కరోనా వైరస్: పిల్లల చేతికి కరెన్సీ నోట్లు, టివి రిమోట్, సెల్ ఫోన్ ఇస్తున్నారా? జరభద్రం!

Mom washing hands of kid in bathroom

కరోనా సమయంలో పిల్లలకు కరోనా సోకే అవకాశం తక్కువగానే ఉన్నా పిల్లల్లో అనారోగ్యాలకు ఎక్కువగా చేతుల అపరిశుభ్రతే కారణం అనే స్పృహ బాగా పెరిగింది. కడుపులోకి ఆహారం వెళ్ళాలంటే అది చేతులతోనే కాబట్టి చేతుల దగ్గరే పరిశుభ్రత మొదలు కావాలి. అందుకే తల్లిదండ్రులతో బాటు పిల్లలకు కూడా చేతులు కడుక్కోవటంలో ఉన్న ప్రాధాన్యతని వివరించాల్సిన అవసరం ఉంది.

మనిషి జీర్ణ వ్యవస్థకు ముఖద్వారం నోరు అయితే ఆ నోటిలోకి ప్రవేశించే ఆహారం చేతి ద్వారానే అందుతుందన్నది నిజం. అందువలన చేయి అపరిశుభ్రంగా ఉంటే ఆహారంతోబాటు  మలినాలు, సూక్ష్మజీవులు జీర్ణ వ్యవస్థలో చేరి అనేక వ్యాధులకు దారితీస్తాయి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు మొదలుకొని అనేక బాక్టీరియా, వైరస్ సంబంధ వ్యాధుల వరకు ఇబ్బంది పెడతాయి. అందుకే సూక్ష్మజీవుల్ని హరించే విధంగా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.

చేతులు శుభ్రంగా లేకపోవటానికి, రోగాలకు సంబంధం ఉందా?

ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాలకు ప్రధానంగా డయేరియా, శ్వాస సంబంధ వ్యాధులేనని తేలింది. అపరిశుభ్రతే దీనికి ప్రధాన కారణమని కూడా నిర్థారణ కావటం, స్వైన్ ఫ్లూ లాంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి సైతం చేతులు పరిశుభ్రంగా లేకపోవటం కారణం కావచ్చునని డాక్టర్లు అనుమానించటం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. చిన్నపిల్లలు ఆకలి అనిపించగానే చేతులు కడుక్కోకుండా  ఆదరాబాదరాగా వెళ్ళి తినటం, బాత్రూమ్ కి వెళ్ళి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం మామూలు నిర్లక్ష్యంగా వదిలేయకూడదు.

వాళ్ళు అనారోగ్యాన్ని స్వయంగా కొనితెచ్చుకుంటున్నారనే స్పృహ కల్పించటం తల్లిదండ్రుల బాధ్యత. అర చేతుల్లో తేమ ఎక్కువగా ఉండటంతో అక్కడే లక్షలాది సూక్ష్మజీవులు నిల్వ ఉంటాయి. అందువల్ల చేతులు కడుక్కోకుండా తిన్నప్పుడు  చేతుల ద్వారానే ఆహారంతో కలిసి అవి జీర్ణాశయంలోకి వెళతాయి. అందుకే పిల్లలు, పెద్దలు చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు.

ముఖ్యంగా పాఠశాలల్లో  పిల్లలకు సబ్బుతో చేతులు ఎలా కడుక్కోవాలో శిక్షణ ఇస్తారు.  ఇంట్లో అందరూ ఈ జాగ్రత్త పాటించేలా చూడాలని కూడా పిల్లలకు చెబుతారు. పెద్దల నిర్లక్ష్యం వల్ల కూడా పిల్లలకు రోగాలు రావచ్చని చెబుతారు. మనం రోజూ తాకే అనేక వస్తువుల మీద రకరకాల క్రిములుండే ప్రమాదముంది.

