కరోనా సమయం: ఆస్థమా ఉన్న పిల్లలను కాపాడుకుందాం!

Child-Covid-Asthma

వాయుగొట్టాలు ఉబ్బడం వల్ల ఆస్థమా వ్యాధి వస్తుంది. అయితే ఆ గొట్టాల్లో వాపు రావడానికి కారణమేంటన్న విషయం మాత్రం శాస్తవ్రేత్తలకు కూడా స్పష్టంగా తెలియదు. కానీ ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు చర్మవ్యాధులు ఉన్న చిన్నారులకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

పిల్లల్లోనూ, పెద్దల్లోనూ అస్థమా ఒకే రకంగా ఉంటుందా?

పిల్లల్లో ఆస్థమా లేదా ఉబ్బసం వ్యాధి కూడా పెద్దల్లో లాంటిదే. కాకపోతే అది పిల్లలమీద చూపే ప్రభావం భిన్నంగా ఉంటుంది. పిల్లల ఊపిరితిత్తులు చాలా సులభంగా ఉబ్బుతాయి. దీనివలన ఆస్థమా వస్తుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పనిచేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే చిన్న పిల్లలు, యుక్తవయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

కొన్ని భౌతిక లక్షణాల ఆధారంగా అస్థమాను గుర్తించవచ్చు. అయితే ఆస్థమా వచ్చిన పిల్లలందరిలోనూ లక్షణాలు ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒకే పిల్లవాడిలో కూడా ఒక్కోసారి ఒక్కోరకంగా ఉండవచ్చు.

సాధారణంగా కనబడే లక్షణాలలో ముఖ్యమైనవి

  • ఆడుతున్న సమయంలో దగ్గు రావటం
  • రాత్రిపూట నవ్వుతున్నా, ఏడుస్తున్నా దగ్గటం
  • అదే పనిగా దగ్గటం ఉబ్బసానికి ప్రధాన లక్షణం
  • ఆడుతున్నప్పుడు బాగా నీరసంగా ఉండటం
  • ఎప్పటికప్పుడు బాగా వేగంగా ఊపిరి పీల్చటం కూడా కనిపిస్తుంది
  • ఛాతీ బిగుసుకుపోయినట్టు
  • నొప్పిగా ఉన్నట్టు అనిపించటం
  • గాలి పీలుస్తున్నప్పుడు ఈల లాంటి శబ్దం రావటం
  • శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగటం
  • మరికొంతమందిలో మెడ కండరాలు, ఛాతీ కండరాలు బిగుసుకుపోవచ్చు.
  • మొత్తంగా బాగా బలహీనంగా, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది.

పిల్లల్లో ఆస్థమాను గుర్తించడమెలా?

లక్షణాలతోబాటు డాక్టర్లు ఇతర అంశాలనూ లెక్కలోకి తీసుకున్న తరువాతనే నిర్థారిస్తారు. కానీ ఐదేళ్ళలోపు జరిపే ఆస్థమా పరీక్షలు అంత కచ్చితంగా ఉండకపోవచ్చునని కూడా డాక్టర్లు చెబుతారు. ఇక ఈ ఆస్థమాను ప్రేరేపించే సాధారణ అంశాలను గమనిస్తే ముఖ్యంగా శ్వాసకోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లే ప్రధానమైనవిగా కనిపిస్తాయి.

  • న్యుమోనియా
  • సైనస్ ఇన్ఫెక్షన్లు
  • తీవ్రమైన జలుబు
  • అదే విధంగా కొన్ని అలెర్జీలు కూడా పిల్లల్లో ఆస్థమా కు దారితీస్తాయి.
  • బొద్దింకలు, పెంపుడు జంతువులు, ధూళి లాంటివి అలర్జీ కి కారణం కావచ్చు.
  • కొంతమందిలో వ్యాయామం వలన దగ్గు, శ్వాసలో ఇబ్బంది, చాతీలో ఒత్తిడి కలగవచ్చు.

మరికొంతమంది పిల్లలు వత్తిడికి లోనైనప్పుడు ఊపిరి పీల్చటంలో ఇబ్బంది ఎదురై ఆస్థమా లక్షణాలను మరింత దిగజార్చవచ్చు.

పిల్లల్లో ఆస్థమాను ప్రేరేపించే సాధారణ అంశాలేంటి?

వాతావరణంలో మార్పులు వచ్చినపుడు, వర్షం రాబోయే ముందు, పిల్లలకు ఆస్థమా వస్తుంది. రెండేళ్ళలోపు వయసు పిల్లలలో వచ్చే ఉబ్బసం వ్యాధిని పాల ఉబ్బసం అని అంటారు. ఈ వ్యాధి వయసు పెరుగు తున్న కొద్దీ తగ్గిపోతుంది. ఎందుకంటే, ఎదిగేకొద్దీ ఊపిరితిత్తులలో ఉన్న గాలిగొట్టాలు పెద్దవై, ఊపిరి ఆడడం తేలికవుతుంది. అయితే, కొంతమందిలో ఈ ఉబ్బసం పూర్తిగా తగ్గదు. వ్యాధి రావడం తగ్గడం జరుగుతుంటుంది. జీవితాంతం బాధ పడుతూనే ఉంటారు. చాలామంది పిల్లలకు మాత్రం యుక్తవయసు వచ్చేసరికి ఉబ్బస లక్షణాల తీవ్రత తగ్గుతుంది.

వయసుని బట్టి వ్యాధి తీవ్రతలో మార్పులు ఉంటాయా?

