Anemia: కాన్పు తర్వాత రక్తహీనత ప్రమాదమా?

మన శరీరం చక్కగా పనిచేయాలంటే రక్తం సరైన మోతాదులో ఉండాలి. రక్తం సరైన మోతాదులో ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. హీమోగ్లోబిన్‌ శాతం పురుషుల్లో 12 కన్నా తక్కువ ఉన్నా, స్త్రీలలో 10 కన్నా తక్కువ ఉన్నా రక్తహీనత ఉన్నట్లుగా భావించాలి. రక్తహీనత ఉన్న వారిలో నీరసం, త్వరగా అలసిపోవడం, చిన్న పనిచేసినా అలసట రావడం, బలహీనంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హీమోగ్లోబిన్‌ శాతం ఇంకా తక్కువయితే ఆయాసం, దడ, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

రక్తహీనతకు కారణాలు

మెదడుకు రక్తసరఫరా తగ్గి ఇతర సమస్యలకు కూడా అది దారి తీయొచ్చు. గుండెపై ప్రభావమూ పడవచ్చు. ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటివి కూడా జరగొచ్చు. కారణాలు ఇవి కావచ్చు. ఇక స్త్రీల విషయానికి వచ్చేసరికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంటుంది. ఇదే స్త్రీలలో రక్తహీనతకు చాలా సందర్భాలలో ప్రధాన కారణంగా ఉంటుంది. అలాగే గర్భిణీ సమయంలో సరైన పోషకాహారం తినకపోయినా, కాన్పు తర్వాత తగిన పౌష్టికాహారం తినకపోయినా కూడా రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు

స్త్రీలలో రక్తహీనత అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. వివాహితుల్లో సగానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ఎనీమియాతో బాధపడే గర్భిణులు, బాలింతలకు రెట్టింపు మోతాదులో ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు ఇస్తున్నా కూడా పరిస్థితి మెరగుపడడం లేదని సర్వేలు చెబుతున్నాయి. కాన్పు చేసే ముందు సగటున 30 శాతం మంది గర్భిణులకు రక్తమార్పిడి తప్పడం లేదు. ఇది పరోక్షంగా మాతృ మరణాలకు దారితీస్తోంది. కాన్పు తర్వాత జరిగే రక్తస్రావం వల్ల కూడా భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

రక్తహీనత విషయంలో పదేళ్ల క్రితం పరిస్థితికీ, నేటికీ పెద్ద తేడా లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేనివేదిక వెల్లడించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మహిళలకు కాన్పు ముందు ఆరు నెలలు, ప్రసవం తర్వాత ఆరు నెలలు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తున్నా, వాటిని వారు మింగకపోవడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

రక్తహీనత సమస్య తగ్గాలంటే

రక్తహీనత సమస్య తగ్గాలంటే ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, పాలు, మాంసాహారం ఎక్కువగా తినాలి. డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top