ఎదుటి మనిషి మనసు తెలుసుకుంటే అన్నీ లాభాలే..!

Benefits of LIstening

వినే మ‌న‌సుండాలే కానీ ఈ ప్ర‌కృతిలో ప్ర‌తి కొమ్మా, ఆకు కూడా మ‌న‌కేదో చెప్పాల‌ని చూస్తుంటుంది. అంటారు క‌వులు. అవును పూలు త‌మ‌ని కోస్తున్న వారిని చూసి  జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణం తీస్తావా అని ప్ర‌శ్నించాయ‌ని అంటారు క‌రుణ‌శ్రీ. మ‌నం క‌వుల్లాగా పూలు ఆకుల మాట‌లు విన‌క‌పోయినా ప‌ర‌వాలేదు కానీ సాటి మ‌నుషుల మాట‌లు మాత్రం విని తీరాలి అలా వింటేనే మ‌నుషుల మ‌ధ్య అనుబంధాలు స్థిరంగా ఉంటాయి.

చెప్పేది వినాలి

శ్రద్ధగా వినడమూ ఓ కళే

మ‌న‌చుట్టూ ఉన్న‌వాళ్ల‌లో చాలామంది నా మాట విని తీరాలి. అనేవాళ్లే కానీ నువ్వు చెప్పు నేను వింటాను అనేవారు మాత్రం చాలా త‌క్కువ‌. మ‌నంద‌రిలోనూ మ‌నం గుర్తించ‌ని ఒక టీచ‌రు ఉంటాడు. ఇత‌రుల‌కు బోధ‌న‌లు చేయ‌టం, బుద్దులు చెప్ప‌టంలో ఉన్న ఆనందం ఇత‌రులు చెప్పేది విన‌టంలో ఉండ‌దు మ‌రి. అదే గాసిప్ప్ లాంటివ‌యితే చాలామంది శ్ర‌ద్ధ‌గానే వింటార‌నుకోండి అది వేరే విష‌యం. వాద‌న‌లోనో, గొడ‌వ‌ల్లోనో, అభిప్రాయ బేధాలు వ‌చ్చిన‌ప్పుడో ఏమాత్రం ఇత‌రులు చెప్పేది ఆల‌కించ‌కపోతే వచ్చే సమస్యలు చూద్దాం.

చాలామంది మాట్లాడ‌టం ఒక క‌ళ అంటూ ఉంటారు. ఆమె మాట్లాడుతుంటే అలాగే వినాల‌నిపిస్తుంది లేదా అత‌ను మాట్లాడుతుంటే చెట్లు కూడా ఆల‌కిస్తాయి. అంత తీయ‌గా మాట్లాడ‌తాడు ఇలాంటి కితాబులను సైతం ఇస్తుంటారు.  అయితే మాట్లాడ‌టం ఎంత‌టి క‌ళో విన‌టం అంత‌కుమించిన క‌ళ‌ అనేది నిజం. ఎందుకంటే ఇత‌రులు చెబుతున్న‌ది వినాలంటే చాలా స‌హ‌నం ఉండాలి. వారి మాట‌ల‌నే కాదు మాట‌ల వెనుక ఉన్న మ‌న‌సుని భావోద్వేగాల‌ను సైతం స్ప‌ష్టంగా చూడాలంటే శ్ర‌ద్ధ‌గా వినాలి.

ఎదుటివారు చెప్పేది వినటం ఎందుకంత ముఖ్యం

ఒక మ‌నిషిని మ‌నం అర్థం చేసుకోవాలంటే ఆ వ్య‌క్తి మాట‌ల‌ను శ్ర‌ద్ధ‌గా విన‌టం మంచి మార్గం. అలాగే పిల్ల‌ల పెంప‌కంలో కూడా నిపుణులు ముందు పిల్ల‌ల మాట‌లు వినండి అని చెబుతుంటారు. త‌ల్లిదండ్రులు ఎప్పుడూ పిల్ల‌ల‌కు ఏదోఒక‌టి చెప్పాల‌ని చూస్తారు కానీ వారు చెప్పేది వినాల‌ని అనుకోరు. పిల్ల‌లు చెబుతున్న‌ది వింటేనే వారు త‌మ చుట్టు ఉన్న మ‌నుషుల‌ను ప‌రిస్థితుల‌ను ఎంత‌వ‌ర‌కు అర్థం చేసుకున్నారు ఎంత అపార్థం చేసుకున్నారు అనే విష‌యాలు త‌ల్లిదండ్రుల‌కు అర్థం అవుతుంది. 

అలాగే పెద్ద‌వాళ్ల మ‌ధ్య అపార్థాలు రాకుండా ఉండాల‌న్నా ఇత‌రుల మాట‌లు శ్ర‌ద్ధ‌గా విన‌టం ఒక్క‌టే మార్గం. విన‌టం ఇంత ముఖ్యం కదా మ‌రి కొంత‌మంది అస‌లు ఎదుటివారు చెబుతున్న‌ది ఏమీ ప‌ట్టించుకోకుండా ఎందుకు తాము మాత్ర‌మే మాట్లాడుతుంటారు.

మాట్లాడుకుంటే పోయేదానికి పోట్లాట వరకు ఎందుకు?

