బర్త్ కంట్రోల్ పిల్స్ ఎలా వాడితే సురక్షితం !!

Birth Control Pills

కుటుంబ నియంత్రణ పాటించాలనుకునేవారు, పిల్లల్ని కనటం వాయిదావేయాలనుకునేవారు, సురక్షితమైన గర్భనిరోధక సాధనాల వాడకం పట్ల అవగాహన పెంచుకోవటం అవసరం. యువతులు ఆరోగ్యం కాపాడుకోవటానికి, కోరుకున్నప్పుడు మాత్రమే గర్భం ధరించటానికి పాటించే గర్భనిరోధక విధానాలలో మాత్రల వాడకం చాలా ప్రధానమైనది.

అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల మహిళలు స్వేచ్ఛగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించ గలుగుతారు. వీటిని ఉపయోగించడం వల్ల వారికి గర్భం వస్తుందనే ఆందోళన ఉండదు. గర్భధారణలో కీలకపాత్ర పోషించే హార్మోన్లను గర్భనిరోధక మాత్రలు అడ్డు కుంటాయి. మళ్ళీ మాత్రలు ఆపినప్పుడు గర్భం ధరించే వీలుంటుంది.

గర్భనిరోధక మాత్రలతో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది?

గర్భనిరోధక మాత్రలు తీసుకునే చాలా మంది మహిళలకు తెలియని విషయం ఏంటంటే ఆ మాత్రలలో వారు తీసుకునేది ఎనిమిది రకాల హార్మోన్లు అనే విషయం. వీటిలో కొన్ని హార్మోన్లు మహిళల్లో పురుష లక్షణాలు ప్రేరేపిస్తాయి. ప్రతి గర్భనిరోధక మాత్రలో ఒక రకమైన సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి  నెలా గర్భాశయంలో అండం పెరగకుండా ఆపుతుంది. గర్భనిరోధక మాత్రలు మహిళలకు పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కాకుండా తగ్గిస్తాయి. ప్రస్తుతం వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వివిధ రకాలుగా పనిచేస్తాయి.

అయితే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోకూడదు. తక్కువ తీసుకుంటేనే శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి దరిచేరవు. ఒకసారి గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ఆపివేసిన తరువాత శరీరం పిల్‌కు సంబంధించిన హార్మోన్లను బయటకు పంపడానికి 24 గంటలు పడుతుంది. శరీరం సాధారణ రుతుచక్రంలోకి వెళ్లి మళ్లీ అండాలు ఉత్పత్తి కావడం ప్రారంభిస్తాయి. గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం ఆపివేసిన తరువాత రుతుచక్రం 3 నెలల వరకు సవ్యంగా లేకపోవచ్చు. అంతా సవ్యంగా జరిగితే 3 నుంచి 6 నెలల్లో గర్భం వస్తుందని ఆశించవచ్చు.

గర్భనిరోధక మాత్రల వాడకంలో అపోహలేంటి? వాటిలో నిజమెంత?

గర్భనిరోధక మాత్ర ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరోన్  స్థిరంగా కొనసాగేలా చేస్తుంది.ఆ విధంగా మెదడుకూ, అండాశయానికీ  మధ్య అనుసంధానాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అందువలన అండాల విడుదల ఆగిపోతుంది.నిజానికి చాలా మందికి తెలియని విషయమేంటంటే గర్భ నిరోధక మాత్ర వలన బహిష్టు ముందు కనపడే ప్రతికూల లక్షణాలు కనబడటం బాగా తగ్గిపోతుంది. మాత్ర వలన కొంతమందిలో పూర్తిగా రుతుక్రమం ఆగిపోవచ్చు. దీర్ఘకాలం మాత్రలు వాడే వాళ్లలో అలా జరిగే అవకాశముంది. అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదు.

కొంత ఆలస్యంగానైనా పీరియడ్స్ మళ్లీ మొదలవుతాయి. గర్భనిరోధక మాత్రము వాడితే అది కాన్సర్ కు దారి తీస్తుందన్న ప్రచారం ఉంది. కానీ ఇది నిజం కాదు. పైగా ఎండోమెట్రియల్ కాన్సర్, అండాశయ కాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా తగ్గిస్తుంది. అదే విధంగా రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా కనీస స్థాయిలో ఉంచుతుంది. మరో ప్రధానమైన ప్రచారం ఇలా గర్భనిరోధక మాత్రలు వేసుకునేవారు బరువు పెరుగుతారనేది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మాత్రలకు అలా బరువు పెంచే స్వభావం లేదు. మామూలుగా వాడే డోసుకు ఐదు రెట్లు వాడి ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు మాత్రమే బరువు పెరుగుదల గుర్తించారు.

గర్భనిరోధకమాత్రల వలన దుష్ఫలితాలు ఉంటాయా? మాత్రలు ఎప్పుడు మానేయాలి?

అయితే, గర్భ నిరోధక మాత్రల వాడకం వలన అసలు దుష్పరిణామాలే ఉండవా అనే ప్రశ్న సహజం. వాడకం మొదలు పెట్టిన తొలినాళ్లలో వికారంగా అనిపించటం, రక్తస్రావంలో ఒడిదుడుకులు లాంటి లక్షణాలు కనబడతాయి. కానీ 2,3 నెలల్లో ఇదంతా సర్దుకుంటుంది. అతి కొద్దిమందిలో మాత్రం గుండెపోటు, రక్తం గడ్డ కట్టటం లాంటి లక్షణాలు కనబడి అవి ఊపిరితిత్తులదాకా వెళ్లవచ్చు. కానీ ఇది లక్షమందిలో సుమారు 10 మందిలో కనబడవచ్చుగాని, అవాంఛనీయ గర్భం వలన కలిగే నష్టాలతో పోల్చుకున్నప్పుడు ఈపాటి దుష్పరిణామాలు అసలు పట్టించుకోనంత అల్పమైనవన్న విషయం గుర్తించాలి.

ఏమైనా, గర్భనిరోధక మాత్రలు వాడే ముందు దాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. 35 ఏళ్ళు దాటినవాళ్ళు వాడకపోవటమే మంచిదనటంలో ఉద్దేశం పిల్లలు కనటాన్ని వాయిదావేయవద్దని చెప్పటమే. ఇక గర్భం ధరించాలనుకున్నప్పుడు మాత్రలు ఆపేస్తే 3-6 నెలల్లోనే గర్భం రావటానికి అవకాశం ఉంటుంది. విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవటంతోబాటు ఫోలిక్ యాసిడ్ ఉండే పదార్థాలు అందులో ఉండేట్టు చూసుకోవటం, వత్తిడికి లోను కాకుండా జాగ్రత్తపడటం లాంటివి చాలా అవసరం. మొత్తంగా చూసినప్పుడు అవాంఛిత గర్భంరాకుండా గర్భనిరోధక మాత్రలు బాగా పనిచేస్తాయి.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?

గర్భనిరోధక మాత్రలు మహిళలకు అవాంఛిత గర్భం గురించిన భయం లేకుండా లైంగిక సుఖాన్ని ఆస్వాదించే అవకాశం అందిస్తాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండే సులభమైన కుటుంబ నియంత్రణ మార్గం. కానీ ప్రతి వస్తువుకూ మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. దీర్ఘ కాలం వినియోగించటం వలన కలిగే నష్టాలను కూడా దృష్టిలో ఉంచుకొని పరిమితంగా వాడుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top