Covid-19: ఈ అలవాట్లు నేర్పితే పిల్లలకు కరోనా సోకదు!

Covid-19 and Children

ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ వణికిస్తున్న వ్యాధి కరోనా. అంతకు ముందు ఎయిడ్స్, సార్స్ లాంటి వ్యాధుల తీవ్రతను చవిచూసిన జనం ఈసారి అంతకంటే ఎక్కువగా భయపడుతున్నారు. అయితే, ఈ వ్యాధిబారినపడిన వారిలో పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు  పిల్లల సంఖ్య  బాగా తక్కువగా ఉండటం మాత్రం కొంత ఊరట అనే చెప్పాలి. అయితే, ఎప్పుడు ఎలాంటి రూపం తీసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

కరోనా వ్యాధికి పిల్లలు ప్రభావితమవుతారా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకుతుంది. ఇప్పుడు భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇదివరకే 70 దేశాల్లోని వేలాది మందికి కరోనా వైరస్ సోకింది. చాలా సులభంగా వ్యాపించే అవకాశమున్న అంటువ్యాధి కాబట్టి పరిశుభ్రతే దీని నివారణలో కీలకమని చెప్పాలి. అందుకే పిల్లలకు ప్రత్యేకంగా ఆరోగ్యపు అలవాట్లు నేర్పాల్సిన సందర్భం ఇది.

ఇప్పుడు భారత్ లో కరోనా వైరస్ బాధితులు మొదలయ్యారు. వీళ్ళ సంఖ్య తక్కువే అయినా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పిల్లలలో కరోనా మరణాలు చాలా అరుదుగా చెప్పవచ్చు. అయినప్పటికీ, కరోనా వైరస్ కారణంగా పిల్లలు ఎలా ప్రభావితమవుతారనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పిల్లల్లో కరొనా తీవ్రత ఎలా ఉంది?

పిల్లలలో గతంలో సార్స్ వ్యాధి కూడా ఊహించిన దానికంటే తక్కువగా నమోదైంది. పిల్లలలో నమోదైన కరోనా కేసుల సంఖ్య  ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉంది. చైనా నుండి 44,000 కంటే ఎక్కువ ధృవీకరించబడిన కేసులలో 416 మంది మాత్రమే 9 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల చిన్నారులు ఉన్నారు. వారిలో చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ. ఈ వయస్సులో పిల్లల్లో ఎక్కువగా మరణించలేదు. తక్కువ సంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడుతున్నారు.

వ్యాధి సోకిన పిల్లల్లో తీవ్రమైన లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే, వ్యాప్తి విషయంలో జాగ్రత్త పడాల్సిందే. పిల్లలు మొబైల్ తో ఆడుతుంటారు. ఇలా కూడా వైరస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్కూల్లో చదివే వయస్సు ఉన్న పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. కొరోనా కి వ్యాక్సిన్ లేనప్పుడు, పిల్లల్లో ఈ ప్రాణాంతక వైరస్ సోకకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా  అవసరమైతే పాఠశాల మూసివేయాల్సి ఉంటుంది. ఇలాంటి సీజన్లలో పిల్లలు ఎక్కువగా గుమికూడే ఆటలు సైతం కొంతకాలం నిలిపివేయటం మంచిది

how to take care food habits in children during covid-19
how to take care food habits in children during covid-19

అంతమాత్రాన కరోనా వైరస్ తీవ్రమైనది కాదని అనుకోవటానికి వీల్లేదు. కొత్త వైరస్ కాబట్టి టీకా కనుక్కునేదాకా జాగ్రత్తలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ సోకిన పిల్లల్లో  కనబడే లక్షణాలను తొలిదశలోనే గుర్తించాలి.

కరోనా వైరస్ సోకిన పిల్లల్లో గుర్తించాల్సిన లక్షణాలు

  • వైరస్ సోకిన పిల్లలకు తరచుగా దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు, తలనొప్పి ఉన్నట్లు చైనా వైద్యులు నివేదిస్తున్నారు.
  • పిల్లల్లో సగానికి తక్కువగా జ్వరం వస్తుంది. కొంతమందిలో లక్షణాలు లేవు.
  • చైనాలో కరోనా సోకిన పిల్లలు కౌమారదశలో ఎక్కువ మందికి తేలికపాటి ఇన్ఫెక్షన్లు వచ్చాయి.
  • ఒకటి నుండి రెండు వారాలలో పిల్లలు తిరిగి కోలుకున్నారు.
  • తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే శిశువులకు కూడా తేలికపాటి ఇన్ఫెక్షన్లు వ్యాపించాయి.

