ఇవి తగ్గించుకుంటే పీరియడ్ సమయంలో సమస్యలు రావు

Period problems

సాధారణంగా స్త్రీలలో నెలసరి ఎన్ని రోజులు ఉంటుంది?

నెలసరిలో 3 నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ ఉంటే దాన్ని సరియైన నెలసరి అంటారు. చాలా తక్కువ మందిలో 5 నుంచి 7 రోజుల వరకు కూడా నెలసరిని సాధారణ నెలసరిగానే భావించవచ్చు. ఒక వారం రోజుల కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంటే మాత్రం తాప్పకుండా డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీకు ప్రతినెలా వచ్చే నెలసరిలో ఏవైనా అనుకోని మార్పులు వచ్చినా కూడా వైద్యులను సంప్రదించడం మంచిది.

ప్రతినెలా పీరియడ్ సమయంలో స్త్రీ ఎంత మోతాదులో రక్తం కోల్పోతుంది?

రెండు టేబుల్ స్పూన్ల రక్తాన్ని ప్రతి స్త్రీ తన నెలసరి సమయంలో కోల్పోతుందని ఒక అంచనా. అయితే ఖచ్చితంగా ఎంత రక్తాన్ని కోల్పోతారు అనేదానికి ఆధారాలు లేవు. స్త్రీలు వారి నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అనే విషయాన్ని గ్రహిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కలవాలి. పాడ్ ఎక్కువగా తడిచిపోవడం ద్వారా ఈ విషయాన్ని గ్రహించవచ్చు.

నెలసరి రాకపోవడం లేదా ఆలస్యం అవడాన్ని గర్భం దాల్చినట్టుగా భావించవవ్చా?

యుక్త వయసు స్త్రీలలో పీరియడ్ రాకపోవడం లేదా ఆలస్యం అవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. నెలసరి మొదలైన కొత్తలో అమ్మాయిల్లో ఈ సమస్య చాలా సాధారణం. అయితే కొంతమందిలో మానసిక ఒత్తిడి, బరువు తగ్గడం, ఎక్కువగా వ్యాయామాలు చేయడం వంటివి కూడా పీరియడ్ ఆలస్యం అవడానికి కారణం అవుతాయి.  

గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్న వారిలో కూడా కొన్నిసార్లు నెలసరి ఆలస్యం అవడం లేదా అసలు నెల రాకపోవడం జరుగుతుంది. కొన్ని గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నపుడు అవి నెలసరిని తప్పిస్తాయి. అయితే మీకు ప్రతినెలా వచ్చే సాధారణ పీరియడ్ సరిగా రాకపోతే మాత్రం తప్పకుండా డాక్టర్ ని కలవడం మంచిది.

పీరియడ్ మొదలైనపుడు శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి రావచ్చు?

స్త్రీలలో నెలసరి మొదలైనపుడు పొత్తికడులో అలాగే వెన్ను భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నా ఎక్కువ రోజులు ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఎందుకంటే అది కొన్నిసార్లు ఎండోమెట్రియాసిస్ సమస్యకు దారితీయవచ్చు. గర్భాశయం వెలుపల ఎండోమెట్రియల్ కణజాలం వృద్ధి చెందుతున్నా, కటి వలయం లోపల పెరుగుతున్నా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది.

స్త్రీలలో సాధారణంగా నెలసరి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది?

సాధారణంగానే స్త్రీలలో 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో నెలసరి వస్తుంది. యుక్త వయసు స్త్రీలలో అలాగే టీనేజ్ అమ్మాయిల్లో పీరియడ్ ఆలస్యం కావడం, 21 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో పీరియడ్ రావడం సాధారణమే. అయితే పీరియడ్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయో ఒక క్యాలండర్ లో నోట్ చేసుకోవడం ద్వారా మీ పీరియడ్స్ పై డాక్టర్ కి ఒక అవగాహన రావచ్చు. దీని ద్వారా మీకు పీరియడ్స్ విషయంలో అందోలన తగ్గుతుంది.

