Babies Cry: చంటి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోందా?

చంటి పాపాయి నవ్వుల పువ్వులు రువ్వుతుంటే… ఇంటిల్లిపాదికీ పండగ వాతావరణమే… మరి అదే చంటి పాపాయి ఇల్లెగిరిపోయేలా గుక్కపట్టి ఏడుస్తుంటే… ఇంట్లో వాళ్లకి పైప్రాణాలు పైనే పోతుంటాయి. చంటి బిడ్డకు ఏమయిందో, ఎందుకేడుస్తోందో తెలీక తల్లి తల్లడిల్లిపోతుంది. ఆకలేసి ఏడుస్తోందేమోనని పనులన్నీ పక్కనబెట్టేసి పరిగెత్తుకొచ్చి పాలు పడుతుంది. ఇంట్లో వాళ్లు పాలపీకను పాపాయి నోటికి అందిస్తారు. కడుపు నొప్పేమోనని గ్రైప్ వాటర్ లేదా గ్లుకోజు నీళ్లతో చంటి బిడ్డ నోటిని తీపి చేస్తుంటారు. నిజానికి ఏడుపు అనేది పసి బిడ్డ బాష. తమ బాధల్ని, అవసరాల్ని మనకు తెలియజెప్పే ఒక సంకేతం. చంటి బిడ్డల ఏడుపు వెనక ఆకలితోపాటు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు పిల్లల వైద్యులు.

ఆకలితోపాటు అనేక కారణాలు ఉంటాయి

సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు కొత్త శబ్దాలకు అలవాటు పడటం మొదలు పెడతారు. ఆక్రమంలోనే వారు కొన్ని చిన్నచిన్న లేదా పెద్ద పెద్ద శబ్దాలకు కెవ్వు మంటుంటారు. అయితే కొత్త తల్లికి మాత్రం చంటి బిడ్డ ఎందుకేడుస్తోందో తెలీక కంగారుపడుతుంటుంది. సాధారణంగా చంటి పిల్లలు ఆకలి వలనే ఏడుస్తారని కొంతమంది అనుకుంటారు. కాని చంటి పిల్లల ఏడ్పుకు ఆకలితోపాటు అనేక కారణాలు ఉంటాయి.

మూడు నెలల వయసు వచ్చే వరకు శిశువులలో జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఇవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు చంటి పిల్లలు తరచూ ఏడుస్తూనే ఉంటారు. ఇంకా… పొట్టలో గ్యాస్, జలుబు, జ్వరం, దగ్గు, చెవిలో ఇన్ఫెక్షన్లు, తరచూ శబ్దాలు, మలమూత్రాలతో డయాపర్లు తడిగా మారడం, పక్క కుదరకపోవడం, చీమలు, పురుగులు ఒంటిపై పాకడం… ఇవన్నీ చంటి పిల్లల్ని గుక్కపట్టి ఏడ్పించేవే.

వీటిని కూడా గమనిస్తుండాలి

చంటి పిల్లల్లో కొంతమంది అదే పనిగా గుక్కపట్టి ఏడుస్తుంటారు. ఎంత సముదాయించినా ఊరుకోరు. డయపర్లతో ఏ ఇబ్బందీ కనిపించదు. జలుబు, దగ్గు, పొట్టలో ఉబ్బరం ఇలాంటి బాధలేమీ ఉండవు. పడక కూడా మెత్తగా సౌకర్యంగానే ఉంటుంది. అయినా మా ఏడుపు మాదే అని రాగం తీస్తూనే ఉంటారు. ఇలాంటపుడు కాళ్లను, చేతుల్ని కాస్త పరీక్షగా గమనించండి. సంప్రదాయాలు, ఆచారాల పేరుతో పిల్లలకు మనం కట్టే పూసల తాళ్లు, గుర్రపు వెంట్రుకలతో పేనిన దారాలు ఒక్కోసారి బిగుసుపోయి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని కూడా గమనిస్తుండాలి.

ఒక్కోసారి తమను ఎత్తుకోమని చెప్పేందుకు కూడా పిల్లలు ఏడుస్తుంటారు. తల్లి ఎత్తుకున్నపుడు వారికి సురక్షితమైన అనుభూతి కలుగుతుంది. కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటపుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించి, పౌడర్‌ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిదురపోతారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కేర్ మని ఏడ్వడం అనేది చంటి బిడ్డల బాష. ఇలాంటపుడు పిల్లలు ఎందుకేడుస్తున్నారో గమనించి వారి అవసరాలను తీర్చాలి. అపుడే పసి పిల్లలు ప్రశాతంగా ఉంటారు. పిల్లలు సాధారణంగా ఆకలితో ఏడుస్తారు. ఇలాంటపుడు వారి ఆకలి తీర్చాలి. ఆకలి తీరితే ఏడుపు కూడా ఠక్కున ఆగిపోతుంది. పక్క తడిపినపుడు, మల విసర్జన చేసినపుడు వెంటనే శుభ్రం చేసి పొడి బట్టతో ఒళ్లు తుడవాలి. దుస్తులు సౌకర్యంగా ఉండేలా చూడాలి. చిన్నారి ఉండే గది మరీ ప్రకాశవంతంగానో, లేదా చీకటిగానో ఉండకూదు.

గదిలో ఎక్కువ శబ్దాలు లేకుండా చూడాలి. చంటి పిల్లల్ని ఒంటరిగా వదిలేసినపుడు కూడా ఏడుస్తారు. ఇలాంటపుడు తల్లిదండ్రులు దగ్గరగా మసలుతుండాలి. జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తుంటారు. ఇలాంటపుడు పలుచని గుడ్డ ఒత్తిలాగ చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. ముఖానికి కాస్త ఆవిరిని జాత్త్రగా పట్టాలి. ఛాతిపై తరచుగా తట్టండి. ఆట్టే ఏడుపు మానతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చంటి పిల్లలు ఏడుపు మానకుండా ఉన్నపుడు ఒకసారి డాక్టర్ కు చూపించడం మేలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top