చాలా ఇళ్ల‌లో గొడ‌వ‌ల‌కు కార‌ణం ఒక‌రిమాట‌ని ఒక‌రు విన‌క‌పోవ‌డ‌మే. గొడ‌వ‌లు వాద‌న‌లు పెరిగిన‌ప్పుడు చాలామంది  ఎదుటివారు ఏం చెబుతున్నారు అనేది ప‌ట్టించుకోరు. అంత‌కుముందే వారిలో ఎదుటి వ్య‌క్తిదే త‌ప్పు అనే నిశ్చిత‌మైన అభిప్రాయం ఏర్ప‌డి ఉంటుంది. దాంతో ఇక ఏమీ వినాల్సిన ప‌నిలేద‌ని అనుకుంటారు. కొంత‌మందిలో అహంకారం ఉంటుంది. నాక‌న్నీ తెలుస‌ని అనుకుంటారు వీరు అలాగే నేనెట్టి ప‌రిస్థితుల్లోనూ త‌ప్పు చేయ‌ను అనే ధీమాతో ఉంటారు మ‌రికొంద‌రు. దాంతో ఇత‌రులు చెప్పేది విన‌రు. ఇలాంట‌ప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే స‌మ‌స్య‌లు కూడా తీవ్రంగా మారిపోతాయి. 

కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌, బంధువుల మ‌ధ్య వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇలాగే ముదిరిపోతుంటాయి. విన‌డానికి ఒప్పుకోని వ్య‌క్తి ఎప్పుడైనా ఏకప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటాడు. వీరు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుండా త‌మ చుట్టూ ఉన్న‌వారిని భ‌య‌పెట్టి బాధ‌పెట్టి నోరు మూయించాల‌ని చూస్తారు లేదా ఆ ప్ర‌దేశం నుండి వెళ్లిపోయి స‌మ‌స్య‌ని ఎటూ తేల్చ‌కుండా అలాగే ఉంచేస్తారు.

మాటలతోనే మనుషుల అనుసంధానం

ఇత‌రుల మాట‌ల‌ను విన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తి మ‌న‌సుని మూసుకుపోయిన చీక‌టి గుహ‌తో పోల్చ‌వ‌చ్చు. అక్క‌డ నిరంకుశ‌త్వం, మూర్ఖ‌త్వ‌మే రాజ్య‌మేలుతుంటాయి. ముఖ్యంగా ఇత‌రుల మాట‌లు విన‌లేని మ‌నిషి ఆలోచ‌న‌ల్లో స్ప‌ష్ట‌త‌, ప‌రిప‌క్వ‌త‌, న్యాయం, స‌మాన‌త్వం ఇవేమీ ఉండ‌వు. అలాగే ఇత‌రుల మాట‌లు ఆల‌కించే వారిలో ఈ మంచి గుణాలు అన్నీ ఉంటాయి.

మాట‌కి చాలా శ‌క్తి ఉంద‌ని మ‌నం చెప్పుకుంటూ  ఉంటాం. మాట‌ల‌తోనే మ‌నిషి మ‌నిషితో అనుసంధాన‌మై ఉంటాడు. భాష, మాట అనేవి లేక‌పోతే ఈ ప్ర‌పంచం ఎలా ఉండేదో  ఊహించ‌లేము కూడా. అయితే  మాట‌కి విలువ అనేది దాన్ని ఎదుటివ్య‌క్తి విన‌టంలోనే ఉంది. ఒక మ‌నిషి ఒంట‌రిగా అన‌ర్గ‌ళంగా ఎంత మాట్లాడుకున్నా దానికి విలువ ఉండ‌దు. విని అర్థం చేసుకునే వారుంటేనే మాట‌ల‌కు కానీ భాష‌కు కానీ విలువ ఉంటుంది. శ్ర‌ద్ధ‌గా విన‌టం అనేది మ‌నుషుల‌ను క‌లిపే వంతెన లాంటిది.

మాట్లాడాలంటే ముందు వినాల్సిందే

చాలా ఇళ్ల‌లో మ‌నం గ‌మ‌నిస్తుంటాం ప‌నికిరాని క‌బుర్ల‌ని  గంట‌ల‌కొద్దీ మాట్లాడుకుంటారు కానీ ఏమైనా స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకునేట‌ప్పుడు మాత్రం పెద్ద‌గా అరుచుకుని ఆ స‌మ‌స్య‌ని అక్క‌డే ఉంచేస్తారు. ఇళ్ల‌లోనే కాదు ఆఫీసుల్లో అయినా, ప్యాక్ట‌రీల్లో అయినా, అసెంబ్లీలో అయినా పార్ల‌మెంటులో అయినా మాట్లాడానికి ఎంత విలువ ఉంటుందో విన‌డానికీ అంతే విలువ ఉంటుంది. అత్యాధునిక స‌మాజంలో అంద‌రూ గొప్ప‌గా చెప్పుకుంటున్న క‌మ్యునికేష‌న్ స్కిల్స్‌ కూడా విన‌టం ద్వారానే ఎక్కువ‌గా పొంద‌వ‌చ్చు. ఇత‌రుల‌ను విన‌క‌పోతే మ‌నం అర్థ‌వంతంగా మాట్లాడ‌లేము మ‌రి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top