కరోనాతో వచ్చిన కష్టాలు: ఇలా తట్టుకుని నిలబడవచ్చు!

sad mature businessman thinking about problems in living room

మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ తగ్గిపోయిన తరువాత బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉందని, రీఛార్జ్ చేయమని ఒక నోటిఫికేషన్ ద్వారా ఫోన్ మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే ఛార్జింగ్ తక్కువగా ఉన్న సమయంలో మొబైల్ లో కొన్ని యాప్స్ కూడా పనిచేయవు. అదే సమయంలో వీలైనంత ఎక్కువ సమయం ఫోన్ ఆన్ లో ఉండేలా అప్పటికి ఉన్న ఛార్జింగ్ ని ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటుంది. దీన్నే సర్వైవల్ మోడ్ అంటారు.

ఈ గండం గడిస్తే చాలురా దేవుడా!

అంటే పరిస్థితులు ఏమాత్రం సహకరించని సమయంలో మనలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా మనకు అందుబాటులో ఉన్న వనరుల్ని వాడుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించడం అన్నమాట. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మనమందరం ఉన్నాం.

కరోనా వైరస్ తీసుకొచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనమందరం కొన ప్రాణంతో ఉన్నాం. ఈ గడ్డుకాలంలో, భవిష్యత్తు గురించిన ఆలోచనలను వదిలేసి ‘ఈ గండం గడిస్తే చాలురా దేవుడా’ అనుకునే పరిస్తితికి వచ్చేసాం. మళ్ళీ మనల్ని మనం చార్జ్ చేసుకునే దాకా ఉన్న ఛార్జింగ్ తోనే ఎలా కాలాన్ని వెళ్లదీయాలో ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో దైనందిన జీవితంలో ఎన్నో అవరోధాలతో మనం స్నేహం చేయాల్సి వస్తోంది.

6 ways to face the struggles imposed by Corona Virus
Corona virus pandemic

అన్నీ బాగుంటే అలా పార్క్ కి వెళ్ళి వాకింగ్, జాగింగ్, ఎక్సర్ సైజ్ వంటివి చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అపార్టుమెంటు చుట్టూనో, ఇంటి పట్టునే ఏ హాల్లోనో లేదా బాల్కనీలోనో కాసేపు అటు ఇటు తిరగాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఇది ఇబ్బందికరమే అయినా తప్పదు మరి.

ఈ నియమాలను పాటిద్దాం

 • కరోనా లేని సమయంలో బయటికి వెళ్ళి మనకు నచ్చిన ఆహారం తినేవాళ్లం, కానీ ఇప్పుడది కుదరదు.
 • దొరికిన వాటిలోనే మంచి పౌష్టికాహారం తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
 • మనం ఎంత ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటే కరోనా వైరస్ మనకు అంత దూరంగా ఉంటుంది.
 • పిల్లల స్కూళ్ళతో పాటు మన ఆఫీసులు, వ్యాపారాలు అన్నీ ఇంట్లోకే చేరాయి. మనకు ఏమాత్రం అలవాటులేని ఇలాంటి  పరిస్థితుల్లో చాలా జాగ్రతగా వ్యవహరించాలి.
 • మానసికంగా కలిగే చికాకుల్ని మన అదుపులో ఉంచుకోవాలి లేదంటే సమస్యలు రెట్టింపవుతాయి.

ఒకప్పుడు మనలో ఉన్న హుషారు, ఉత్సాహం కరోనా వచ్చిన తరువాత కనపడకుండా పోయాయి.

మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు

 • జీవితం పట్ల ఆశావాహ దృక్పథంతో ఉండలేకపోతున్నాం. రోజురోజుకీ పనిపట్ల కలిగే ఉత్సుకతని కోల్పోతున్నాం.
 • మన గోల్స్, మన ఆశయాలు, మన ఆలోచనలు గూడుని వదిలి ఎగిరిపోయిన పక్షుల్లా మన మెదడులోంచి వెళ్లిపోయాయి.
 • ఎవరికీ నిద్ర సరిగా పట్టడం లేదు, నిర్ణయాలు తీసుకునే సమర్ధ్యాన్ని కోల్పోతున్నాం.
 • మెల్లగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయే పరిస్థితులకు దగ్గరవుతున్నాం.
 • ఇక్కడే మనకు మనం తోడుగా నిలబడాలి. దేన్నైనా అతికష్టం మీద సాధించినపుడే ఆ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలం.
6 ways to face the struggles imposed by Corona Virus
anxiety

జీవితం అనే నావని సురక్షితమైన, సరైన గమ్యం వైపు తీసుకెళ్ళాల్సిన సమయం ఇది. ఈ సమయంలో మనల్ని మనం స్థిమిత పరచుకోవాలి. దగ్గరగా ఉన్న వనరులను, పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలి. చాలా సమర్ధవంతంగా, గుండె నిబ్బరంతో మన జీవితానికి మనమే ధైర్యాన్ని నూరిపోసుకోవాలి. ఈ సమయం మన జీవితంలో ఒక పెద్ద మలుపు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. మన జీవితంలో బాగా గుర్తుండిపోయే రోజులు కూడా ఇవే.

జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కొన్ని అంశాలు ఆ గడ్డు కాలం నుంచి మనల్ని బయట పడేస్తాయి. చాలా శ్రద్ధతో, జాగరూకతతో వ్యవహరిస్తే మనం ఈ పరిస్థితులను చాలా సులభంగా ఎదురుకోవచ్చు.

మనసు, శరీరం ఒకే చోట ఉండాలి

‘బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్’ ఈ మాట మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాటని మనం పదేపదే గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే కరోనా తెచ్చిన ఈ అంధకార పరిస్థితుల్లో మనమెక్కడున్నామో, ఏం ఆలోచిస్తున్నామో మనమే మర్చిపోతున్నాం.

 • ఈ పరిస్థితులను నేను తట్టుకుని నిలబడతానా?
 • బ్యాంక్ లో నేను దాచుకున్న సేవింగ్స్ ఐపోవచ్చాయి, డబ్బు ఎలా సర్దాలి?
 • పిల్లల చదువులకు అర్ధాంతరంగా బ్రేక్ పడింది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి ?
 • షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న అమ్మా, నాన్నల ఆరోగ్యం క్షీణిస్తే వాళ్ళను నా ఆర్ధిక పరిస్థితులు కాపాడగలవా?
 • మనల్ని అంధోళనకు గురిచేసే ఎన్నో ఆలోచనలతో మన మెదడు నిండిపోయింది. ఇక్కడే మనల్ని మనం పోగొట్టుకుంటున్నాం.
6 ways to face the struggles imposed by Corona Virus
A man suffering with depression

భవిష్యత్తు పట్ల భయాన్ని కలిగించే ఇలాంటి ఆలోచనలు మనల్ని వర్తమానంలో బ్రతకనీయవు. భవిష్యత్తులో జరగబోయే అనర్ధాలను మనకు పదేపదే గుర్తుచేస్తూ మన ప్రస్తుత జీవితాన్ని చిందవందర చేసేస్తాయి. భ్యవిష్యత్తులో మనకు జరగబోయే చెడు గురించి మనం ఎంత ఆలోచిస్తామో, అంత భయం మన మెదడు పోరల్లోకి చేరిపోయి మనకు మనఃశాంతిని, నిద్రను దూరం చేస్తుంది. అందుకే మనం మన మనసుని, ఆలోచనలను ప్రస్తుత పరిస్థితుల్లో ఉంచుకోవడం చాలా అవసరం. మన ప్రస్తుతంలోనే మనం ఉండేలా కొన్ని చిన్న చిన్న మానసిక వ్యాయామాలను నిపుణులు మనకు సూచిస్తున్నారు.

