2019-nCoV (novel corona virus) అనేది వైరస్ పేరైతే…

novel corona virus

ఈ వ్యాధి సోకితే జ్వరం, పొడి దగ్గు, ముక్కు కారడం, అలసట, ఊపిరి లోతుగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికి దీనికి యాంటీ వైరల్ డ్రగ్ ఏమీ తయారు కాలేదు. మెడికల్ కేర్ లో ఉంటూ, మంచి పోషకాహారం, తగినంత నిద్ర, కాస్త వ్యాయామం ఉంటే వ్యాధి నిరోధకశక్తి వల్ల చాలామందికి తగ్గిపోతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి ఈ వ్యాధి సోకితే 50 వేల మంది దాని నుండి బయటపడ్డారు. మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు. అంటే 3%.

కరోనా వైరస్ గురించి అతిగా గాబరా పడటం అనవసరం. అలాగే అజాగ్రత్తగా ఉండటం ప్రమాదకరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారణ ఈజీనే. ఎందుకంటే కరోనా వైరస్ గాలిలో ప్రయాణించి దూరప్రాంతాలకు ఏమి వెళ్ళలేదు. COVID-19 బాధితులు తుమ్మినా దగ్గినా వారి ముక్కు నుండి వచ్చే డ్రాప్లెట్స్ లో మాత్రమే కరోనా వైరస్ ఉంటుంది. అంటే రోగి నుండి రెండు మీటర్లు దాటి దూరంగా పోయే అవకాశం లేదు.

Coronavirus.

రోగి తుమ్మినప్పుడు వచ్చిన డ్రాప్లెట్స్ ఏ టేబుల్ మీదో, పుస్తకం మీదో, లేదా ఏ ఇతర వస్తువుల మీదో పడి ఉంటే, మనం వాటిని టచ్ చేసినప్పుడు, మన చేతుల మీదకి కరోనా వైరస్ చేరుతుంది. తరువాత ముఖాన్ని చేతితో తాకితే కరోనా మన ముక్కు రంధ్రాల ద్వారా గాని, కంటి ద్వారా గాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే చేతితో ముఖాన్ని తాకే అలవాటును పూర్తిగా మానుకోవాలి. వినడానికి సింపుల్ గా ఉన్నా, పూర్తి స్పృహతో పనులు చేస్తే తప్ప ఇది సాద్యం కాదు. ఏదేదో ఆలోచిస్తూ అసంకల్పితంగా ముక్కు మీద వేలు పెట్టడం, కంటి కార్నర్ భాగాలను టచ్ చేస్తూ ఉంటాము. Moment to moment awareness of our body movements is necessary.

ఎప్పుడైనా ముఖాన్ని టచ్ చేయాల్సి వస్తే, ముందుగా సబ్బుతో లేదా సానిటైజర్ తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. మాస్క్ వేసుకోవడం మంచిదే కానీ మాటిమాటికీ మాస్కు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ముఖాన్ని తాకడం జరుగుతుంది దానివల్ల చేతికి ఏమైనా వైరస్ అంటుకుని ఉంటే అది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇంటిలో ఉన్నప్పుడు, రోగుల లేని ప్రాంతాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.

శరీరంలోకి ప్రవేశించిన 2 నుండి పది రోజుల తరువాత మాత్రమే వ్యాధి లక్షణాలు తెలుస్తాయి. కరోనా వైరస్ పూజలకు, ఉపవాస ప్రార్థనలకు, తాయత్తులకు లొంగదు. గోమూత్రాలూ, తైలాలు దాన్ని ఆపలేవు. మనం ఉంటున్న ప్రాంతంలో వైరస్ ఉందని తెలిస్తే, బయటకు వెళ్ళినప్పుడు n95 మాస్కులు ధరించాలి. అవి లేకపోతే, సర్జికల్ మాస్కులు ధరించాలి. మాస్కుకి ఉన్న తాడుని తప్ప మిగిలిన మాస్క్ ని తాక కూడదు. ఒక వేళ తాకితే, Sanitizer వాడి శుభ్రం చేసుకోవాలి. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. పెద్ద పెద్ద గుంపులకు దూరంగా ఉండాలి. రద్దీగా ఉంటే గుడులు, చర్చిలు, మసీదులకు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ కి వెళ్లడం మానేయడం ఉత్తమం. ప్రయాణాలు తగ్గించుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి. ఇతరుల్ని పలకరించడానికి షేక్ హాండ్ & హగ్ వంటివి మానేయండి. నువ్వుతోనో, నమస్కారంతోనో పలకరించుకోండి. పూర్తిగా వండిన ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. వ్యాధినిరోధకశక్తి పెరిగే విధంగా అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, కావాల్సినంత ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంతేగాని ఉపవాసాలు చేయకూడదు. మరిన్ని సూచనల కోసం WHO వెబ్ సైట్ ను సందర్శించండి.

