ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఎంతవరకు సాధ్యం?

Infertility – IVF Procedure

ఒకప్పుడు పిల్లల్ని కనలేకపోవటమన్నది జీవితకాలపు సమస్య. కానీ1978లో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టటం సైన్స్ చరిత్రలో ఒక అద్భుతమైన మలుపు. సామాన్య ప్రజల భాషలో దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలిచినా వైద్య పరిభాషలో మాత్రం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఐ వి ఎఫ్ అంటారు. కృత్రిమంగా వీర్యాన్ని గర్భాశయంలో ఉంచటం ద్వారా జరిగే గర్భధారణ సులభమైన ప్రక్రియ. కానీ ఐవిఎఫ్ సంక్లిష్టమైనది, ఖరీదైనది కూడా. అందుకే,  ఐవిఎఫ్ ద్వారా గర్భధారణకు ఎప్పుడు ప్రయత్నించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఐవిఎఫ్ విధానం గురించి ఏంతెలుసుకోవాలి?

సంతానం లేని వారు పిల్లల్ని కనటానికి ఐవిఎఫ్ అనేది చాలా సమర్థమైన విధానమే అయినప్పటికీ మిగిలిన  పద్ధతులు పనిచేయనప్పుడు మాత్రమే ఈ పద్ధతికి డాక్టర్లు సిఫార్సు చేస్తారు. వీలైనంతవరకు దీని అవసరం రాకుండా చూడాలనే అనుకుంటారు. అయితే ఈ విధానం ఏ మేరకు సరిపోతుంది? ఇందులో ఉండే రిస్క్ ఎలాంటిది? ఏయే అంశాలమీద ఆధారపడి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది? అనే విషయాలన్నీ డాక్టర్లు ముందుగానే వివరిస్తారు.

ఐవిఎఫ్ చికిత్స ఎవరికి అవసరం అవుతుంది?

పిల్లలు పుట్టకపోవటం రకరకాల కారణాల వలన జరగవచ్చు. అయితే, ఎవరి విషయంలో ఐ వి ఎఫ్ సరైన విధానమో నిర్ణయించటానికి ముందుగా రకరకాల పరీక్షలు చేస్తారు.

 • వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం
 • ఎండోమెట్రియాసిస్ సమస్య ఉన్నపుడు
 • వీర్యకణాలు లేదా అండాలకు హానిచేసే యాంటిబాడీల వలన
 • తల్లికి లేదా తండ్రికి వచ్చే జన్యుపరమైన కారణాల వలన
 • గర్భసంచిలో సమస్యలు తలెత్తటం
 • వీర్యకణం చొచ్చుకుపోలేకపోవటం

ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నప్పుడు మాత్రమే ఐవిఎఫ్ చికిత్సా విధానానికి డాక్టర్లు మొగ్గు చూపుతారు. నిజానికి నిస్సంతులందరికీ  ఐవిఎఫ్  ఒక్కటే పరిష్కారం కాదు గాబట్టి ఇతర మార్గాలన్నీ విఫలమైనప్పుడు లేదా ఫెలోపియన్ ట్యూబ్ పూర్తిగా బ్లాక్ అయినపుడు మాత్రమే దీని గురించి ఆలోచిస్తారు.

 • మందుల వాడకం
 • సర్జరీ
 • కృత్రిమంగా వీర్యాన్ని ప్రవేశపెట్టటం

ఇలాంటి విధానాల వలన ఫలితం కనబడనప్పుడు చివరిగా ఐవిఎఫ్ విధానం ఎంచుకుంటారు.

ఐవిఎఫ్ చికిత్సకు వెళ్ళే ముందు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి?

కొంత మందికి జన్యుపరమైన సమస్యలు ఉండి, అవి పిల్లలకు సంక్రమించకూడదని అనుకున్నప్పుడు కూడా ఈ ఆలోచన రావచ్చు. అప్పుడు కూడా తమ వయోవర్గంలో ఉన్న జంటల్లో ఇది ఎంత వరకు ఫలితమిచ్చింది, ఈ విధానంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగే అవకాశం ఏ మేరకు ఉంది అనే విషయాలను అడిగి తెలుసుకోవాలి. అవసరాన్నిబట్టి అండం గాని, వీర్యకణం గాని లేదా రెండూ గాని ఇతర రహస్య దాతల నుంచి తీసుకోవాల్సిన అవసరం రావచ్చు కాబట్టి మానసికంగా అందుకు సిద్ధం కావాలి. మరికొన్ని సందర్భాలలో అద్దె గర్భం కూడా అవసరం కావచ్చు. అందువలన ఇందులో ఇమిడి ఉన్న మానసిక, నైతిక, చట్టపరమైన అంశాల మీద కూడా ఒక అవగాహనకు రావాలి.

ఐవిఎఫ్ కు వెళ్లాలనుకునే దంపతులకు ముందుగా రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు.

