“ఒవేరియన్ క్యాన్సర్” ముందుగానే గుర్తించండి ఇలా !!

Overian Cancer

క్యాన్సర్ ఇది చాలా ఆందోళన కలిగించే వ్యాధి. అయితే దీని విషయంలో ముందుగా మేలుకోవడమే చాలా ప్రభావవంతమైన చికిత్స అవుతుందని వైద్యులు పదేపదే చెబుతుంటారు. అవును చాలారకాల క్యాన్సర్లకు ప్రారంభ లక్షణాలు ఉంటాయి. అవగాహన ఉంటే వాటిని గుర్తించడం తేలికవుతుంది. అయితే కొన్నిరకాల క్యాన్సర్లను  తొలిదశలో గుర్తించడం అంత తేలికకాదు. అండాశయ క్యాన్సర్, లేదా ఒవేరియన్ క్యాన్సర్ అలాంటిదే. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో అంతగా కనిపించవు. ఒక్కోసారి వ్యాధి తీవ్రదశకు చేరుకునే వరకు దానిని గుర్తించే అవకాశం ఉండదు. దీని లక్షణాలు సాధారణంగా తరచుగా వచ్చే అనారోగ్యాల్లా అనిపించడం వలన అలా జరుగుతుంది. దీని గురించి తెలుసుకుంటే… లక్షణాలను పసిగట్టి తొలిదశలోనే స్పందించే అవకాశం ఉంటుంది.

ఇవీ లక్షణాలు

ఒవేరియన్ క్యాన్సర్ (ovarian cancer) నిశ్శబ్దంగా పెరిగే వ్యాధిగా వైద్యులు చెబుతుంటారు. ముందుగా వైద్యుని సంప్రదిస్తే  గుర్తించడం తేలికవుతుంది. పొట్టలో, లేదా పొత్తికడుపు భాగంలో నొప్పి , ఆహారం తింటున్నపుడు త్వరగా పొట్ట నిండిపోయినట్టుగా అనిపించడం, ఎప్పుడూ మూత్రం వచ్చినట్టుగానే అనిపించడం, మలబద్ధకం… ఇవి ఒవేరియన్ క్యాన్సర్ లో ప్రధానంగా కనబడతాయి. అయితే ఇవే సమస్యలు ఇతర వ్యాధుల విషయంలో కూడా ఎదురవుతుంటాయి. అందుకే ఈ లక్షణాల విషయంలో  అప్రమత్తంగా ఉండాలి.

ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా అనిపిస్తున్నా, లేదా లక్షణాలు చాలా తరచుగా ఉంటున్నా, అవి బాగా తీవ్రంగా బాధిస్తున్నా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. ఇవే కాకుండా మరికొన్ని సమస్యలు సైతం కనబడతాయి. చాలా త్వరగా అలసి పోవటం, బాగా అలసటకు గురికావటం, లైంగిక కార్యకలాపాల్లో నొప్పి, వెన్నునొప్పి, పొట్టలో గడబిడలు, గుండెల్లో మంట. పొట్ట భాగంలో వాపు,  ప్రయత్నం లేకుండా బరువు తగ్గిపోవటం, వెజైనా నుండి అసహజమైన స్రావాలు లేదా మెనోపాజ్ తరువాత రక్త స్రావం కనిపించడం లాంటివి ఉంటే వైద్యుని సంప్రదించి అవి ఒవేరియన్ క్యాన్సర్ (ovarian cancer) లక్షణాలు కాదని నిర్దారించుకోవటం అవసరం.

అవగాహన కోసం వైద్యుని సంప్రదించాలి

వ్యాధుల విషయంలో ఎప్పుడు వైద్యుల వద్దకు వెళ్లాలి.. అనేది చాలా కీలకమైన అంశం. అవసరం లేకపోయినా డాక్టరు వద్దకు పదేపదే వెళుతూ ఆందోళన చెందటం ఎంత పొరబాటో, అవసరం ఉన్నా వెళ్లకపోవటం కూడా అంతే పొరబాటవుతుంది. అండాశయ క్యాన్సర్ విషయంలో అవగాహన ఉన్నపుడు సరైన సమయంలో వైద్యుని సంప్రదించే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు కొత్తగా అంతకుముందు లేనివిగా అనిపిస్తున్నా, నెలలో 12 సార్లకు మించి వస్తున్నా అనుమానించాలి. అలాగే సమస్యలను తగ్గించుకునేందుకు ఆహారంలో మార్పులు, వ్యాయామం, విశ్రాంతి వంటివి పాటిస్తూ మందులు వేసుకున్నా… పరిస్థితిలో మార్పు రాకపోతే… వైద్యులను సంప్రదించడం మంచిది.

కుటుంబంలో దగ్గరి బంధువులకు ఒవేరియన్ లేదా రొమ్ము క్యాన్సర్ ఉంటే వైద్యులకు తెలపాలి. లక్షణాలు రెండువారాలకంటే ఎక్కువ సమయం వెంటాడుతుంటే… తప్పకుండా అప్రమత్తమవ్వాలి. అండాశయ క్యాన్సర్ విషయంలో వ్యాధి  తీవ్రదశకు చేరే వరకు వైద్యులను సంప్రదించనివారే ఎక్కువమంది ఉంటున్నారు. దీనిని తగ్గించుకునే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. అయితే పొత్తికడుపులో వాపుకి ప్రాణాంతకం కాని అండాశయ తిత్తులు, ట్యూమర్లు కూడా కారణం కావచ్చు. కనుక ఆందోళన చెందకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి

తొలిదశలోనే గుర్తించబడి.. చికిత్స వరకు వచ్చే అండాశయ క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రారంభ దశలో దీనిని గుర్తించడం కోసం రకరకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. ముందస్తుగా గుర్తించడం కోసం అండాశయాలు, గర్భాశయం పరిమాణం, ఆకారం, పనితీరు వంటివి పరీక్షిస్తారు. ఈ సమయంలో  వైద్యుల సలహామేరకు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం అవసరం. పరీక్షల అనంతరం వైద్యులు అండాశయ క్యాన్సర్ ని నిర్దారిస్తే… ట్యూమర్ ఏ దశలో ఉంది, అది ఏ ప్రదేశంలో, ఏ పరిమాణంలో ఉందో వివరిస్తారు.

మొదటి దశలో ఒక అండాశయంలో మాత్రమే క్యాన్సర్ ఉంటుంది. రెండు అండాశయాల్లో క్యాన్సర్ (ovarian cancer) ఉంటే రెండవ దశగా భావిస్తారు. రెండు అండాశయాలలో క్యాన్సర్ కణాలు ఉండటంతో పాటు అవి… ఆపరేషన్ సమయంలో ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం… వంటి ప్రమాదాలు ఉంటే తరువాతి దశలుగా భావిస్తారు. పరీక్షల అనంతరం వైద్యులు తగిన చికిత్స అందిస్తారు.

అశ్రద్ధ వద్దు, అప్రమత్తత అవసరం

మహిళలు చాలావరకు తమకు వచ్చే అనారోగ్యాలను అశ్రద్ధ చేస్తుంటారు. కడుపు నొప్పి, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం వంటివాటిని పట్టించుకోకుండా తమ పనుల్లో తాము మునిగిపోతుంటారు. కానీ అలా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి… వారి సలహామేరకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటే ముందుగానే అండాశయ క్యాన్సర్ ని  గుర్తించే అవకాశం ఉంటుంది. దీని లక్షణాల పట్ల అవగాహన పెంచుకోవటంతో పాటు.. ఇది వచ్చే రిస్క్ తమలో ఎంతవరకు ఉంది అనే అంశం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top