జంక్ ఫుడ్ తో పిల్లల ఆరోగ్యానికి అనర్థాలు తప్పవు

Is Junk Food Healthy for Children

మనం రోజూ టీవీల్లో, పత్రికల్లో అనేక ప్రకటనలు చూస్తుంటాం. అందులో ఎక్కువగా పిల్లల ఆహారానికి సంబంధించిన ప్రకటనలు ఉండటం గమనించవచ్చు. పిల్లల ఆహార ప్రకటనల్లో 90 శాతం అనారోగ్యం కలిగించే ఆహారాలేనని ఇటీవలి అధ్యయనం తేల్చింది. అంటేప్రచారానికి మోసపోయి మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పిల్లలు అవి చూసి తల్లిదండ్రులమీద వత్తిడి తీసుకువస్తున్నారు. అనారోగ్యకరమైన ఆహారం పిల్లల ఊబకాయానికి తద్వారా మరిన్ని ఆరోగ్యసమస్యలకు దారితీస్తుందన్నది గుర్తుంచుకోవాలి.

‘‘మా ఆయిల్ వాడండి, గుండెకు మంచిది. మా బిస్కట్లలో షుగర్ ఉండదు గనుక డయాబెటిక్ రోగులు కూడా తినొచ్చు, మా నూడుల్స్ లో బోలెడన్నీ పోషకాలు ఉన్నాయి, మా హెల్త్ డ్రింక్ తాగితే.. మీ బుర్ర తారా జువ్వలా పనిచేస్తుంది…’’ ఇలాంటి ప్రకటనలు మనం రోజూ టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉంటాం. అందులో నటీ నటులు, క్రికెట్ స్టార్స్ చెప్పే తీరు చూసి నిజమేమో అని నమ్మేస్తాం. అదంతా ఆయా సంస్థల మార్కెటింగ్ వ్యూహమని, వాళ్ళు చెప్పేదానికీ, వాస్తవానికీ పొంతన ఉండదని సర్వేలు తేల్చాయి. మరి ఈ ప్రకటనలకు పిల్లలు ఎలా ఆకర్షితులవుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రకటనలు పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వజూస్తున్నాయి?

పిల్లలను ఉద్దేశించి చేసే ప్రతి పది ఆహార పదార్థాల ప్రకటనల్లో తొమ్మిదింటిలో అధిక కొవ్వు, అధిక ఉప్పు, అధిక చక్కెర, తక్కువ పోషకాహారం ఉంటున్నట్టు ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలు ఎలాంటి ఆహారం తినాలని డాక్టర్లు సూచిస్తున్నదీ. ఈ ప్రకటనల్లో ఎలాంటి ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నదీ పోల్చి చూసినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. ప్రకటనల్లో ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాన్నే ప్రమోట్ చేస్తున్నారు.

అధికంగా చక్కెర కలిపిన పదార్థాల ప్రకటనలు 59 శాతం ఉండగా, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాల ప్రకటనలు 19 శాతం ఉన్నాయి. సోడియం అత్యధికంగా ఉన్న పదార్థాల ప్రకటనలు 18 శాతం ఉన్నట్టు ఆ అధ్యయనం తేల్చింది. అయినా సరే అలాంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని ప్రమోట్ చేయటం కోసం సెలెబ్రిటీలను వాడుకుంటున్నారు. మరికొన్ని తప్పుదారి పట్టించే ప్రకటనల మీద ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా ఆ ప్రకటనల దిగువన చిన్న అక్షరాలతో గమనిక అంటూ లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రకటనల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటున్నదంటే ఊబకాయులుగా మారే పిల్లలు ఈ ప్రకటనల్లోని ఆహారపదార్థాలు తిన్నట్టుగా బ్రిటన్ లో జరిపిన సర్వే తేల్చింది. ఒక్కసారి చూసినా ప్రభావితమయ్యేలా ప్రకటనలు ఆకర్షణీయంగా రూపొందించటం ద్వారా ఆయా సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవటంలో విజయం సాధిస్తున్నాయి, నిజంగా నిజమనిపించేలా చేయటం వలన జంక్ ఫుడ్ బాగా అమ్ముడుపోతోంది. అదే సమయంలో పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది.

జంక్ ఫుడ్ : పిల్లలు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటే?