లింక్ : https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు వైరస్ సోకితే, ఆల్రెడీ సోకేసింది కదా అని ముక్కు, నోరు కవర్ చేసుకోకుండా తుమ్మడం దగ్గడం చేస్తే, నీ నుండి బయటకు పోయిన వైరస్, ఊరంతా తిరిగి తిరిగి, నీకు నయమయ్యాక మళ్లీ నిన్నే ఎటాక్ చేయొచ్చు. సో…. ఇతరులకు స్ప్రెడ్ అవకుండా ఆపడం కూడా మనల్ని మనం కాపాడుకోవడమే.

కొన్ని అపోహలు/పుకార్లు/తప్పుడు అభిప్రాయాలు :

కరోనా ట్రీట్మెంట్ కోసం యాంటీ బయోటిక్స్ వాడొచ్చు అనేది ఒక ఆపోహ. యాంటీబయోటిక్స్ కేవలం బ్యాక్టీరియా ని మాత్రమే చంపుతాయి. వైరస్ ని ఏమీ చేయవు. అందువల్ల యాంటీబయాటిక్స్ వాడటం శరీరం యొక్క ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. ఆసుపత్రిలో హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని లైఫ్ సపోర్ట్ ఇవ్వడం మాత్రం చెయ్యాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే, అప్పుడు మాత్రమే antibiotics ఇస్తారు.

చైనా నుండి వచ్చే పార్సిల్స్ ద్వారా కరోనా వైరస్ వస్తుంది అనేది కూడా అపోహే. వస్తువుల మీద ఉన్న వైరస్ ఒకటి లేదా రెండు రోజులు దాటి బతకలేదు. కానీ చైనా నుండి ఇండియాకి పార్సిల్స్ రావడానికి సుమారు రెండు వారాలు పడుతుంది. అంతకాలం వైరస్ బతికి ఉండే అవకాశమే లేదు.

  1. నువ్వుల నూనె రాసుకుంటే కరోనా వైరస్ చచ్చిపోతుంది. ఇది కేవలం పుకారు
  2. వెల్లుల్లి తింటే COVID-19 తగ్గిపోతుంది అని మెస్సేజులు తిరుగుతున్నాయి. క్రిములను నిరోధించడంలో వెల్లుల్లి మంచి ఆహారం. కాబట్టి తినండి. కానీ కరోనా విషయంలో పని చేస్తుంది అనడానికి ఏ ఆధారం లేదు.

5 “బీఫ్ లో నియాసిన్, గ్లూటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది కాబట్టి బీఫ్ తింటే COVID తగ్గుతుంది అని European Health Organization (EHO) ప్రకటించింది” అనే అసత్య ప్రచారం జరుగుతుంది. నిజానికి SCREENSHOT తప్ప ఎక్కడా ఆ వార్త లింక్ కూడా దొరకదు. EHO అనే సంస్థ కూడా లేదు.

  1. ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుంది అనేది కేవలం అపోహ. Sanitizer లో ఉన్న ఆల్కహాల్ చేతిపై ఉన్న వైరస్ ని చంపుతుంది కాబట్టి, ఆల్కహాల్ తాగితే లోపలున్న వైరస్ కూడా చచ్చిపోతుందేమో అనే ఒక ఊహ నుండి ఈ అపోహ పుట్టింది. శరీరంలో వైరస్ ని చంపే అంత ఆల్కహాల్ తాగితే మనిషి చచ్చిపోతాడు.

WHO సూచించిన జాగ్రత్తలు పాటించండి. పౌష్టికాహారం తినండి. ఒత్తిడి తగ్గించుకోండి. 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. పొరపాటున వైరస్ సోకినా శరీరం ఫైట్ చేసి నిలబడుతుంది.

PS : ఆర్టికల్ మొత్తం World Health Organization (WHO) గైడ్ లైన్స్ ఆధారంగా మాత్రమే రాయబడింది. ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top