నడిచేటపుడు మధుమేహులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

నడక… చాలా తేలికైన, చవకైన.. అందరికీ అందుబాటులో ఉండే.. అందరూ చేయదగిన వ్యాయాయం. ప్రత్యేకమైన జంజాటాలేవీ లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా చెయ్యటానికి వీలైన, తేలికైన వ్యాయామం. అన్నింటినీ మించి.. ఎన్నో రకాల ప్రయోజనాలను మోసుకొచ్చే బహుళార్థ సాధక వ్యాయామం. అందుకే నడక అందరికీ మంచిది. అందులోనూ మధుమేహులకు మరీ మంచిదని వైద్యరంగం ఇవాళ స్పష్టంగా నొక్కి చెబుతోంది. షుగర్ బారిన పడ్డాక చాలామంది వ్యాయామానికి దూరం అవుతుంటారు. మందులు, ఆహార పరమైన జాగ్రత్తలతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. వ్యాయామం చేస్తే అలసిపోతామని, షుగర్ లెవల్స్ పడిపోతాయని, గుండె దడ వస్తుందనీ, నీరసం ముంచుకొస్తుందనీ… ఇలా నానారకాల సందేహాలతో మొత్తంగా వ్యాయామానికే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. నిజానికి మిగతా వ్యాయామాల మాటెలా ఉన్నా… మధుమేహులకు మాత్రం నడక నిజంగా ఒక దివ్యౌషధమే అని చెబుతారు డాక్టర్లు.

నడకతో మధుమేహమే కాదు ఆరోగ్య స్థితి కూడా మెరుగవుతుంది

నడకంటే మనకు తేలికగా అనిపించొచ్చు గానీ మధుమేహులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో స్పష్టంగా వెల్లడైంది. రోజుకి 45 నిమిషాల పాటు నడిస్తే మధుమేహం అదుపులో ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నడకతో కొవ్వు ఖర్చు కావటమే కాదు, కండరాల్లో చక్కెర నిల్వ సామర్థ్యమూ మెరుగవుతున్నట్టు గుర్తించారు. మన శరీరంలో చక్కెరను కండరాలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఒకవేళ కండరాలు చక్కెరను గ్రహించలేక పోతుంటే రక్తంలో గ్లూకోజు స్థాయులు విపరీతంగా పెరిగిపోతాయి. నడక వల్ల కండరాలకు చక్కెర గ్రహించే సామర్థ్యం పెరుగుతోందనీ, తద్వారా మధుమేహ దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు గ్రహించారు. నడకతో మధమేహం రాకుండా నివారించుకునే అవకాశం కూడా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ నడిచేవారిలో శరీర బరువు తగ్గటంతో పాటు వారిలో ఇన్సులిన్‌ మరింత సమర్థంగా పని చేస్తున్నట్టు వెల్లడైంది.

మధుమేహం ఒక జీవిత కాలపు సమస్య కాకూడదంటే

రోజూ మందులు మింగాలి.  సవాలక్ష పథ్యాలు పాటించాలి. అవసరమైతే ఇన్సులిన్ ను తీసుకోవాలి. వీటితోపాటు రోజూ కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకుంటే… రక్తంలో గ్లూకోజు శాతాల్ని గతి తప్పకుండా చూసుకోవచ్చు. జీవితాన్ని హాయిగా నెగ్గుకు రావొచ్చు. షుగర్ పేషెంట్లు నడకను ఎపుడైనా మొదలు పెట్టొచ్చు. అయితే 45 ఏళ్లు దాటినవారు.. అలాగే నడిస్తే ఆయాసం, గుండెనొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారు మాత్రం ముందుగా డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నవయసు నుంచే మధుమేహం గలవారు డాక్టర్‌ సలహా మేరకే వ్యాయామం చేయాలి. ఎందుకంటే వీళ్లు ఇన్సులిన్‌ తీసుకుంటుంటారు కాబట్టి రక్తంలో గ్లూకోజు బాగా పడిపోయే అవకాశముంది. మధ్యవయసులో మధుమేహం వచ్చిన వారు అందరిలాగే నడవొచ్చు. కానీ ముందుజాగ్రత్తగా జేబులో రెండు గ్లూకోజు బిస్కట్లు పెట్టుకోవటం మంచిది. గ్లూకోజు పడిపోయినట్లనిపిస్తే వెంటనే తినటానికి ఉపయోగపడతాయి.

నడిచేటపుడు మధుమేహులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

మధుమేహులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్‌, పాలిష్టర్ దుస్తులు చెమటను బయటకు పోనీయవు కాబట్టి నడిచేటప్పుడు ఇలాంటి దుస్తుల్ని ధరించకూడదు. మొదటి 5 నిమిషాలు చాలా మెల్లగా నడవాలి. దీంతో శరీరం వ్యాయామం చేయటానికి అనువుగా తయారవుతుంది. కండరాలు, కీళ్లు కదులుతాయి. ఒకేసారి వేగంగా నడవటం మొదలెడితే కండరాలు పట్టేయటం, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు ఎదరవుతాయి. మెల్లగా 5 నిమిషాలు నడిచిన తర్వాత 30 నిమిషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం మూలంగా ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడిచిన వెంటనే నడవటం ఆపరాదు. మెల్లిమెల్లిగా వేగం తగ్గించుకుంటూ రావాలి. అలా తక్కువ వేగంతో 5 నిమిషాలు నడవాలి. దీంతో కండరాలు పట్టేయటం వంటివి ఉండవు. ఒక్కసారిగా వేగాన్ని ఆపేస్తే తలతిప్పు రావొచ్చు. రోజుకి ఇలా ఒక అరగంటపాటు నడకను అలవాటు చేసుకుంటే చాలు… షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. మన ఆరోగ్యమూ దివ్యంగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top