 • అండాల సంఖ్య
 • వాటి నాణ్యత
 • హార్మోన్ల స్థితి
 • అల్ట్రాసౌండ్ పరీక్షలకు స్పందించే గుణం గురించి తెలుసుకుంటారు.

అదే విధంగా వీర్యాన్ని కూడా విశ్లేషిస్తారు. హెచ్ ఐవి సహా ఎలాంటి ఇన్ఫెక్షన్ కారక వ్యాధులూ లేవని నిర్థారించుకుంటారు. గర్భాశయంలోకి మరీ ఎక్కువ అండాలు పంపితే ఎక్కువమంది పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. అది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు కాబట్టి ముందుగానే ఈ విషయంలో ఒక అవగాహనకు రావటం అవసరం.

ఐవిఎఫ్ లో రకరకాల దశలు

 • అండాల సేకరణ
 • వీర్య సేకరణ
 • ఫలదీకరణ
 • పిండం బదలాయింపు

ఐవిఎఫ్ చికిత్సలో ఆండాల పాత్ర

వీటన్నిటికీ కలిపి రెండు వారాల సమయం పట్టవచ్చు. అండాలు తగినన్ని విడుదల కావటానికి కొన్ని హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా ప్రేరణ కలిగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదల కావటానికి ఇది దోహదం చేస్తుంది. అండం సకాలంలో విడుదల కావటానికి, పరిపక్వం చెందటానికి కూడా మందులు వాడతారు. అల్ట్రాసౌండ్ సాయంతో అండాల సేకరణ జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తికడుపు దగ్గర లాపరోస్కోపీ ద్వారా కూడా ఆండాలు సేకరించాల్సి రావచ్చు. పక్వతకు వచ్చిన అండాలను వీర్యంతో కలపటం ద్వారా పిండం తయారవుతుంది. అయితే అన్ని అండాలూ పిండాలుగా మారకపోవచ్చు. సమస్య లేకపోతే భాగస్వామి నుంచి వీర్యం సేకరిస్తారు, లేదంటే దాత వీర్యం వాడతారు. ఫలదీకరణం చెందించిన తరువాత పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

ఐవిఎఫ్ ద్వారా జరిగే గర్భధారణలో ఏ ఏ దశలుంటాయి ?

పిండాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టే  ప్రక్రియ పూర్తయిన తరువాత కొద్దిపాటి రక్తస్రావం జరగవచ్చు. ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగిన కారణంగా స్తనాలు మెత్తబడి సున్నితంగా తయారుకావచ్చు.

 • కడుపు ఉబ్బినట్టు
 • కొద్దిపాటి నొప్పి
 • మలబద్ధకం

ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఒక మోస్తరు నొప్పి అనిపించినా డాక్టర్ ను సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవటం అవసరం. అండం సేకరించి 12 నుంచి 14 రోజులు గడిచిన తరువాత రక్త పరీక్ష ద్వారా గర్భ నిర్థారణ జరుగుతుంది. అక్కడి నుంచి గైనకాలజిస్టుల పర్యవేక్షణ మొదలవుతుంది.

ఒకవేళ గర్భం ధరించకపోతే

అలాంటప్పుడు ప్రొజెస్టిరాన్ తీసుకోవటం నిలిపివేయాలి. అప్పుడు వారం రోజుల్లో ఋతుస్రావం అవుతుంది. ఋతుస్రావం జరగకపోయినా, అసాధారణంగా రక్త స్రావం జరుగుతున్నా డాక్టర్ ను సంప్రదించాలి. మరో విడత ఐవిఎఫ్ కు ప్రయత్నించాలనుకుంటే అప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను డాక్టర్ వివరిస్తారు.

ఐవిఎఫ్ ద్వారా ఆరోగ్యవంతమైన శిశువును కనటం అనేది రకరకాల అంశాలమీద ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్ళు దాటితే దాత అండం తీసుకోవటం మంచిదని డాక్టర్లు సిఫార్సు చేయవచ్చు. గర్భాశయంలోకి బదలీ చేసేటప్పుడు పిండం బాగా పరిణతి చెంది ఉంటే శిశువు ఆరోగ్యం బాగుంటుంది. పొగతాగటం, మద్యం సేవించటం లాంటి అలవాట్లున్న మహిళలకు గర్భస్రావం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి.

చివరిగా

ఏ కారణం వల్లనైనా సంతానం కలగని వారు కుంగిపోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానం ఐవిఎఫ్. మిగిలిన పద్ధతులేవీ ఫలితం ఇవ్వనప్పుడే ఈ విధానానికి వెళ్ళటం మంచిదన్నది డాక్టర్ల సూచన. ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరిస్తూ ఐవిఎఫ్ ద్వారా ఆరోగ్యవంతమైన శిశువులను కనటానికి ఇప్పుడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అందువల్ల నిస్సంతులు సంతానం లేదని చింతించాల్సిన అవసరమే లేదు. అయితే, గతంలో సాధించిన ఫలితాల ఆధారంగా డాక్టర్ ను, ఆస్పత్రిని ఎంచుకోవటం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top