ఉదాహరణకు…

 • టీవి రిమోట్‌
 • ఫ్రిజ్ తలుపు
 • సెల్‌ఫోన్
 • మోటార్‌ వాహనం హ్యాండిల్‌
 • నీళ్ల పంపు
 • కంప్యూటర్‌

ఇంకా…

 • కీబోర్డు, మౌస్‌
 • టూత్ బ్రష్
 • స్విచ్ బోర్డు
 • దువ్వెన
 • కరెన్సీ నోట్లు
 • కారు స్టీరింగ్‌

ఇలా అనేక చోట్ల రకరకాల క్రిములుంటాయి. ఇలా నిత్యం మనం తరచూ వాడే వస్తువుల్లో మనకు తెలియకుండానే ఉండే క్రిములు శరీరంలోకి ప్రవేశించినపుడు రోగాల బారిన పడతాం.

ఇన్ఫెక్షన్ల నివారణకు అత్యంత సులువైన మార్గం తరచూ చేతులు శుభ్రపరచుకోవటం. అయితే ఎప్పుడు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి, ఎలా కడుక్కోవాలి, పిల్లలకు ఎలా అలవాటు చేయాలి అనే విషయాల పట్ల అవగాహన అవసరం. అనారోగ్యం బారిన పడకుండా ఉండటమే కాదు, ఇతరులకు సోకకుండా ఉండాలన్నా చేతుల శుభ్రత చాలా ముఖ్యం.

రోజంతా రకరకాల వస్తువులను తాకుతున్నప్పుడు చేతులకు క్రిములు అంటుతూనే ఉంటాయి. మళ్ళీ ఆ చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తుడుచుకున్నప్పుడు అవి ఆ భాగాలకు సోకుతాయి. అందుకే చాలా పనులు చేయటానికి ముందు  చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

పెద్దవాళ్ళయితే…

 • ఆహారం సిద్ధం చేయటానికి ముందు
 • గాయాలకు చికిత్స చేసే ముందు
 • కాంటాక్ట్ లెన్సులు పెట్టుకునే ముందు
 • జంతువులను తాకిన తరువాత
 • వాటి వ్యర్థాలు తొలగించిన తరువాత
 • పిల్లల డైపర్లు మార్చిన తరువాత
 • టాయిలెట్ కి వెళ్ళి వచ్చాక
 • ముక్కు చీదాక, దగ్గిన తరువాత
 • చెత్త ఊడ్చి పారబోశాక ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి

చిన్నపిల్లలు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇలాంటి పనులు ఏవి చేసినా చేతులు కడుక్కునేలా అలవాటు చేయాలి. ఎలా కడుక్కోవాలన్నది కూడా చాలా ముఖ్యం. మామూలు నీళ్లతో కంటే సబ్బు నీళ్లతో కడుక్కోవటం చాలా మంచిది. యాంటీ బాక్టీరియల్ సబ్బుల పేర్లతో చేతులు కడుక్కోవటానికి ప్రత్యేకంగా సబ్బులు దొరుకుతున్నా, ఇవి క్రిములను చంపటంలో మామూలు సబ్బులకంటే పెద్దగా మెరుగైనవేమీ కాదు.

పంపు కింద చెయ్యి పెట్టి చేతులు తడుపుకోవాలి. ఆ తరువాత సబ్బు నురగవచ్చేలా కనీసం 20 సెకెన్లపాటు రుద్దుకోవాలి. చేతి వెనుకభాగం, గోళ్ల కింద కూడా వదలకుండా శుభ్రం చేసుకున్న తరువాత మళ్ళీ నీళ్ల పంపు కింద చేయిపెట్టి కడుక్కోవాలి. శుభ్రమైన టవల్ తో చేతులు ఆరేలాగా తుడుచుకోవాలి.

చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలి?

సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు ఒక ప్రత్యామ్నాయంగా మారాయి. సాధారణంగా ఇలాంటి శానిటైజర్లలో 60 శాతం తగ్గకుండా ఆల్కహాల్ ఉంటుంది. జెల్ లా కనిపించే ఇలాంటి శానిటైజర్ ను చేతిలో వేసుకొని రెండు అరచేతులూ కలిపి రుద్దుతూ చేతులు మొత్తం వ్యాపించేలా చూడాలి. ఆ తరువాత చేతులు పూర్తిగా పొడిగా తయారవుతాయి. అయితే పిల్లలు మాత్రం వీలైనంత వరకూ మామూలు నీళ్ళతోను, సబ్బుతోను మాత్రమే చేతులు కడుక్కునేలా చూడాలి.

