నెలసరి సమస్యల గురించి తెలుసుకుందామా..!

Solutions for Period Problems

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి స్త్రీ జీవితాన్ని మానసికంగా, శారీరకంగా క్రుంగదీస్తున్నాయి. అయితే ఈ సమస్యల ఫలితంగా ఎక్కువగా పీరియడ్స్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలాగూ సాధ్యపడదు. అయితే కొన్ని పరీక్షలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా పీరియడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నెలసరి సమస్యలు:

నెలసరి వచ్చి మూడు నెలలవుతోంది. ఏంచేయాలి?

సమస్య : సీతకు ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య ఉంది. ఇంకా పెళ్లి కూడా కాలేదు. నెలసరి వచ్చి మూడు నెలలవుతుంది. మరి తన సమస్య తీరి నెలసరి సక్రమంగా రావాలంటే ఏంచేయాలి?

సలహా: మీకు చాలా కాలంగా పీరియడ్ లో సమస్య ఉంది. మూడు నెలలు దాటినా పీరియడ్ రావడం లేదు అంటున్నారు. ఈ విషయంలో ఒక నిర్ధారణకు రావాలంటే మీ ఎత్తు, బరువు, బిఎమ్ఐ ఎంతో తెలుసుకోవాలి.

అండాశయంలో సిస్టులు, పిసిఒఎస్ సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలి. దీనికోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు మొటిమలు, అవాంఛిత రోమాలు వంటి సమస్యలు కూడా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. మీ హార్మోన్లలో సమతుల్యత ఎలా ఉందో కూడా చూసిన తరువాతే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సరియైన చికిత్సను సూచించగలుగుతారు డాక్టర్లు.

మా పాపకు 6 నెలలుగా పీరియడ్స్ రావడం లేదు. ఎందుకు?

సమస్య : గోపిక వయసు 12 ఏళ్ళు, 11 ఏళ్ళకు రజస్వల అయింది. గత ఆరు నెలలుగా పీరియడ్స్ రావడం లేదు. రజస్వల అయ్యాక పీరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్ అవుతాయి?

సలహా : ఆడపిల్లలు రజస్వల అవగానే పీరియడ్స్ మొదవ్వాలని లేదు. ఒక్కోసారి రజస్వల అయిన సంవత్సరం తరువాత కూడా పీరియడ్స్ మొదలవ్వచ్చు. ఎందుకంటే నెలసరి సక్రమంగా రావడానికి అవసరమైన హెచ్ పివొ యాక్సిస్ (హైపోథలామస్ పిట్యుటరీ ఒవెరియన్ యాక్సిస్) సక్రమంగా పనిచేయడానికి, శరీరంలో జరగాల్సిన మార్పులన్నీ జరగడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కంగారూ పడకుండా పాపకు 14 ఏళ్ళు వచ్చే వరకు నిశ్చింతగా ఉండవచ్చు.

వైట్ డిశ్చార్జ్ వేదనకు గురిచేస్తోంది. ఎందుకిలా?

సమస్య : కస్తూరి వయసు 25. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఈ మధ్య ఆమెకు తరచూ వైట్ డిశ్చార్జ్ అవుతోంది. డాక్టర్ ని కలిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు తగ్గి మళ్ళీ డిశ్చార్జ్ మొదలవుతోంది. ఇలా ఎందుకవుతోంది?

సలహా: సాధారణంగా కొద్ది రోజులు మందులు వాడైతే వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది. మందులు వాడినపుడు తగ్గి మళ్ళీ తిరగబెడుతోందంటే కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కలయిక ద్వారా ఇన్ఫెక్షన్ మీ వారి నుండి మీకు సోకడం, మీ ఇన్ఫెక్షన్ కు కారణం అయిన బ్యాక్టీరియా మందులకు లొంగకపోవడం, మీకు కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులుండటం, షుగర్ వ్యాధి వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. అందుకని మీరు సాధారణ రక్తపరీక్ష, మూత్ర పరీక్ష, షుగర్ టెస్ట్, పాప్ స్మియర్, హెచ్ పి వి, ఆర్ టి ఐ (రీ ప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) స్క్రీనింగ్ టెస్టులు వంటివి తప్పనిసరిగా చేయించుకోవాలి. అలా మీవారు కూడా ఒకసారి డెర్మటాలజిస్ట్ ని కలిసి చెక్ చేయించుకోవాలి. అవసరం మేరకు మీతో ఆయన కూడా మందులు వాడాల్సి ఉంటుంది.

నెలసరి సమయంలో బ్లీడింగ్ అవడం లేదు. ఏంచేయాలి?

సమస్య: స్రవంతి వయసు 27సం.లు విదేశాల్లో ఉంటోంది. ఆమెకు ఇంతకుముందు థైరాయిడ్ సమస్య ఉండేది. మందులు వాడితే అదుపులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె సమస్య ఏంటంటే ఆమెకి నెలసరి సమయంలో మొదటి రెండు రోజులు బ్లీడింగ్ కావడం లేదు, తరువాత 3, 4 రోజుల్లో బ్లీడింగ్ నార్మల్ గా అవుతోంది. ఇది పిల్లలు పుట్టకపోవడానికి సంకేతమని ఆమె అనుమానం. ఆమెకు పిల్లలు పుట్టే మార్గం ఉందా?

సలహా: మీకు మొదటి రెండు రోజులు స్పాటింగ్ మాత్రమే ఉందని చెపుతున్నారు. సాధరణంగా ఇలా జరగడానికి హార్మోన్లలో అసమతుల్యత కారణం కావచ్చు. ఈ విషయంలో చికిత్స కోసం వెంటనే మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది. అలాగే సమస్యని ఇంకా క్లియర్ గా తెలుసుకునేందుకు మీకు అబ్డామినల్ అల్ట్రా సౌండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు పుట్టే మార్గం ఉందా అంటే ఆ విషయంలో చికిత్స సూచించడానికి మీ ఎత్తు, బరువు, బి ఎం ఐ వంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

[wpdiscuz-feedback id=”p13niunepq” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top