ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు సమస్యలను తేలిగ్గా ఎదుర్కోగలరట. నిజమేనా!

woman in green shirt smiling

చీకటి వేళ ఇంట్లో లైటు వేయగానే చీకట్లు ఎలా చెల్లాచెదురై పోయి వెలుగులు వ్యాపిస్తాయో నవ్వు మన మొహాన్ని అలా వెలిగిస్తుంది.

నవ్వు దీపమే కాదు…మనుషుల మధ్య అనుబంధాలను పెంచే వారధి కూడా.

విపత్కర పరిస్థితుల్లో మన పెదవుల మీదకు చేరి భయపడకు ఏమీకాదు అని బుజ్జగించే నేస్తం. నవ్వుకి నిర్వచనాలు చెప్పాలంటే ఇలాంటివి చాలానే చెప్పచ్చు.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారికి సమస్యలేమీ ఉండవేమో  అనిపిస్తుంది. నవ్వుతూ ఉండేవారికి జీవితంలో బాధలే ఉండవా? అసలు  వారికి మానసిక సమస్యలనేవే రావా?

నవ్వు మనకు పుట్టుకతోనే అందిన ఆస్తి. అందరికీ సమానంగా పంచబడిన సంపద కూడా. కోట్లు సంపాదించిన ధనవంతుడే కాదు…కడు పేదవాడు కూడా ఆనందంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వగలడు. మన నుండి ఇతరులు దోచుకోలేనిది విద్యే కాదు..నవ్వు కూడా.  నవ్వు మనిషికి అందమని కవులు, కళాకారులు చెబుతారు.. నవ్వు ఆరోగ్యమని వైద్యులు అంటారు

నవ్వు అనేది ఒక విశ్వజనీనమైన భాష.  నవ్వుతున్న మనిషి ఇతరులను త్వరగా ఆకర్షిస్తాడు. మనకు పరిచయం లేని వ్యక్తి అయినా…మనల్ని చూసి నవ్వినప్పుడు మనకు ఆత్మీయుడిలా అనిపిస్తాడు.  ఒక్కోమనిషి నవ్వుకి ఒక్కో అందం ఉంటుంది. ఒక్కో నవ్వులో ఒక్కో భావమూ ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వే నవ్వు మాత్రం అన్ని విధాలుగా మంచినే చేస్తుంది. నవ్వు… మోముని వెలిగించడమే కాదు…నవ్వినప్పుడు శరీరమంతా విశ్రాంతి దశకు చేరుతుంది.

గుండె పనితీరు సైతం మెరుగుపడుతుంది. నవ్వు మన గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అది అధిక రక్తపోటుని తాత్కాలికంగా నియంత్రిస్తుంది. నవ్వుతూ ఉన్నవారిలో ఒత్తిడి కలిగించే హార్మోన్లను నియంత్రించే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మన మానసిక స్థితిని ఉత్తేజితం చేస్తాయి. అందుకే మనసు బాగోనప్పుడు ఏదైనా నవ్వొచ్చే సినిమా చూసినా, జోకులు చదివినా…మనసులోని ఒత్తిడి బాగా తగ్గుతుంది. నవ్వుకి మానసిక ఒత్తిడికి అంత దగ్గరి సంబంధం ఉంది.

ఎన్ని సమస్యల్లో ఉన్నా నవ్వగలవారిలో మానసిక ధైర్యం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. కొంతమంది చిన్నపాటి సమస్యలకే చాలా కంగారు పడిపోతూ భయపడుతుంటారు. కొంతమంది ఎలాంటి సమస్య వచ్చినా స్థిమితంగా ఉంటారు. అలాగే ఎక్కువగా నవ్వుతున్న వారిలో ఒత్తిడికి గురయ్యే మనస్తత్వం తక్కువగా ఉండటం వలన…వారిలో సమస్యలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.

ప్రతిసారీ మనం నవ్వినప్పుడల్లా మన మెదడుకి ఒక ఫీల్ గుడ్ పార్టీ ఇస్తున్నట్టట. నవ్వు వలన మనకు చాక్లెట్ తింటే కలిగే ఆనందం కంటే ఎక్కువ సంతోషం కలుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క నవ్వు నవ్వితే మన మెదడులో రెండు వేల చాక్లెట్ల వలన కలిగే ఉత్తేజం కలుగుతుందని బ్రిటీష్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవన్నీ నవ్వు మనలో మానసిక శారీరక శక్తులను పెంచుతుందని చెబుతున్న విశేషాలే. మరి ఇలాంటప్పుడు నవ్వుతూ ఉన్నవారిలో సమస్యలను ఎదుర్కొనే శక్తి సైతం పెరుగుతుందని కచ్ఛితంగా చెప్పవచ్చు.

ఆనందం అనేది మెదడు పనితీరుకి చాలా అవసరం. ఒక క్రీడాకారుడికి ఎలాగైతే ఆటల్లో శిక్షణ ఇస్తామో…అలా మన మెదడుకి ఆనందంగా ఉండటంలో శిక్షణ ఇవ్వాలని నిపుణులు అంటారు. ఎంతగా దానికి ఆనందంగా ఉండటంలో శిక్షణ ఇస్తే అంతగా అది నెగెటివ్ స్థితి నుండి బయటకు వస్తుంది. మెదడుకి అలా ఆనందంగా ఉండటం అలవాటయితే   దాని పనితీరు మరింతగా మెరుగుపడుతుంది. మనం మరింత బాగా పనిచేయగలం…జీవితమూ బాగుంటుంది.  మరి అలాంటి ఆనందం మన చెంతకు రావాలంటే   ముందు మ‌నం బాగా న‌వ్వ‌గ‌ల‌గాలి

మనం పనిలో పడిపోయినా, ఏదైనా సమస్యలు చుట్టుముట్టినా…నవ్వు అనేది ఒకటుందని మర్చిపోతాం. మొహం సీరియస్గా పెట్టుకుంటాం. ఇలాంటప్పుడు కాస్త ఆ మానసిక స్థితి నుండి బయటకు వచ్చి నవ్వగలగితే చాలు…మన మూడ్ పూర్తిగా మారిపోతుంది. వ్యాపారస్తుల పెదవుల మీద నవ్వుని ఎక్కువగా చూస్తాం. న‌వ్వు ఇత‌రుల‌కు మ‌న‌పై న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. నవ్వుతూ ఉన్నవారు ఆత్మవిశ్వాసం ఉన్నవారిగా, నవ్వని వారికంటే సమర్ధులుగా కనబడతార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

మన మెదడు సాధారణంగా నెగెటివ్ గా ఆలోచించడానికి అలవాటు పడి ఉంటుంది. ఎంత ఎక్కువగా మనం నవ్వుతూ ఉంటామో… అంతగా దాని నెగెటివ్ తత్వం తగ్గుతుంది. అలాగే మనసులో సంతోషం లేకపోయినా నవ్వుతూ ఉంటే…మన మానసిక స్థితి ఉల్లాసంగా మారుతుందని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కనుక నవ్వుతూ ఉండేవారికి మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని…చెప్పవచ్చు.

నవ్వు గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మన పెదవులమీద అలవోకగా ఒక చిరునవ్వు మెరవాల్సిందే. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందడమే నవ్వుకున్న శక్తి. అంతేకాదు…ఒక్క చిన్న నవ్వుని మ‌నం ఎవరికైనా ఇస్తే…తప్పకుండా అది తిరిగి నవ్వు రూపంలో మన చెంతకు చేరుతుంది. మ‌న మ‌న‌సులో స్నేహ సౌర‌భంగా మారుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top