కుటుంబాన్ని వైరస్ నుంచి ఎలా కాపాడుకోవచ్చునో తెలుసుకోవాలి. కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గు లేదా తుమ్ముతూ ఉన్నప్పుడు వెలువడే బిందువుల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.

  • వైరస్ సోకిన వ్యక్తి తుమ్మిన వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం, నోరు, ముక్కు లేదా ముఖాన్ని తాక కూడదు.
  • వైరస్ ను నివారించడానికి  చేతులను తరచూ సబ్బు నీటితో కడగాలి, మీ మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోవాలి. 
  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు  నోటికి అడ్డంగా ఏదైనా ఉంచుకోవడం ద్వారా వ్యాప్తిని నివారించవచ్చు.
  • వైరస్ సోకినట్టు అనుమానంగా లేదా అనారోగ్యంగా అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి. 

వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధించడానికి మాత్రమే మాస్క్‌లు అవసరమని గుర్తించాలి. అందువల్ల వేలం వెర్రిగా అందరూ మాస్కులతో రోడ్డెక్కాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న పిల్లలు మాస్కులు తొడగడంమంచిది కాదు.

పిల్లలు స్కూల్ కి వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కరోనాకు టీకాలు ఇంకా కనిపెట్టలేదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యల ద్వారా పిల్లలను కాపాడుకోవాలి. 
  • పిల్లల్ని స్కూళ్లకు పంపే సమయంలో  తల్లిదండ్రులే వారి చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసి పంపటం, వీలైనంత వరకు ముఖాలకు మాస్క్ లు వేసి గాని, కర్చీఫ్ ధరింపజేసిగాని పంపటం అలవాటు చేసుకోవాలి.
  • కళ్లు, ముక్కు, నోటి దగ్గరకు చేతులు, వేళ్లను పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పిల్లల్ని స్కూల్లో కూడా ఎక్కువ సార్లు చేతుల్ని బాగా శుభ్రం చేసుకోమని సూచించాలి.
  • స్కూల్లో ఎవరైనా పిల్లలకు దగ్గు, జలుబు ఉంటే స్కూల్ టీచర్లకు చెప్పమని చెప్పాలి.
  • టిష్యూ పేపర్ నోటికి అడ్డు పెట్టుకొని మాత్రమే దగ్గడం, తుమ్మడం చేయాలి. అలా వాడిన తరువాత అది పారేయాలి.

ఈ వైరస్ అది పడిన ఉపరితలాలమీద 24 గంటల వరకూ సజీవంగా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి లాప్ టాప్స్, టాబ్స్ లాంటివి వాడే విషయంలొ కూడా జాగ్రత్త తీసుకోవాలి. డోర్ హాండిల్స్ లాంటివి కూడా వైరస్ వ్యాప్తికి కారణం కావచ్చుతల్లులు టిఫిన్ బాక్సుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం, పుల్లటి ఫ్రూట్స్ ఇచ్చి పంపటం అలవాటు చేసుకోవాలి.

స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక

స్కూళ్ల నుంచీ పిల్లలు ఇంటికి వచ్చాక వారికి స్నానం చేయించాలి. విడిచిన బట్టల్ని అప్పుడే ఉతకాలి. గుంపుల్లో కాకుండా తక్కువ మందిలో పిల్లలు ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే బయట ఆటలు ఆడనివ్వకపోవటం మేలు. 

పిల్లల్లో ఏ మాత్రం కరోనా లక్షణాల కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఇతర అంటు వ్యాధులకిచ్చే వాక్సిన్లు అన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. పండ్లు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం, తగినంత నిద్ర మన రోగనిరోధకశక్తిని పెంచి ఇలాంటి వైరస్ లు సోకకుండా సహాయపడతాయి.

చివరిగా

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతున్న సమయంలో భారత్ లాంటి ఉష్ణ దేశాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని డాక్టర్లు ఊరడిస్తున్నారు. అదే సమయంలో చిన్నపిల్లల్లో ఈ వ్యాధి వ్యాపించటం చాలా తక్కువగా ఉన్నట్టు నమోదైందన్న వార్తలు తల్లిదండ్రులకు ఎంతో ఊరటనిస్తున్నాయి.

అయితే, అదే సమయంలో ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించే అవకాశాల పట్ల పిల్లల్లో అవగాహన పెంచుతూ పరిశుభ్రత గురించి చెప్పటం ద్వారా అవగాహన పెంచాలని చెబుతున్నారు.

Scroll to Top
Scroll to Top