ఒక బ్రాండెడ్ హెల్త్ డ్రింక్ సంస్థ తమ పానియంలో 100 శాతం మిల్క్ ప్రోటీన్లు ఉన్నాయని, ఇది తాగితే మీ పిల్లలు చాలా వేగంగా ఎదుగుతారని ప్రచారం చేస్తుంది. వాస్తవానికి వైద్య నిపుణులు సిఫార్సు చేసిన చక్కెర అంటే రోజుకు 25 గ్రాములు కంటే 38 శాతం అధిక చక్కెర అందులో ఉంటుంది. ఆ పానీయంలో అదనంగా చక్కెర కలుపుకుని తాగితే అందులో చక్కెర శాతం మరింత పెరుగుతుంది. చక్కెర మోతాదు మించితే గుండెకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే, మధుమేహ రోగులకు కూడా ముప్పేనని సూచిస్తున్నారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం కొన్ని సంస్థలు తమ డైజెస్టివ్ బిస్కట్లను పూర్తిగా గోధుమ పిండితో తయారు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే, వాటిలో గోధుమ కంటే మైదా శాతమే ఎక్కువగా ఉంటోంది.

తమ వ్యాపారం కోసం ఆయా సంస్థలు ప్రజలను ఇలా మభ్య పెడుతుంటాయి. వాటిని నమ్మితే, ఆరోగ్యానికే ముప్పు వస్తుంది. శీతల పానీయాల సంగతి సరే సరి. పెద్దపెద్ద హీరోలతో ప్రచార ఆర్భాటం చేసి ఆకట్టుకోవటం తప్ప ఆరోగ్యపరంగా అవి ఎంతో హాని కలిగిస్తాయి. అందులో విటమిన్ ఆహారం, ఉపయోగకరమైన సూక్ష్మపోషకాలు ఉండవు. హానికరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండటం వలన మానవ శరీరానికి చాలా హాని కలుగుతుంది. దేహానికి అదనపు బరువును చేరుస్తాయి. చివరికి ఊబకాయానికి దారితీస్తుంది.

పిల్లలు ఆహార ప్రకటనలకు ఆకర్షితులవకుండా ఏంచేయవచ్చు?

జంక్ ఫుడ్ ప్రకటనల ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండాలంటే పిల్లలుటివి తక్కువగా చూసేలా చూడాలి. ఆ విధంగా ప్రకటనల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండవచ్చు. పిల్లలను కూడా వాటికి దూరంగా ఉంచవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినటం వలన పిల్లల్ని జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచికరంగా తయారు చేయటం ద్వారా పిల్లల్ని ఆకట్టుకునే వీలుంది. అదే సమయంలో ఇంట్లో అంతా కలిసి తినటమనే అలవాటు వలన పిల్లలతో బంధం గట్టిపడుతుంది. ఒక ప్రకటన ద్వారా ఒక అబద్దాన్ని ఎలా ప్రచారం చేస్తారో అర్థమయ్యేలా చెప్పటం ద్వారా కూదా పిల్లల్లో అవగాహన పెంచవచ్చు, నిజానికి పాఠశాల స్థాయిలోనే ఇలాంటి అవగాహన పెంచాలి. ఆ విధంగా పిల్లలు ప్రకటనలను విశ్లేషించే సామర్థ్యం పెంచుకుంటారు.

జంక్ ఫుడ్ ప్రకటనలను చూసి అవి తినటం వలన ఊబకాయం ఎలా వస్తుందో కూడా పిల్లలకు నచ్చజెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రకటనలలో నటించే హీరో, హీరోయిన్లు లేదా క్రికెటర్ల లాంటి ఇతర ప్రముఖులకు ఆ ఉత్పత్తితో సంబంధం లేదని, వారు నిజంగా వాడరని, కేవలం డబ్బు తీసుకొని నటిస్తారని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆకర్షణయమైన పాకింగ్ లాంటివి మార్కెటింగ్ వ్యూహంలో భాగమే తప్ప లోపల ఉన్న ఆహార పదార్థం ఆరోగ్యవంతమైనది కాకపోవచ్చుననే సంగతి తెలిస్తే పిల్లల్లో కొంత విముఖత ఏర్పడవచ్చు.

పిల్లలు ప్రకటనలు చూసి ఆహారపదార్థాలు కొనకుండా తల్లిదండ్రులు ఏంచేయాలి?

ఆహారపదార్థాలు, ముఖ్యంగా చిన్నపిల్లలనుద్దేశించిన జంక్ ఫుడ్ విషయంలో తప్పుదారిపట్టించే ప్రకటనలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పిల్లల్లో ఊబకాయానికి కారణమవుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు చూడకుండా చేయటం, తల్లిదండ్రులు తమ విచక్షణ ప్రదర్శించి జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచటం మాత్రమే ఈ సమస్యకు కొంత పరిష్కారం. మొత్తంగా జంక్ ఫుడ్ వలన కలిగే అనర్థాలను గుర్తెరిగి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top