మనుషుల్లో ఫోబియాలు – కారణం అజ్ఞానమే!!

phobias in human

మనలో ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక విష‌యంలో భ‌యం ఉంటుంది. అమ్మ తిడుతుంద‌నో, నాన్న కొడతాడనో, స్కూల్‌లో టీచ‌ర్ కొడుతుంద‌నో, స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే బాస్ తిడ‌తాడ‌నో ఇలా ఎవ‌ర్ని తీసుకున్నా అందరికీ భ‌యం ఉంటుంది. అది ఏ విష‌య‌మైనా కావ‌చ్చు. అయితే సాధార‌ణంగా కొంద‌రికి కామ‌న్‌గా ఉండే భ‌యాలు కొన్ని ఉంటాయి. వాటినే ఫోబియాలు అంటారు. బ‌ల్లిని చూస్తేనో, పాముని చూస్తేనో, బొద్దింక మీడ ప‌డితేనో, క‌త్తి లేదా ర‌క్తాన్ని చూస్తేనో ఇలా మనందరిలో ఏదో ఒక తెలియని భయం దాగి ఉంటుంది.

కొందరిలో చెమటలు ఎందుకు పడతాయి?

కొందరు కాగితాన్ని చూసి భయపడతారు. ఇంకొందరు అందాల ముద్దు గుమ్మలను చూసి వణికిపోతారు. మరి కొందరు స్నానమంటే జంకుతారు. ఆరడుగుల బుల్లెట్‌లా ఉన్నా, సిక్స్‌ప్యాక్‌ చేసిన హీరోలా ఉన్నా, ఆకారం ఎలా ఉన్నా, ఆవేశం ఎంతున్నా కొందరికి కొన్నింటిని చూడగానే హర్ట్‌బీట్‌ పెరుగుతుంది. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. గజగజ వణికిపోతారు.

ఏ విషయం గురించైనా అతిగా భయపడడాన్ని ఫోబియా అంటారు. ఏదైనా ఒక వస్తువుపట్లగానీ, ఒక సందర్భం పట్లగానీ, పరిస్థితుల పట్లగానీ అసహజమైన భయాన్ని పెంచుకోవడమే ఫోబియా. నిజానికి దాన్ని అనుభవిస్తున్న వ్యక్తికి ఆ భయానికి అర్థం లేదనీ తెలిసినా, విపరీతమైన ఆందోళనకు గురవుతుంటారు. సాధ్యమైనంత వరకూ దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఒక దశలో దానికి దూరంగా ఉండేందుకు ఎన్ని కష్టాలకైనా సిద్ధపడతారు. దీనివల్ల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. నిజానికి దీన్ని వదిలించుకోవటం కష్టమేం కాదు.

ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం, గుండె వేగం అధికం కావడం, ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం, వణుకు, నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం, కడుపులో తిప్పినట్లుగా అనిపించడం,  ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్నట్లుగా అనిపించడం చెమటలు పట్టడం వంటివి ఉద్వేగపూరితమైన యాంగ్జైటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్‌గా మారడం అక్కడి నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష మనలోంచి మనమే వేరైన అనుభూతి మనపై మనం అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామా అన్న ఫీలింగ్ ఒక విషయం పట్ల మనం మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తి. ఫొబియా ఉన్నవారు ఇలాంటి లక్షనాలను కలిగి ఉంటారు.

చిన్నతనంలో చీకటంటే ఉన్న భయం పెద్దయితే ఉండకపోవచ్చు. చాలావరకూ మనం పుట్టిపెరిగిన, తిరిగిన వాతావరణంలో ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నామో వాటి ఆధారంగా కూడా కొన్ని ఫోబియాలు స్థిరపడతాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా కొన్ని భయాలుంటే ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలకూ ఫోబియాలు రావచ్చు. విషపురుగులు, జంతువుల వంటి హాని తలపెట్టే జీవులు, హాని జరగటానికి అవకాశముండే ఎత్తు ప్రదేశాలు, చీకటి, గాయాలు, రక్తం వంటి ప్రమాద ఘట్టాలు, ఇరుకు ప్రదేశాల్లో ఇరుక్కుపోవటం వంటి ప్రమాదకర పరిస్థితుల వల్ల కూడా ఈ ఫోబియాలు ఏర్పడతాయి.

చిన్న చిన్న అంశాల పట్ల భయాలు పెంచుకోవటమన్నది ఇతరులకు చాలా హాస్యాస్పదంగా అనిపించొచ్చు. కానీ దాన్ని అనుభవించే వారికి మాత్రం అది నిజంగా పెనుభూతమే! మనిషిని బట్టి అతిగా బాధించే అతి పెద్ద జబ్బు ‘భయం’. భయం లేకపోతే ఏ జబ్బూ ఏమీ చేయలేదు. భయపడే వారిని ఏ జబ్బైనా విపరీతంగా బాధ పెడుతుంది. శరీరానికి జబ్బులు వస్తాయి. భయం మాత్రం రాకుండా చూసుకుంటే జీవితం హాయిగా గడిచిపోతుంది. ధైర్యమున్న చోట భయముండదు. భయమున్న చోట ధైర్యముండదు. భయానికి కారణం అజ్ఞానమేనని గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ఉండే వారే సంతోషంగా ఉండగలరు. సంతోషంగా ఉండడం అలవాటుగా మార్చుకోవాలి.

కాగ్నిటివ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి ఇతర ప్రక్రియలను కలుపుతూ చేసే చికిత్సలు, రిలాక్సేషన్ టెక్నిక్స్ వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను పూర్తిగా తగ్గించడం సాధ్యమే. ఫోబియా అంటే భయపడకూడని అంశాల పట్ల తీవ్రమైన భయాన్ని కలిగి ఉండటం. ఆఖరికి సూదులన్నా కూడా భయమే. వాస్తవంగా చెప్పాలంటే ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు అభివృద్ధి చెందుతాయి. ఇవి కొందరిలో చిన్నప్పట్నుంచే ఉంటే… మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top