పిల్లల్లో కొలెస్ట్రాల్: వ్యాయామాలు, ఆహారం ముఖ్యం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక శ్రమతోనే కొవ్వు కరగటం సాధ్యమవుతుంది. ఏరోబిక్ ఎక్సర్ సైజులు, పరుగు, నడక, ఈత లాంటి వ్యాయామాల వలన మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో పిల్లలు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం సన్నగిల్లుతుంది. ఆహారం,  వ్యాయామం వలన పిల్లల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గకపోతే అప్పుడు మందులు వాడాల్సి ఉంటుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే డాక్టర్లే ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకొని తెలియజేస్తారు. డాక్టర్ సిఫార్సు చేసిన విధంగా ఆహారంలో మార్పులు చేసుకున్న మీదట లేదా మందుల వాడకం మొదలైన తరువాత  పిల్లలో కొలెస్ట్రాల్ స్థాయిని క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ఉంటారు. చికిత్సకు వస్తున్న స్పందన ఆధారంగా కూడా ఆహారంలో తగిన మార్పులు చెయ్యవచ్చు.

పిల్లలకు ఇవ్వాల్సిన ఖచ్చితమైన ఆహారం

అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న పిల్లలకు ఒకవైపు వ్యాయామం మరోవైపు పరిమిత ఆహారం ముఖ్యమని డాక్టర్లు పదేపదే చెబుతూనే ఉంటారు. అయితే, నిర్దిష్టంగా ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.  అల్పాహారంలో పండ్లు, పిండిపాదార్థాలు, వోట్స్, మీగడలేని పెరుగు తీసుకోవచ్చు. లేదా వెన్నతీసిన పాలతో చేసిన పెరుగు అయినా మంచిదే. స్పష్టంగా చెప్పాలంటే కొవ్వు శాతం 2% లోపు ఉన్న పాలనే వాడాలి.  మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కోసం రొట్టెలు తినవచ్చు. నూనె వాడకుండా చేసిన పుల్కాలు తినటం మరీ మంచిది. వేపుళ్లకు దూరంగా ఉండాలి.

తృణధాన్యాలు మంచి స్నాక్స్ అవుతాయి

నూనెల ప్రమేయం లేని శాండ్విచ్ లాంటివి కూడా తినవచ్చు. సంపూర్ణ ధాన్యంతో చేసిన బ్రెడ్ కూడా మంచిది. అలాగే, సూప్, ధాన్యం పేలాల వంటివి పిల్లలకు  పెట్టవచ్చు. పాస్తా, బీన్స్, బియ్యం, చేపలు, చర్మం తీసిన కోడి మాంసం లేదా ఇతర వంటకాలు తయారు చేసి పెట్టటం మంచిది. భీజనంతోబాటు రోజూ ఒక తాజా పండు కూడా ఇవ్వవచ్చు.  స్నాక్స్ గా ఆహారం ఇవ్వాలనుకుంటే పండ్లు, కూరగాయలు, రొట్టెలు తృణధాన్యాలు అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్న పిల్లలకు మంచి స్నాక్స్ అవుతాయి.

కొలెస్ట్రాల్ కు ఇలా అడ్డుకట్ట వేయవచ్చు

పిల్లలు శీతల పానీయాలు, సోడా, పండ్ల రసాలు నివారించాలి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచే ఆహార పదార్థాలను, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసే పదార్థాలను ఎంచుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఏ మాత్రం కొలెస్ట్రాల్ పెంచే అవకాశమున్నా అలాంటి ఆహారపదార్థాల జోలికి వెళ్లకపోతే అధిక కొలెస్ట్రాల్ సమస్య అదుపులో ఉంటుంది. ఆహారంలో అదుపు, వ్యాయామం పట్ల పట్టుదల ఉంటే అధిక కొలెస్ట్రాల్ కు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చు.

తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉండటం పెద్దవాళ్లలోనే కాకుండా పిల్లల్లోనూ రావచ్చు. చాలామందిలో వంశపారం పర్యమే అయినా కొత్తతరంలో జంక్ ఫుడ్, తక్కువ వ్యాయామం లాంటి కారణాల వలన కుటుంబ చరిత్ర లేకపోయినా కొంతమంది పిల్లల్లో  ఈ సమస్య కనబడుతూనే ఉంది. ప్రధానంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం, తగినంత శారీరక శ్రమతో కూడిన వ్యాయామం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను అదుపులో ఉంచవచ్చు. పదేళ్ళు దాటాక ఆహారం, వ్యాయామం తగిన ఫలితాలివ్వకపోతే చికిత్స కూడా మొదలు పెడతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల ఆహారం, వ్యాయామం పట్ల జాగ్రత్తగా ఉంటూ స్థూలకాయం రాకుండా చూసుకుంటూ కొలెస్ట్రాల్ స్థాయి తెలుసుకుంటూ తగిన విధంగా వ్యవహరించాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top