మానసిక ఒత్తిడి రుతుక్రమాన్ని దెబ్బతీస్తుందా?

మానసిక ఒత్తిడి, బరువు తగ్గడం వంటి అనారోగ్య లక్షణాలు స్త్రీలలో పీరియడ్స్ ని ఆలస్యం చేయడం, బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవడం వంటి సమస్యలకు దారితీస్తాయి. మానసిక ఒత్తిడి తక్కువగా ఉన్న స్త్రీలలో కంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్న స్త్రీలలోనే నెలసరి విషయంలో సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు డాక్టర్ లు చెబుతున్నారు.

స్త్రీలలో 8 శాతం మంది మాత్రమే తమ నెలసరి విషయంలో సంతృప్తిగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తమ 35 సంవత్సరాల నెలసరి జీవితకాలంలో స్త్రీలకు 450 సార్లు నెలసరి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ ప్రమాదమా?

నెలసరికి నెలసరికి మధ్య బ్లీడింగ్ కనిపించడం అనేది చాలా తక్కువమందిలో జరుగుతుంది. అది కూడా చాలా తక్కువసార్లు జరుగుతుంది. అయితే ఇలా పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం అనేది కొన్నిసార్లు మాత్రమే సీరియస్ సమస్యలను సూచిస్తుంది దానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చు.

పీరియడ్ సమయంలో రక్తం గడ్డలు గడ్డలుగా రావడం సాధారణమేనా?

చాలామంది స్త్రీలలో పీరియడ్ సమయంలో బ్లీడింగ్ ముద్దలుగా రావడం సాధారణంగానే చూస్తూ ఉంటాము. అయితే ఇలా రక్తం ముద్దలుగా రావడం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటే తప్పకుండా డాక్టర్ ని కలవాలి.

పీరియడ్ సమయంలో స్త్రీలు గర్భం దాల్చుతారా?

ఋతుచక్ర సమయంలో స్త్రీలు గర్భం దాల్చవచ్చు. తరువాతి నెలసరి సమయానికి 10 నుంచి 16 రోజుల ముందు కూడా అండం విడుదల అవుతుంది. అయితే నెలసరి సమయంలో భాగస్వామితో శృంగారం విషయంలో స్త్రీలు ఆందోళన చెందుతుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నపుడు నెలసరి సమయంలో శృంగారం అనేది ప్రమాదమేమీ కాదు అనేది నిపుణుల అభిప్రాయం.

పీరియడ్ లో కనపడే రక్తం రంగులు మారుతుందా?

అవును కొన్నిసార్లు రక్తస్రావంలో కనిపించే రక్తం గులాబీ ఎరుపు నుంచి గోధుమ రంగు వరకు కూడా కనిపిస్తుంది. ఇది సాధారణమే ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు. అంతేకాకుండా ఒకే నెలసరి సమయంలో రక్తం రంగు మారుతూ ఉండవచ్చు.

ముందస్తు నెలసరి సమస్య (PMS) నుంచి ఎలా బయటపడవచ్చు?

స్త్రీలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ముందస్తు నెలసరి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులో ఏరోబిక్ వ్యాయామాలు అంటే ఒక అరగంట సైక్లింగ్ చేయడం, వేగంగా నడవడం, వారానికి మూడు రోజులు పరిగెత్తే వ్యాయామాలు చేయడం ద్వారా కూడా స్త్రీలు పి‌ఎం‌ఎస్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా పి‌ఎం‌ఎస్ విషయంలో ఉపయోగపడతాయి. రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవడం, అల్కాహాల్, కెఫీన్ కు దూరంగా ఉండటం, ఆహారంలో తక్కువ కొవ్వు, తక్కువ ఉప్పు, చక్కెర తీసుకోవడం కూడా పి‌ఎం‌ఎస్ సమస్య నుంచి బయటపడేస్తుంది.

 

Scroll to Top
Scroll to Top