గర్భసంచి తొలగించే ముందు ఇవి తెలుసుకోండి

గర్భాశయం… మాతృత్వానికి ఆధారం. మనిషి జన్మకు మూల క్షేత్రం. మన పుట్టుకకు బీజం పడేది…. పండంటి బిడ్డగా ఎదిగేదీ… ఈ గర్భసంచిలోనే. ఇంతటి కీలకమైన అవయవాన్ని నేడు సంతానోత్పత్తి దశ దాటాక అక్కర్లేని అవయవంగా భావిస్తున్నారు మనలో చాలామంది. పిల్లలు కూడా పుట్టేశాక ఇక గర్భాశయంతో పని లేదని; తొలగించుకుంటే ఒక పనైపోతుందని, నెలనెలా బహిష్టు బాధలు; కడుపులో నొప్పి, తెలుపు, గర్భసంచిలోగడ్డల వంటి సమస్యల బెడద శాశ్వతంగా తప్పిపోతుందన్న భావనలతో ఇవాళ చాలామంది అవసరం లేకపోయినా హిస్టరెక్టమీ ఆపరేషన్లకు సిద్ధపడిపోతున్నారు. నిజానికి ఈ రకమైన ఆలోచనా ధోరణి ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు.

గర్భాశయాన్ని తొలగించుకోవాలనుకోవడం అపోహ మాత్రమే

నెలనెలా బహిష్టు బాధలు; తరచూ వేధించే కడుపులో నొప్పి, చికాకు పెట్టే తెల్లమైల, అధిక రక్తస్రావం, గర్భసంచిలో గడ్డలు… వీటన్నింటికీ గర్భాశయమే కారణం కాబట్టి ఏకంగా గర్భాశయాన్నే తొలగించుకుంటే ఈ సమస్యలన్నింటి నుంచి శాశ్వతంగా విముక్తి దొరుకుతుందనే నమ్మకం కేవలం ఒట్టి అపోహ మాత్రమే. గర్భాశయాన్ని తొలగించుకోవడం నిజానికి సమస్యల తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో ఎపుడో 50 ఏళ్ల తర్వాత కనిపించాల్సిన మెనోపాజ్ లక్షణాలు ముందుగానే కనిపించడం మొదలవుతుంది. అండాశయాల్ని కూడా తొలగించడం వల్ల హార్మోన్లు లోపించి కీలక అవయవాలైన గుండె, కాలేయం, కిడ్నీల పని తీరు కూడా దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి చిన్న సమస్యకీ గర్భసంచి తొలగింపు వరకూ వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

ఈ సమస్యలకు గర్భసంచి తొలగింపు పరిష్కారం కాదు

గ్రామీణ ప్రాంత మహిళల్లో గర్భసంచిపై అవగాహన తక్కువ. నెలసరి చికాకులు, కడుపు నొప్పి, రక్తస్రావం వంటి బాధలు శాశ్వతంగా తగ్గుతాయన్న ఒకే ఒక్క నమ్మకమే వారిని గర్భసంచి తొలగింపు ఆపరేషన్లకు సిద్ధపడేలా చేస్తోంది. అయితే ఇవాళ ప్రతి చిన్న గైనిక్ సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్స లు అందుబాటులో ఉన్నాయి. గర్భసంచిలో కణితులకు మైమెక్టమీ, కార్టరీ, ఐస్ ట్రీట్మెంట్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కడుపు నొప్పి, తెలుపు వంటి సమస్యలకు చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే చిన్నపాటి సర్జరీలు చేయడం ద్వారా గైనిక్ సమస్యల్ని చాలావరకూ ఇపుడు నయం చేయొచ్చు.

తప్పనిసరయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదు

గర్భసంచిని తొలగించడానికి సాకుగా చెబుతున్న గైనిక్ సమస్యలనేవి ఇవాళ కొత్తగా కనిపిస్తున్నవేమీ కాదు. ముప్ఫై, నలభై ఏళ్ల కిందట కూడా ఉన్నాయి. కానీ అపుడు వాటికి చికిత్స చేసే విధానమే వేరు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా అన్నింటికీ గర్భసంచిని తొలగించడాన్ని ప్రత్యామ్నాయంగా భావించే వాళ్లు కాదు. గర్భసంచి తొలగింపును పెద్దాపరేషన్ గా భావించేవాళ్లు. అత్యవసరమైతే తప్ప హిస్టరెక్టమీకి వెళ్లే వాళ్లు కాదు. ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ప్రతి చిన్న గైనిక్ సమస్యకూ చక్కటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు కాస్తంత ఓపికగా వివరించి చెబితే పేషెంట్లు వినకపోవడమనే ప్రశ్నే ఉండదు. తప్పనిసరి అయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదన్న స్పృహ ఇటు డాక్టర్లలోనూ, అటు మహిళల్లోనూ ఇద్దరిలోనూ రావాలి. అపుడే అనవసరపు  హిస్టరెక్టమీలకు తెర పడుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top