అమ్మాయిలకు బహిష్టులకు ముందు ఉబ్బస లక్షణాలు ఎక్కువ అవుతాయి. చాలామంది పిల్లల్లో ఆస్థమా మూడేళ్ళ వయసులో మొదలవుతుంది. ఏడాదికి 4, 5 సార్లు  వ్యాధి వస్తుంది. ప్రతిసారీ 3 – 4  రోజులపాటు పిల్లలు బాధడతారు. 10-12 సంవత్సరాల వయసు వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోతుంది. అయితే దాదాపు 20 శాతం కేసులలో  మాత్రం ఆస్థమా తీవ్రంగా వస్తుంది. పెద్దవారయ్యాక కూడా ఎటువంటి ఉపశమనం ఉండదు. ఇటువంటి పిల్లలలో ఇతర దుష్ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

వ్యాధి లక్షణాలు కనబడగానే డాక్టర్ ను సంప్రదిస్తే ముందుగా కుటుంబ వైద్య చరిత్ర అడుగుతారు. ఎలాంటి లక్షణాలు ప్రదర్శిస్తున్నదీ తెలుసుకున్న మీదట గుండె, ఊపిరితిత్తులు పరీక్షించి ఏవైనా అలెర్జీ లక్షణాలున్నాయేమో చూస్తారు. ఆ తరువాత ఛాతీకి ఎక్స్ రే తీయిస్తారు. ఆరేళ్ళు దాటిన పిల్లలైతే ఊపిరితిత్తుల పనితీరు పరీక్షించటానికి స్పైరోమెట్రీ పరీక్ష చేస్తారు. దానివలన ఊపిరితిత్తుల్లో ఎంత గాలి ఉంది, దాన్ని ఎంత త్వరగా బైటికి పంపే సామర్థ్యం ఉన్నది అనే విషయాలు తెలుస్తాయి. దీన్నిబట్టి ఆస్థమా తీవ్రతను డాక్టర్ లెక్కించగలుగుతారు. అలెర్జీ చర్మ పరీక్షలు, రక్త పరీక్షలు కూడా ఆస్థమా స్థాయిని నిర్థారిస్తాయి. 

పిల్లల్లో ఆస్థమా ఎంతకాలం ఇబ్బంది పెడుతుంది?

పిల్లల్లో ఆస్థమా లక్షణాలను ప్రేరేపించే పరిస్థితులను గుర్తించి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దీని వలన చాలావరకు వ్యాధిని నివారించవచ్చు. వ్యాధి వచ్చిన తరువాత వెంటనే లక్షణాల ఆధారంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడటం, అన్ని రకాల పొగకూ దూరంగా ఉంచటం కూడా చాలా అవసరం. ఇక చికిత్స విషయానికొస్తే, ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అప్పటికప్పుడు తక్షణం ఊరటనిచ్చే మందుల వాడకం ఒక రకం. ఆస్థమా వచ్చినప్పుడు వాడే మందులు అవి. అలా కాకుండా దీర్ఘకాలం పనిచేసేవి ఇంకో రకం.

పిల్లల్లో ఆస్థమాను నియంత్రించడమెలా?

ఆస్థమాను నియంత్రణలో ఉంచటానికి పనికొచ్చే మందులు ఇవి. రోజూ వాడాల్సిన మందులు ఎప్పుడు ఏ మేరకు వాడాలో డాక్టర్ నిర్ణయిస్తారు. అయితే, వీటిలో చాలా వరకు స్టెరాయిడ్స్ ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. అవి కొన్ని దుష్ఫలితాలనూ ఇస్తాయి. దీర్ఘకాలం వాడితే ఎముకల బోలుతనానికి దారితీయవచ్చు. అంతమాత్రాన చికిత్స చేయకుండా వదిలేయటమూ ప్రమాదకరం కాబట్టి మంచిచెడ్డా బేరీజు వేసుకొని నడుచుకోవాలి. చాలా వ్యాధులలాగానే అస్థమా విషయంలోనూ వీలైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

చిన్నపిల్లలకు పడని పదార్ధాలు గుర్తించాలి. అటువంటి పదార్థాలు వాడినట్టయితే, వెంటనే ఆస్థమా వస్తుంది.

  • ఐస్‌ నీళ్ళు
  • అరటిపండు, చేప

ఇలా చాలా వస్తువులు ఒంటికి సరిపడనివి ఉంటాయి. ఎక్కువగా ఆయాసం ఉన్నపుడు డెరిఫిల్లిన్‌ మాత్రలు వాడాలి. మరీ అత్యవసర పరిస్థితిలో ఇంజెక్షన్‌లు ఇప్పిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

విటమిన్ ‘డి’ ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు.

ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఈ మందులు వేసుకునేందుకు ఇన్‌హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి.

చివరిగా

ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా పిల్లల్లో ఆస్తమా రావడానికి కారణం. చర్మవ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్థమా వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

చాలామంది పిల్లలకు యుక్తవయసు వచ్చేసరికి  అస్థమా లక్షణాల తీవ్రత తగ్గుతుంది. 20 శాతం కేసులలో పెద్దవారయ్యాక కూడా ఎటువంటి ఉపశమనం ఉండదు. ఇటువంటి పిల్లలలో ఇతర దుష్ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆస్థమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. అందులో స్టెరాయిడ్  కూడా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

పిల్లలు త్వరగా నేర్చుకోలేకపోతున్నారా?

మీ పిల్లలు ఇతర పిల్లల్లాగా హుషారుగా లేరా?

పిల్లలకు చర్మ సమస్యలు తగ్గాలంటే ఏంచేయాలి?

[wpdiscuz-feedback id=”p7gwg2n2ev” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top