మానసిక వ్యాయామం: ‘నేను ఇక్కడే ఉన్నాను’

ఈ వ్యాయామం చేయడానికి నిశ్శబ్ధంగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చోవాలి, తరువాత కళ్ళు మూసుకుని మెల్లగా దీర్ఘ శ్వాస పీలుస్తూ ‘నేను’ అనాలి. శ్వాస వదులుతూ ‘ఇక్కడే ఉన్నాను’ అని మనసులో అనుకోవాలి. ఇలా పదేపదే ‘నేను ఇక్కడే ఉన్నాను; ‘నేను ఇక్కడే ఉన్నాను’ అని అనుకుంటూ ఉంటే మీ శరీరం, మీ మనసు భవిష్యత్తులో కలిగే భయాందోళనలను వదిలేసి ప్రస్తుత పరిస్థితుల్లోనే నిమగ్నమై ఉంటుంది. ఈ చిన్నపాటి వ్యాయామం మీకు ఎంతో ప్రశాంతతను అందిస్తూ, మీరు డిప్రెషన్ కు గురికాకుండా మీరు చేసే పనిలో మీరు పూర్తిగా నిమగ్నం అయ్యేలా చేస్తుంది.

(ఈ వ్యాయామం ఇక్కడి నుండి సేకరించబడింది The CBT Deck)

ఇది కూడా చదవండి

మానవ సంబంధాలు

కోవిడ్ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది. మామూలు సమయాల్లో మనం స్నేహితులను, బంధువులను ఎక్కువగా గుర్తుచేసుకోకపోయినా పరవాలేదు. కానీ ఈ సమయంలో మనం మనుషులతో సంబంధాలను కొనసాగించాల్సిందే. మన బంధువులు, స్నేహితులు ఎలా ఉన్నారు? వారి జీవితంలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలి.

ఈ క్లిష్ట పరిస్థితిని మనం ఎలా గడుపుతున్నామో కూడా వారికి తెలియజేయాలి. వారితో సత్సంబంధాలను కొనసాగించడానికి వారి ఇంటికి వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. ఫోన్ లో మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టవచ్చు. ఎదుటివారి నుంచి మనకు లభించే అండ మనకు ఎంతో మానసిక బలాన్ని చేకూరుస్తుంది. ఈ సమయంలో ఆలోచనలను పంచుకోవడం ఎంతో అవసరం.

6 ways to face the struggles imposed by Corona Virus
talking on phone

ప్రకృతిలో గడపండి

మన మానసిక ఆనందానికి బలమైన ఔషధం ప్రకృతి. పార్కుల్లో చెట్ల మధ్య తిరుగుతుంటే మన శరీరం, మనసు, ఆత్మ తమ కడుపు నింపుకుంటాయి. వైరస్ విజృంభించిన మొదట్లో కంటే ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నాయి కాబట్టి, విశాలమైన పార్కులు, మైదానాల్లో కాకపోయినా మీ అపార్ట్ మెంటులో ఉండే చెట్ల మధ్యనయినా కాసేపు తిరగండి. లేదా మీ ఇంటి పైకప్పులో మీరు పెంచుకున్న మొక్కల మధ్య కాస్త సమయం గడపండి.

మొక్కలకు నీళ్ళు పోయడం, కుండీలో మట్టిని మార్చడం వంటి పనులు మీకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. రోజులో కొన్ని నిమిషాలయినా మీ మొబైల్ ఫోన్ పక్కన పెట్టి పక్షుల అరుపులు వినండి, ఆకాశం వైపు చూడండి, స్వచ్చమైన గాలిని పీల్చండి, ప్రకృతిలో ఏంజరుగుతుందో తెలుసుకోండి. ఇవన్నీ మీలోని నిరాశ, నిస్పృహల్ని దూరం చేసి, జీవితం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతాయి.

6 ways to face the struggles imposed by Corona Virus
walking in the nature

శరీరాన్ని కదిలించండి

మానసిక ఒత్తిడి తగ్గడానికి, శరీరం ఉత్సాహంగా ఉండటానికి, ఆందోళనని దూరం చేసుకోవడానికి శారీరక వ్యాయామం చాలా అవసరం. అయితే ఇంతకుముందులా గంటల తరబడి వ్యాయామం చేయడం ఈ కోవిడ్ కాలంలో కుదరకపోవచ్చు. అయినా కూడా కొద్దిపాటి శారీరక కదలికలు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

శరీరం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాటానికి, మన ఆలోచనలను సజీవంగా ఉంచటానికి శారీరక కదలికలు దోహదం చేస్తాయి. అందుకే ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడూ నిల్చోవాలి. తాగటానికి గ్లాస్ నీళ్ళు కావాలంటే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. వీలైనపుడు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నా రోజూ కొన్ని నిమిషాలైనా శారీరక శ్రమను చేయడం మాత్రం మరవకూడదు.

