Pregnancy and Amniocentesis (అమ్మ – ఉమ్మనీరు – పండంటి బిడ్డ)

Amniotic fluid test and pregnancy

గర్భధారణ సమయంలో సాధారణంగా గర్భిణి ఆరోగ్యంతోబాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన ఉండటం సహజం. గర్భిణికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించటం ద్వారా సమస్య తెలుసుకొని చికిత్స చేస్తారు. అయితే, గర్భంలోని శిశువు గురించి కీలకమైన సమాచారం అందించేది మాత్రం ఉమ్మనీటి (Pregnancy and Amniocentesis) పరీక్షలే. పుట్టుకతో వచ్చే లోపాలతో పుట్టే అవకాశాలను కనిపెట్టటానికి ఇవి అవసరమవుతాయి. ఏ మాత్రం అనుమానం ఉన్నా, గర్భిణులకు ఉమ్మనీటి పరీక్షలు చేయటం చాలా అవసరం.

ఉమ్మనీటి పరీక్షలు – నిర్ధారణ

గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తుంటారు. అయితే గర్భస్థ శిశువు ఎంత ఆరోగ్యంగా ఉన్నదీ తెలుసుకోవటంతోబాటు జన్యుపరమైన సమస్యలు లేకుండా పుట్టబోతున్నట్టు నిర్థారించుకోవటం కూడా చాలా ముఖ్యం. పుట్టుకతో వచ్చే లోపాలు వారికి జీవితాంతం శాపాలుగా మిగిలిపోతాయి కాబట్టి ఈ పరీక్షలకు ప్రాధాన్యం ఉంది. ఎదుగుదలలోపం, బుద్ధిమాంద్యం లాంటి సమస్యలతో పుట్టటం లేదని తేల్చుకోవటానికి జరిపే ఉమ్మనీటి పరీక్షల గురించి తెలుసుకుందాం.

amniocentesis-purpose-procedure-and-risks-and-more
Amniotic Fluid

ఎప్పుడు చేయించుకోవాలి?

గర్భిణి పిండం చుట్టూ ఉండే ద్రవాన్ని ఉమ్మనీరు అంటారు. ఇందులో సజీవంగా ఉండే అండాశయ కణాలతోబాటు ఆల్ఫా ఫెటో ప్రొటీన్ లాంటి ఇతర పదార్థాలు ఉంటాయి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలిగే కీలకమైన సమాచారం వీటిలో దాగి ఉంటుంది. ఇలా పిండం చుట్టూ ఉండే ఈ ఉమ్మనీటి నమూనాను సేకరించి జరిపే పరీక్షలనే ఉమ్మనీటి పరీక్షలు (Pregnancy and Amniocentesis) అంటారు.

ఈ పరీక్షలకోసం పొత్తికడుపుగుండా సన్నపాటి సూది పొడిచి గర్భాశయంలోనుంచి ఔన్సు లోపు ఉమ్మనీటిని సేకరిస్తారు. ఇందుకోసం అల్ట్రాసౌండ్ సాయం కూడా తీసుకుంటారు. అలా సేకరించిన ఉమ్మనీటిని లేబరేటరీ పరీక్షలకు పంపుతారు. జన్యుపరంగా ఎలాంటి రిస్క్ ఉండే అవకాశముంది, ఏ అనుమానం మీద పరీక్ష చేయిస్తున్నామనే అంశాల ఆధారంగా ఆ శాంపిల్ సాయంతో పరీక్షలు చేస్తారు.

మామూలుగా అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా పరిస్థితి అంచనావేసినప్పటికీ, డౌన్ సిండ్రోమ్ లాంటి సమస్యను గుర్తించటానికి మాత్రం కచ్చితంగా ఉమ్మనీటి పరీక్ష అవసరమవుతుంది. అల్ట్రాసౌండ్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్థితి కనబడినప్పుడు, పుట్టుకతోనే లోపాలతో పుట్టినవారు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు, లేదా అంతకుముందు కాన్పులో అలాంటి బిడ్డలు పుట్టినప్పుడు సహజంగానే ఇలాంటి పరీక్షలు తప్పనిసరి అవుతాయి. ముందు జాగ్రత్త పేరుతో ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు అవసరం కాకపోవచ్చు.

amniocentesis-purpose-procedure-and-risks-and-more
Pregnancy and Amniotic Fluid

ఎలా సేకరిస్తారు? ఇందులో రిస్క్ ఎంత?

