గర్భిణీల్లో కాళ్ళ తిమ్మిర్లు

Pregnancy Leg Cramps

గర్భధారణ తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు కాన్పు తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటిలో కండరాలు బిగుసుకుపోయే సమస్య కూడా ఒకటి. దీన్నే తిమ్మిర్లు సమస్యగా చెబుతారు.

తిమ్మిర్లు సమస్య సర్వ సాధారణం

ప్రతి ఒక్కరికీ తిమ్మిర్లు సమస్య సర్వ సాధారణం. అయితే గర్భిణుల్లో ఈ సమస్య మరిన్ని ఇబ్బందులకు దారి తీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో ఉంటారు గనుక, వారు ఈ తరహా ఇబ్బందిని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు.

ఎక్కువ శాతం మంది గర్భిణి స్త్రీలలో కాళ్ళకు సంబంధించిన కండరాల్లో తిమ్మిర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు మాత్రం పొట్ట, పాదాలు ఇలా ఎక్కడైనా రావచ్చు. కండరాలు ఎక్కడికక్కడ పట్టేయడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒక్క సారి ఈ తిమ్మిరి సమస్య ఎదురైందంటే ముందుకు కదలలేని పరిస్థితి ఉంటుంది.

ముఖ్యంగా గర్భిణుల్లో ఉండే ఇతర వికారం లాంటి సమస్యలతో పాటు, ఇది కూడా కలిసి అస్సలు ముందుకు కదలనియ్యదు. ఫలితంగా వారి రోజూ వారి పనుల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారి సొంత పనులు చేసుకునేందుకు కూడా సంకోచించే పరిస్థితి ఏర్పడుతుంది.

మరికొంత మందిలో ఈ తిమ్మిర్లు రక్తనాళాల సమస్యలకు దారి తీస్తాయి. గుండె లయ మీద ప్రభావాన్ని తెలియజేస్తాయి. అందుకే తిమ్మిర్లు సమస్య ఒక్కసారి ఎదురైందంటే దానికి పూర్తి కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలి.

స్నాయువులు, శిశువు కదలికలు, మలబద్ధకం లాంటి అనేక కారణాల వల్ల తిమ్మిర్లు ఎదురౌతూ ఉంటాయి. తక్కువ రక్త ప్రసరణతో పాటు నిర్జలీకరణ కూడా అనేక సమయాల్లో తిమ్మిర్ల సమస్యకు కారణం అవుతుంది. అలాగే సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కండరాలు బిగేసినట్లు అనిపిస్తుంది.

శరీరంలో కొన్ని రకాల ఖనిజ లవణాల లోపం, హార్మోన్ల విడుదల కూడా ఈ ఇబందులను తీసుకొస్తుంది. ముఖ్యంగా గర్భిణులు కదలకూడదు అనే ఒక అపోహ ఈ సమస్యకు ఎక్కువగా కారణంగా చెప్పుకోవాలి. గర్భధారణ తర్వాత ఎదురయ్యే మధుమేహం, నరాల సమస్యలు కూడా తిమ్మిర్లకు కారణం కావచ్చు.

కొన్ని సమయాల్లో కొన్ని రకాల రక్త సంబంధమైన సమస్యలు ఈ ఇబ్బందులకు దారి తీస్తాయి. అందుకే తిమ్మిర్లు అధికంగా వస్తున్నాయి అంటే, దానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని అన్వేషించి, దానికి తగిన విధంగా చికిత్స పొందవలసి ఉంటుంది.

గర్భిణిల్లో తిమ్మిరి సమస్య నివారణకు అధికంగా కాల్షియం మరియు కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అలాగే అధికంగా నీటిని తీసుకోవడం కూడా ఈ సమస్యకు మరో పరిష్కారం. రోజూ నూనెలతో మసాజ్ చేస్తూ ఉండాలి.

ముఖ్యంగా గోరు వెచ్చని నూనెతో చేసే మసాజ్ చక్కని పరిష్కారాన్ని ఇస్తుంది. లవంగం నూనే కూడా ఇప్పటికే తిమ్మిర్లు ఉన్న వారి సమస్యలకు మంచి పరిష్కారం. అన్నిటికంటే ముఖ్యంగా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం మీద దృష్టి పెట్టాలి. అరటి పండ్లు, పాలు, బచ్చలి కూర, పెరుగు, నారిజం మొదలైనవి అందిస్తూ ఉండాలి.

కొన్ని సమయాల్లో మెగ్నీషియం లోపం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు గనుక, మెగ్నీషియం ఉప్పుతో స్నానం చేయడం లాంటివి మంచి ఫలితాన్ని అందిస్తాయి. నిత్యం వ్యాయామం, యోగ లాంటి వాటి ద్వారా కూడా ఈ సమస్యను చాలా వరకూ అధిగమించవచ్చు.

అలాగే రాత్రి నిద్ర పోవడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కూడా ఈ సమస్యలను లేకుండా చూస్తుంది. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోకుండా కదులుతూ ఉండడం లాంటివి సమస్యను చాలా వరకూ తగ్గిస్తాయి.

Scroll to Top
Scroll to Top