ఆల్కహాల్ అత్యధికంగా ఉండటం వలన పిల్లలు నేరుగా వాడకుండా పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే వాడేలా చూడాలి. రెండేళ్ళ లోపు పిల్లలైతే వాడవద్దనే చెబుతారు.

ఆల్కహాల్ కు వేగంగా మండే లక్షణం ఉండటం కూడా అందుకు ఒక కారణం. చర్మం బాగా అభివృద్ధి చెందని పిల్లల చర్మాన్ని ఇది దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది”

చేతులు ఎంతసేపు కడుక్కోవాలనేది చాలా మంది అడిగే ప్రశ్న. కనీసం 20 సెకెన్లు కడుక్కోవాలని డాక్టర్లు చెబుతున్నారు.  చేతులు శుభ్రం చేసుకోవటానికి చల్లటి నీరు వాడాలా, వేడి నీరు వాడాలా అనేది కూడా ఇంకో ప్రశ్న.  వేడి నీళ్ళు అందుబాటులో ఉంటే మాత్రం కచ్చితంగా అవే మంచివి. ఎందుకంటే క్రిములను నిర్మూలించటంతోబాటు చేతికి ఉన్న జిడ్డును సైతం తొలగించటానికి సాయపడతాయి.

జిడ్డు ఉండటం వలన క్రిములు, బాక్టీరియా అందులో అతుక్కుపోయి ఉంటాయి. సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు అవి వాడటం వలన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అవి లేనప్పుడు మాత్రమే 60 శాతం తగ్గకుండా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లు వాడాలి. తరచు వాడే వస్తువులను శుభ్రం చేస్తూ వాటిమీద  ఎలాంటి సూక్ష్మజీవులూ లేకుండా జాగ్రత్త పడటం అవసరం.

పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్కూలుకు పంపకుండా ఉండటం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకునేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.

చిన్న పిల్లలు సానిటైజర్లు వాడవచ్చా?

పిల్లల అనారోగ్యం వారి చేతుల అపరిశుభ్రతతోనే మొదలవుతుంది. మురికిలో చేతులు పెట్టి వాటిని నోట్లో పెట్టుకోవటం, కాస్త పెద్దయిన తరువాత కూడా చేతులు సరిగ్గా కడుక్కోకపోవటం లాంటివి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఏటా 2 కోట్ల మందికి పైగా పిల్లలు రకరకాల అనారోగ్యాల కారణంగా స్కూలుకు గైర్హాజరవుతున్నారు. అందుకే పిల్లల్లోనూ, అంతకంటే ముందుగా తల్లిదండ్రుల్లోనూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మీద పరిశుభ్రతాదినం కూడా పాటిస్తున్నారు. అనేక రోగాల బారినుంచి కాపాడుకోవటం అక్షరాలా వాళ్ళ చేతుల్లోనే ఉందన్న సందేశాన్ని తల్లిదండ్రులు, పిల్లలు తెలుసుకోవాలి.  

ఇవి కూడా చదవండి

పండంటి బిడ్డకోసం: గర్భిణీలు ఈ మందులు వాడకపోవడమే మంచిది!

Pregnancy and Amniocentesis (అమ్మ – ఉమ్మనీరు – పండంటి బిడ్డ)

ఆస్థమా ఉంటే స్త్రీలలో సంతానలేమీ సమస్యలు వస్తాయా?

[wpdiscuz-feedback id=”xrgqhfvtak” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

1 thought on “కరోనా వైరస్: పిల్లల చేతికి కరెన్సీ నోట్లు, టివి రిమోట్, సెల్ ఫోన్ ఇస్తున్నారా? జరభద్రం!”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top