ఇది కూడా చదవండి

నిద్ర

జీవితం ఎలా ఉన్నా, నిద్ర నిలకడగా ఉండాలనేది ఓ నానుడి. శరీరం ఏ ఇబ్బందులూ లేకుండా మనుగడ సాగించాలంటే ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. అయితే నిద్ర, మానసిక ఆందోళన ఈ రెండూ బద్ద శత్రువులు. ఒకటి మనతో ఉంటే ఇంకోటి మన దగ్గరికి రాదు. కొన్నిసార్లు ఎక్కువ పని చేయాలన్న ఒత్తిడిలో నిద్రకు మనమే దూరమవుతాం. ఇంకొన్నిసార్లు మానసిక ఒత్తిళ్ల కారణంగా మనకు నిద్ర సరిగా పట్టదు.

అయితే ఈ కోవిడ్ కాలంలో శరీరానికి మంచి నిద్ర చాలా అవసరం. ఎక్కువ గంటలు నిద్రపోవడం కన్నా నిద్ర పోయిన కొన్ని గంటలైనా మంచి నిద్రలోకి జారుకోవడం అవసరం అంటున్నాయి పరిశోధనలు. దీనికోసం రాత్రి నిద్రపోయే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ జీవితభాగస్వామితో ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడండి లేదా ఏదైనా పుస్తకం చదవడం ద్వారా కూడా మంచి నిద్రలోకి జారుకోవచ్చు.

6 ways to face the struggles imposed by Corona Virus
A woman sleeping

దైవానుభూతి పొందుతున్నపుడు కలిగే ఆనందంతో నిద్రను ఆహ్వానించాలి. వీలైతే నిద్రని ఒక అధ్యాత్మిక చర్యగా భావించాలి. నిద్రకు మీ నమ్మకాన్ని జోడించి దాన్ని బలంగా అనుభూతి చెందాలి. నిద్రకు ఉపక్రమించిన సమయంలో మీరు చేసే రోజువారీ పనుల గురించి మరిచిపోవాలి. మీ శరీరాన్ని ఆత్మని కలిపే ఒక పవిత్రమైన చర్యగా నిద్రని భావించాలి. అప్పుడే మీ కంటి నిండా మంచి నిద్రను నింపుకోగలుగుతారు.

ఇలా విశ్రాంతిని పొందండి

మన నాడీ వ్యవస్థలు మానసిక ఒత్తిళ్లతో ఎన్నో యుద్ధాలు చేస్తుంటాయి. శరీరం ఎప్పుడూ ఒత్తిడికి గురవుతూ ఉంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే శరీరంలోని  ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను ఎప్పుడూ అన్వేషిస్తూ ఉండాలి. శరీరాన్ని వీలైనంత వరకు విశ్రాంత పరుస్తూ ఉండాలి. దీనికోసం ఒక అరవై సెకన్ల పాటు శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేయవచ్చు.

శ్వాస వ్యాయామం – 2-4-2 పద్ధతిలో ఊపిరి పీల్చాలి

ఒకచోట ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. శ్వాసని లోపలికి పీల్చి రెండు అంకెలు లెక్కపెట్టాలి. శ్వాసని వదిలి నాలుగు అంకెలు లెక్కపెట్టాలి. తరువాత మళ్ళీ శ్వాసని పీల్చి రెండు లెక్కపెట్టాలి. ఇలా ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా శ్వాస సంబంధ వ్యాయామం చేయడం ద్వారా మీ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. మెల్లగా శ్వాస తీసుకుని వదలడం వల్ల మీ ఆందోళన కూడా తగ్గుతుంది.

(ఈ వ్యాయామం ఇక్కడ నుండి సేకరించడం జరిగినది The CBT Deck for Anxiety, Rumination, & Worry)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top