మీరు గర్భాన్ని కూడా పొందగలుగుతారు.
ఇవి కుడా చదవండి
COVID-19 వ్యాధి తగ్గినా కూడా శరీరంలో వైరస్ ఉండవచ్చు..!!