ఉమ్మనీటి పరీక్షలు అన్ని రకాల లోపాలనూ కనిపెట్టలేకపోవచ్చు. కానీ తల్లిదండ్రులకు జన్యుపరంగా చెప్పుకోదగినంత రిస్క్ ఉందనిపించే లోపాలు మాత్రం ఇందులో బైటపడతాయి.

ముఖ్యంగా …

  • డౌన్ సిండ్రోమ్
  • కండరాల బలహీనత
  • రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్
  • మెదడు, వెన్నెముక ఎదుగుదలలో లోపాలను కనిపెట్టే అవకాశం ఉంది

శిశువు ఊపిరితిత్తులు ఎదిగాయా లేదా తేలుసుకోవటానికి, ఉమ్మనీటిలో ఇన్ఫెక్షన్ ఆనవాళ్ళు చూడటానికి కూడా ఈ పరీక్షలు పనికొస్తాయి. డాక్టర్లు సాధారణంగా గర్భధారణ జరిగిన 15 వ వారం నుంచి 18 వ వారం వరకు ఈ పరీక్షలకు సిఫార్సు చేస్తారు. ఇందులోవచ్చే ఫలితాలు 99 శాతానికి పైగా కచ్చితంగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం కొన్ని సాంకేతిక కారణాల వలన మాత్రమే  తగిన ఫలితాలు రాకపోవచ్చునని తేలింది.

అయితే, ఈ పరీక్షల విషయంలో ముఖ్యమైన అంశమేంటంటే ఇందులో కొద్దిపాటి రిస్క్ ఉంటుంది. గర్భస్రావం కావటం, తల్లికి లేదా బిడ్డకు కొద్దిపాటి గాయం కావటం, ముందస్తు కాన్పు జరగటం లాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు.

ఉమ్మనీటి సేకరణ సమయంలో ఇలాంటివి తలెత్తవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా వస్తుందని, 400 మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలేంటి ? ఫలితాలు ఎలా విశ్లేషిస్తారు?

సాధారణంగా ఇది ఔట్ పేషెంట్ విభాగంలోనే చేస్తారు.  ఉమ్మనీటి శాంపిల్ సేకరించిన తరువాత గర్భిణికి కొద్దిపాటి అసౌకర్యపు ఛాయలు కనిపించవచ్చు. అది కూడా కొన్ని గంటలపాటు మాత్రమే. అందుకే ఆ రోజంతా ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తారు.

ఒకటి, రెండు రోజులపాటు ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. బరువు పనులు చేయకూడదు. పిల్లల్ని ఎత్తుకోవటం సహా ఆరేడు కిలోలకు మించి బరువు ఎత్తకూడదు. లైంగిక కార్యకలాపాల జోలికి వెళ్ళకూడదు.

  • పొత్తికడుపు నొప్పి
  • జ్వరం
  • రక్తస్రావం జరుగుతున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి
  • పిండం మరీ ఎక్కువగా కదులుతున్నా
  • ఉమ్మనీరు సేకరించిన చోట వాపు కనిపించినా డాక్టర్ కి చెప్పటం మంచిది

డాక్టర్ల  సూచన ప్రకారమే మళ్ళీ మామూలు పనులన్నీ చేసుకోవచ్చు. ఫలితాలు వెలువడిన తరువాత శిశువు గురించి పూర్తిగా తెలుస్తుంది.

శిశువు జన్యుపరమైన తీవ్ర లోపాలతో పుట్టే అవకాశమున్నట్టు నిర్థారణ అయితే గర్భం తొలగించుకోవటానికి గర్భిణి సిద్ధం కావచ్చు. ఇదంతా కౌన్సిలింగ్ తరువాత భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని డాక్టర్ సలహా మేరకు తీసుకునే నిర్ణయం.

చివరిగా…

పుట్టబోయే బిడ్డకు జన్యుపరమైన లోపాలు లేవని నిర్థారించుకోవటానికి ఉమ్మనీటి పరీక్షలు తప్పనిసరి. ఒక్కోసారి ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే తొలగించటానికి కూడా ఈ శాంపిల్ సేకరించే విధానాన్నే అనుసరిస్తారు. పిల్లలు తీవ్రమైన లోపాలతో పుట్టిన తరువాత జీవితాంతం బాధపడే కంటే  ముందుగానే గుర్తించి అవసరమైతే గర్భస్రావానికి సిద్ధం కావటం మంచిదన్నది డాక్టర్ల అభిప్రాయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top